ఆయిల్ ఫాం సాగు రాష్ట్ర సదస్సును జయప్రదం చేయండి: అన్నవరపు సత్యనారాయణ 

నవతెలంగాణ – అశ్వారావుపేట
ఈ నెల 15 వ తేదీ శనివారం ఏఐకేఎస్ అనుబంధ  తెలంగాణ రైతు సంఘం ఆద్వర్యంలో అశ్వారావుపేట లో నిర్వహించే ఆయిల్ ఫాం సాగు దారుల రాష్ట్ర స్థాయి సదస్సును జయప్రదం చేయాలని ఆ సంఘం రాష్ట్ర నాయకులు అన్నవరపు సత్యనారాయణ సంఘం శ్రేణులకు,ఆయిల్ ఫాం సాగు దారులకు పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక ప్రజాసంఘాల కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముఖ్య నాయకుల  సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సదస్సుకు ఏఐకేఎస్ కేంద్రకమిటీ సభ్యులు జూలకంటి రంగారెడ్డి,తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్ రావు లు హాజరు అవుతారని తెలిపారు. సాగు దారుల సదస్సు అనంతరం ఆయిల్ ఫాం సాగు,యాజమాన్య పద్దతులు పై ఉద్యాన శాస్త్రవేత్తలు,శాఖ నిపుణులు తో అవగాహన శిబిరం ఉంటుందని అన్నారు. ఈ సదస్సులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు టన్ను గెలలు కు కనీస మద్దతు ధర రూ.20 వేలు ఇచ్చే విధంగా,ఆయిల్ ఫాం సాగు కోసం ఆయిల్ ఫెడ్ సాగు దారులకు అందించే రాయితీ లు,ఋణం సదుపాయాలు,సాగు పై శాస్త్రీయ అవగాహన,ఉద్యాన శాఖ నిపుణులు చే నిశిత పర్యవేక్షణ,ఆయిల్ ఫాం పరిశోధన కేంద్రం ఏర్పాటు దిశగా తీర్మానాలు ఉంటాయని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సాగు దారులు అధిక సంఖ్యలో హాజరై ఈ సదస్సును విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర నాయకులు కొక్కెరపాటి పుల్లయ్య,స్థానిక నాయకులు కొండ బోయిన వెంకటేశ్వరరావు,దొడ్డా లక్ష్మినారాయణ,మోరంపుడి శ్రీనివాసరావు,తగరం జగన్నాధం,కలపాల భద్రం లు పాల్గొన్నారు.