– ఐటీఎఫ్ మహిళల ఓపెన్ 2024
న్యూఢిల్లీ: భారత వర్థమాన టెన్నిస్ క్రీడాకారిణి అంకిత రైనా డబుల్ ధమాకా. మహిళల సింగిల్స్‌లో అద్భుత విజయంతో సెమీఫైనల్లో అడుగుపెట్టిన అంకిత రైనా.. మహిళల డబుల్స్‌లోనూ విజయం సాధించింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్‌ఫైనల్లో అంకిత రైనా 4-6, 6-2, 6-4తో మూడు సెట్ల మ్యాచ్‌లో పోరాట పటిమ కనబరిచింది. స్వీడన్ అమ్మాయి జాక్వలైన్ తొలి సెట్లో అంకితపై పైచేయి సాధించగా.. రెండో సెట్లో అంకిత రెచ్చిపోయింది. 5-1తో జాక్వలైన్‌పై పైచేయి సాధించింది. నిర్ణయాత్మక మూడో సెట్లో అంకిత రైనా ఆరంభంలో తడబడింది. 2-4తో వెనుకంజ వేసింది. సెమీఫైనల్ బెర్త్ చేజారుతున్న తరుణంలో పుంజుకున్న అంకిత రైనా.. ఆ తర్వాత వరుస గేముల్లో గెలుపొందింది. 6-4తో జాక్వలైన్‌ను చిత్తు చేసి సెమీఫైనల్లోకి ప్రవేశించింది. మహిళల డబుల్స్‌లోనూ అంకిత రైనా కజకిస్థాన్ అమ్మాయి జిబెక్‌తో కలిసి 7-5, 6-2తో రియా, ఒజెకి జంటపై వరుస సెట్లలో విజయం సాధించింది. ఇక మహిళల సింగిల్స్‌లో సహజ యమలపల్లి నిరాశపరిచింది. టాప్ సీడ్ డాలియ (స్లోవేకియా) చేతిలో 5-7, 6-3, 0-6తో సహజ పరాజయం పాలైంది.