వినూత్న చిత్రీకరణతో ఆశ్చర్యపరిచిన ‘ఆనీ హాల్‌’

'Annie Hall' surprised with innovative filmingప్రేమ అహేతుకమైనది, వెర్రిది, అసంబద్ధమైనది, కానీ జీవితానికి అది అవసరం. ప్రేమ కలుగుతుంది, కరిగిపోతుంది. మనిషి జీవితంలో అది వచ్చి పోయే ఆనందం. ఒక మనిషి మనసులో ఏం జరుగుతుంటుందో ఎవరికీ అర్ధం కాదు. చాలా సందర్భాలలో తన ఆలోచనల ధ్వని ఆ మనిషికి కూడా అర్ధం కాదు. అలాంటి ఓ వ్యక్తి ప్రేమ కథ ‘అనీ హాల్‌’. నాలుగు అకాడమీ అవార్డులు గెలుచుకున్న ఈ చిత్రం ప్రపంచ మేధావులెందరినో ఆకట్టుకుంది. ఎన్నో సందర్భాలలో ప్రపంచ సినిమాలో ఓ గొప్ప సినిమాగా ‘ఆనీ హాల్‌’ ప్రస్తావన కొస్తుంది.
వూడీ ఆలెన్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అమెరికా సంస్కతిలో ఓ ప్రభంజనం సష్టించింది. స్క్రీన్‌ ప్లే గురించి సినిమాను అధ్యయనం చేసే ప్రతి ఒక్కరూ ఈ సినిమాను చెప్పుకుంటారు. నిజానికి ఇది ఓ విషాద ప్రేమ కథ. కాని కామెడీగా మలచి తీసిన సినిమా. విషాదం, హాస్యం, మిళితమైన ఆనీ హాల్‌ ప్రేక్షకులకు ఒకోసారి ఒకోరకంగా అర్ధమై విస్మయానికి గురి చేస్తుంది. ముఖ్యంగా ఈ సినిమాలో సంభాషణలు హాస్యాస్పదంగానే ఉంటూ ఎంతో గాంభీర్యాన్ని మోసుకువస్తాయి. ముఖ్యంగా స్త్రీ పురుష సంబంధాలలోని రహస్యాత్మకతను చర్చించిన చిత్రంగా దీన్ని చూడవచ్చు.
ఒక వ్యక్తి పట్ల ఆకర్షణ ఎందుకు కలుగుతుంది అన్నది చెప్పలేం. ఆ ఆకర్షణ పెరిగి పెరిగి చివరకి హఠాత్తుగా తగ్గిపోతుంది. కొన్ని సందర్భాలలో ఎంతో కావాలి అనుకున్న ఆ వ్యక్తి సాంగత్యం తరువాత భరింపశక్యం కాకుండా మారుతుంది. ఇది మనసు ఆడే ఆట. దీనికి కారణాలు వెతికితే అవి మన మనసునే వేలెత్తి చూపుతాయి.
ప్రేమ కలగడానికి ప్రత్యేకమైన కారణం లేనట్లే, అది మాయమవడానికి పెద్ద కారణాలు ఉండక్కర్లేదు. మనసు కొన్ని విషయాలను దాటి ముందుకు వెళ్లిపోతుంది అంతే. ఆ స్థితిని అంగీకరించిన మనిషి, ఆ మార్పుకు ఆశ్చర్యపోతాడు. అసలు తన మనసులో ఏం జరిగిందో అర్ధం కాని అయోమయానికి గురవుతాడు. మగవాళ్లు బాహాటంగానే తమ మనసు ఎదుర్కొనే ఇలాంటి గందరగోళాన్ని అంగీకరిస్తారు. కొంతమంది మానసిక శాస్త్రవేత్తలు మగవాని ప్రేమ శరీరానికి సంబంధించినది అని, స్త్రీ ప్రేమ భావోద్వేగాలకు సంబంధించినది అని అంటారు. ఈ తేడాను ఒప్పుకుంటూనే ఇద్దరిలోనూ ఈ ప్రేమ రాహిత్యపు స్థితి అనుభవంలోకి రావడం మనకు తెలుస్తూ ఉంటుంది. ఒకప్పుడు తాము ఒకరినొకరు ఎంతగా కోరుకున్నారో ఇప్పుడు విడిపోవడాన్ని కూడా అంతే గాఢంగా కోరుకుంటున్నందుకు ఆశ్చర్యపోయే జంటలు మన చుట్టూ ఎన్నో కనిపిస్తాయి.
అలాంటి ఆశ్చర్యానికి గురయిన ఓ వ్యక్తి తన ప్రేమ కథను మనకు వినిపిస్తాడు. ఇతని పూర్తి పేరు ఆల్వీ సింగర్‌. ఒక సంవత్సరం క్రితం విడిపోయిన ప్రేయసి ఆనీ హాల్‌ను గుర్తుకు తెచ్చుకుంటూ అసలు తమ మధ్య ఈ దూరం ఎందుకు పెరిగిందో విశ్లేషించుకునే క్రమంలో తన గతాన్ని మనకు వినిపిస్తాడు. దర్శకుడిగా వూడి అలెన్‌ ఈ సినిమా కథ చెప్పే పద్ధతి వినూత్నంగా ఉంటుంది. సినీ మేకింగ్‌లో అప్పటి దాకా ఎవరూ ఉపయోగించని టెక్నిక్‌ అది. నడుస్తున్న సన్నివేశం నుండి బైటికి లోపలికి చొచ్చుకు వస్తూ అప్పుడప్పుడూ ఓ వ్యాఖ్యాతగా, ఓ కథకుడుగా మారిపోతూ మళ్ళీ తానే పాత్రగా కనిపిస్తూ కథనం వైపుకు ప్రేక్షకులను తీసుకువెళతాడు దర్శకుడు.
అల్వీ ఒక కమెడియన్‌గా పని చేస్తూ ఉంటాడు. టెన్నిస్‌ ఆటలో అతనికి అనీ హాల్‌తో పరిచయమౌతుంది. ఒకరితో ఒకరు సంభాషించుకోవాలనే కోరికతో మొదలయిన ఈ పరిచయం క్రమంగా డేటింగ్‌ చేసే వరకు వెళుతుంది. ఈ తొలి పరిచయంలోనే ప్రేక్షకులకు వారిద్దరి మధ్య ఏర్పడ్డ ఆకర్షణ అర్ధం అవుతుంది. చిన్నప్పటి నుండి అల్వీ తల్లితో సహా ప్రతి ఒక్కరినీ తన ప్రశ్నలతో వేధిస్తూ పెరుగుతాడు. మనసులో ఓ ఆలోచనన వచ్చి చేరగానే దాన్ని ప్రయోగానికి పెట్టడం అతనికి అలవాటు. ఆరేళ్ళ వయసులోనే ఓ అమ్మాయి నచ్చిందని ముద్దు పెట్టి ఆ అమ్మాయి అదే తమకంతో ఆ ముద్దును స్వీకరించలేదని తెలిసి ఆశ్చర్యపోతాడు అల్వీ. తన కొలమానాలతో జీవితాన్ని చూడడం అతనికి అలవాటు. అందుకే ఇతరులకు అర్ధం కాని విషయాలు, ఒప్పుకోని అనుభవాలు అతనికి సాధారణమైనవిగా కనిపిస్తూ ఉంటాయి.
ప్రియురాలు అనీతో సినిమాకు వెళ్దామని బయలుదేరి సినిమా మొదలై రెండు నిముషాలయిపోయిందని తెలిసి తాను మొదటి నుండి తప్ప సినిమా చూడలేనని లోపలికి రానని వాదన పెట్టుకుంటాడు అల్వీ. ఈ వాదన పెట్టుకునే సమయంలో లోపలికెళ్లి కథ మొదలయేలోపు సినిమా చూసేవాళ్లం అంటుంది ఆనీ. కాని సినిమా అలా చూడకూడదంటాదు అల్వీ. థియేటర్‌ నుండి అనీని కూడా బైటికి తీసుకొచ్చేస్తాడు. ఈ సంఘటనతో ఆల్వీ మనస్థత్వం అర్ధమౌతుంది ప్రేక్షకులకు.
అంతకు ముందు అల్వీకి రెండు వివాహాలు అయ్యాయి. ఆ ఇద్దరు భార్యలతోనూ విడిపోవడం వెనుక ఉన్నవి అతి చిన్న కారణాలు. తనను నచ్చి దగ్గరకు చేరిన అ స్త్రీల ఇష్టాలకు తన ఇష్టాలకు పోలిక లేదనే ఒకే కారణంతో వారితో బంధం తెంచుకుంటాడు అల్వీ. పైగా ఇలా విడిపోవడాన్ని చాలా సాధారణమైన విషయంగానే చూస్తాడు. కాని ఆ ఇద్దరు భార్యలకన్నా ఆనీ హాల్‌తో తన సాహచర్యం లోతైనదని అర్ధవంతమైనదని అల్వీ భావిస్తాడు. అనీ దగ్గర లేనప్పుడు ఓ లోటును కూడా అనుభవిస్తాడు. ఇద్దరూ కలిసి చిన్న చిన్న పనులు చేసుకుంటూ, వంట చేసుకుంటూ చాలా ఆనందంగా కాలం గడుపుతుంటారు.
అల్వీకి మరణం గురించి ఆలోచనలు వస్తూ ఉంటాయి. పైగా ఆనీకి ప్రేమ కానుకలంటూ మరణం గురించి రాసిన పుస్తకాలను ఇస్తుంటారు. అనీ తాను అల్వీని ప్రేమిస్తున్నానని చెబుతుంది. అల్వీ కూడా తనకు ఆమెపై ప్రేమ ఉందని ఒప్పుకుంటాడు. ఇద్దరూ కలిసి జీవించడం మొదలెడతారు. దీనికి అల్వీ మొదట ఇబ్బంది పడతాడు. అనీతో మొదటిసారి శారీరకంగా కలిసిన తరువాత ఆనీలో ఓ తప్తి కనిపిస్తే అల్వీ మాత్రం మరో నవల పూర్తి చేయడం అయిపోయింది అని అంటాడు. ఈ సన్నివేశంలో అల్వీ, అనీల సంభాషణ చాలా స్పష్టంగా ప్రేమ పట్ల స్త్రీ పురుషుల దక్పథాన్ని వ్యక్తీకరిస్తుంది. ఆనీకి అది అనుభూతి ప్రధానమైన క్షణమైతే ఆల్వీకి అది మరో అనుభవం మాత్రమే. ప్రేమ పట్ల, శారీరక కలయిక పట్ల స్త్రీ పురుషుల ఆలోచనల మధ్య ఉండే బేధాన్ని ఇక్కడ నిజాయితీగా ప్రస్తావిస్తాడు దర్శకుడు వూడి ఆలెన్‌. మరో సందర్భంలో ఆనీ, ఆల్వీ కొన్నాళ్ళు కలిసున్న తరువాత ఓ రాత్రి శారీరకంగా ఒకటవుతున్న సమయంలో ఆని ఆత్మ ఆమె శరీరంలోనించి విడిపోయి బైటికి వెళ్లిపోయినట్లు అనిపిస్తుంది ఆల్వీకి. ఈ కలయికలో ఆనీ పూర్తిగా తనతో లేదని, తాను కోరికున్న దగ్గరితనం మెల్లి మెల్లిగా ఈ బంధంలో కనుమరుగై పోతుందని ఆల్వీకి అనిపిస్తుంది. ప్రేమ పేరుతో ఒకటయిన జంట కొన్ని రోజుల తరువాత అలవాటుగా జీవిస్తూ పోతారు తప్ప వారి మధ్య మునుపటి ఉత్సాహం ఉండదు. రొటీన్‌గా జీవించడం, శరీరాలు పంచుకోవడం జరిగిపోతుంది. ఈ విషయాన్ని చూపించే సన్నివేశం చాలామందికి తమ జీవితాలలోని లోటును గుర్తు చేస్తుంది.
అల్వీ యూదుడు, ఆనీ క్రిస్టియన్‌. ఆనీ కుటుంబంతో ఓ సారి కలిసి భోంచేస్తూ అల్వీ తమ రెండు కుటుంబాల మధ్య ఉన్న సాంస్కతిక తేడాలను గమనిస్తాడు. ఆనీ నాన్నమ్మ కళ్లలో తనపై కోపాన్ని, అసహ్యాన్ని చూస్తాడు. తమ నేపథ్యాలలోని తేడా అతనికి గుర్తు కొస్తుంది. ఇది అతన్ని కొంత ఇబ్బందికి గురి చేస్తుంది. ఓ సారి ఆనీ తన ప్రొఫెసర్‌తో చేతులు కలిపి నడిచివెళ్లడం అల్వీ చూస్తాడు. ఆమెను వారిద్దరి మధ్య ఉన్న స్నేహం గురించి అడుగుతాడు. దీనితో ఆనీకి కోపం వస్తుంది. ఇద్దరూ గొడవ పడి విడిపోతారు. అల్వీ మానవ సంబంధాల గురించి అయోమయంలో పడిపోతాడు. కనిపించిన వారందరినీ ప్రేమ గురించి ఆరా తీస్తాడు. ఎవరికీ అది పూర్తిగా అందనిదని, అర్ధం కానిదని అతనికి అనిపిస్తుంది. మరో అమ్మాయితో డేటింగ్‌ మొదలెడతాడు. ఆమెతో రాత్రి గడుపుతున్నప్పుడు ఆనీ తన ఇంట్లోని స్నానాల గదిలో సాలీడు ను చూసి జడుసుకుని అల్వీకి ఫోన్‌ చేస్తే ఆ అర్ధరాత్రి ఆమె దగ్గరకు సంతోషంగా కొత్త గర్ల్‌ఫ్రెండ్‌ ని వదిలి మరీ పరుగెత్తుకుంటూ వెళతాడు. ఇద్దరూ ఎప్పటికీ కలిసి ఉందామని ప్రమాణాలు చేసుకుని మళ్లీ జంటగా జీవించడం మొదలెడతారు. కాని వారి మధ్య ఆ పాత ప్రేమ తగ్గిపోయిందని ఇద్దరికీ అనిపిస్తూ ఉంటుంది.
అల్వీతో తాను కలిసి ఉండలేనని అనిపించి ఆనీ మరో స్నేహితుడితో ఆ ఊరు నుండి వెళ్లిపోతుంది. ఆమెను మర్చిపోలేక ఓ సారి ఆమె ఉండే ఊరుకు వెళ్లి ఇద్దరం మళ్ళీ కలిసి ఉందాం అని అడుగుతాడు అల్వీ. కాని తాము ఇక ఎప్పటికీ కలవలేమని అతనికి నిక్కచ్చిగా చెప్పి అతని జీవితంలో నుంచి శాశ్వతంగా తప్పుకుంటుంది ఆనీ.
అల్వీ తమ పరిచయాన్ని ఓ నాటకంగా రాసుకుంటాడు. కాని చివరి సీన్లో మళ్ళీ తానూ, ఆనీ తిరిగి కలిసిపోయినట్లు ముగింపు ఇచ్చుకుని తప్తిపడతాడు. తాము గడిపిన రోజులను జ్ఞాపకాలుగా మిగుల్చుకుని ఒంటరిగా మిగిలిపోతాడు అల్వీ. తమ మధ్య ప్రేమ ఎందుకు తగ్గిపోయిందో అర్ధం కాలేదంటూ అతను వాపోతూ గడిచిన మధురమైన రోజుల్ని గుర్తు చేసుకుంటుండగా సినిమా ముగుస్తుంది. తాను ఆనందాన్ని పొందానని, కాని దాన్ని శాశ్వతంగా నిలుపుకోలేక పోయానని అల్వీ నిట్టూర్చడం ఆఖరి ఘట్టం.
సినిమా టేకింగ్‌ కొత్తగా ఉండడం, సన్నివేశం నడుస్తుండగా అల్వీ పాత్ర వ్యాఖ్యాతగా మారి ప్రేక్షకులతో సంభాషించడం, పూర్తి సినిమా అంతా సంభాషణల ఆధారంగానే నడవడం, ఇలాంటి కథనం ఆ తరువాతి సినీ దర్శకులలో వినూత్నమైన ప్రయోగాలకు తెర తీసాయి. ఈ సినిమా లోని ఫొటోగ్రఫీ కూడా కొత్తగా ఉంటుంది.
రెండు నగరాలలో షూట్‌ చేసిన సన్నివేశాలలో స్పష్టమైన తేడా కనిపిస్తుంది. అలాగే ఆనీ హాల్‌ పాత్రధారి డయాన్‌ కీటన్‌ వస్త్రధారణ డెబ్భైల దశకంలోని ఫ్యాషన్‌ ప్రపంచంలో ఓ ట్రేడ్‌మార్క్‌గా మారింది. చాలామంది ఇది వూడి ఆలెన్‌, డయాన్‌ కీటన్‌ల నిజ జీవిత ప్రేమ కథ అని అంటారు. డయాన్‌ ముద్దు పేరు ఆనీ అవడం ఆమె అసలు ఇంటి పేరు హాల్‌ అవడం వల్ల కూడా ప్రేక్షకులు ఇది వారి ప్రేమ కథ అని అనుకున్నారు. అది ఈ సినిమాకు అదనపు ఆకర్షణ అయింది. కాని తాను, తన మెదడులోని గందరగోళంతో అయోమయానికి గురయే ఓ మగవాడి మనసులోకి ప్రేక్షకులను తీసుకువెళ్లాలని అనుకున్నానని కాని చూసే ప్రేక్షకులు ఇది తమ అసలు కథ అవునా కాదా అన్న వాదనల దగ్గరే నిలిచిపోయారని వూడి అలెన్‌ చాలా సందర్భాలలో అసంతప్తి వ్యక్తం చేశారు. అందువల్ల తాను చెప్పాలనుకున్నది పూర్తిగా చెప్పలేకపోయానని బాధపడ్డారు.
ప్రేమ గురించి అతిగా ఆలోచిస్తూ ఒక బంధం నుండి మరో బంధం వైపుకు త్వర త్వరగా పరుగులు తీసే యువత మనోభావాలకు దర్పణం ఈ చిత్రం. ఈ గందరగోళంలో తమ జీవితంలోకి ప్రేమ వచ్చి పోవడం కూడా వీళ్లు గమనించలేరు. తరువాత ఆ బంధానికి బీటలు పడి జీవితంలోంచి ప్రేమ నిష్క్రమించాక పోగొట్టుకున్న ప్రేమ విలువ తెలిసి అల్లాడినా ఆ గడిచిన రోజుల బాంధవ్యం మళ్ళీ చిగురించదు. మిగిలేది ఒంటరితనమే. ఈ నిజాన్ని చర్చించిన చిత్రంగా ఆనీ హాల్‌ను చూడవచ్చు.
సినిమాలోని కథ నచ్చని వారు, అల్వీ లోని గందరగోళానికి చిరాకు పడే ప్రేక్షకులు కూడా ఈ సినిమాను తీసిన పద్ధతిని మెచ్చుకుంటారు. అప్పటిదాకా ఒకే శైలిలో వెళ్తున్న సినిమా నిర్మాణాన్ని వినూత్నమైన కథనం దిశగా ప్రయోగాల వైపుకు మళ్ళించిన సినిమా ఇది. ఇందులో ప్రేమికులు విడిపోవడంలో ఒకరినొకరు తప్పు పట్టుకోరు. ప్రేమ కొన్ని సార్లు మాయమవుతుంది అన్నది చాలా సహజంగా జరుగుతుందనే మానసిక శాస్త్రవేత్తల వాదాన్ని బలపరుస్తుంది ఈ చిత్రం.
పాత్రల మానసిక విశ్లేషణలో కామెడి జోడించి ఆ పాత్రల వ్యక్తిత్వాన్ని ప్రదర్శించడం బహుశా ఈ సినిమాతోనే ప్రేక్షకుల ఆదరణ పొందిందేమో. ఎందుకంటే ఆ తరువాత సినీ ప్రపంచంలో ప్రయోగాలకు సిద్దపడిన గొప్ప దర్శకులందరూ ఈ సినిమానే ప్రప్రధమంగా పరిగణంలోకి తీసుకున్నట్లు ఒప్పుకున్నారు. ఆనీ అల్వీల మధ్య నడిచే సంభాషణను గమనిస్తే వారి మధ్య శారీరక బంధం కన్నా పరస్పర సంభాషణల ద్వారా ఆలోచనలను పంచుకోవడంలోని ఆనందం, థ్రిల్‌ ఆ బంధానికి పునాదిగా కనిపిస్తుంది. ఎప్పుడయితే ఆ సంభాషణలు వారి మధ్య అంతరించిపోతాయో ఇక శారీరక కలయికలో కూడా విసుగు వచ్చి చేరుతుంది. ఆ తరువాత కలిసి ఆనందంగా ఉన్నట్లు కనిపించడం ఒకరినొకరు మోసం చేసుకోవడానికి సాగించే నటనగా మారుతుంది. అలా నటించే వ్యక్తిత్వం ఉన్నవారు కానందువలన ఆనీ అల్వీలు విడిపోతారు. తమ మధ్య మాట్లాడుకునే విషయాలు లేకపోవడమే వారి మధ్య ప్రేమ మరణించడానికి కారణమన్నది కూడా ఈ సినిమా చర్చించే విషయం. ఆల్వీతో ప్రేమ గురించి ప్రస్తావన వచ్చినప్పుడు నువ్వేం చేశావన్నది కాదు, కొన్ని సార్లు ప్రేమ పోతుంది అంతే అని చెబుతూ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదన్న విషయాన్ని స్పష్టం చేస్తుంది. వూడి అలెన్‌ దర్శకత్వం వహించిన సినిమాలన్నిటిలోనూ ఇది ప్రధమ వరుసలో నిలిచే చిత్రం. అన్లీ పాత్రలో వూడి అలెన్‌, ఆనీ పాత్రలో డయాన్‌ కీటన్‌ సినీ చరిత్రలో సజీవంగా నిలిచిపోయారు.
– పి.జ్యోతి,
98853 84740