– భూభారతిని ఆహ్వానిస్తున్నా : మండలిలో నర్సిరెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ధరణి పోర్టల్ సరికాదంటూ ఆనాడే చెప్పానని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతిని ఆహ్వానిస్తున్నానని చెప్పారు. శాసనమండలిలో శనివారం భూభారతి బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూసంస్కరణల చట్టం-1971లో ఏముందో, దానిపై అవగాహన కల్పించేందుకు ప్రకటనలు ఇవ్వాలని సూచించారు. ఒక్కొక్కరు 600 ఎకరాలు, 200 ఎకరాలు ఉన్నాయంటూ ప్రకటించడం సరైంది కాదన్నారు. ఆ చట్టానికి విరుద్ధమని అన్నారు. ఆ చట్టం గురించి అందరికీ తెలిసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మట్టి పూసుకునే వారే నిజమైన రైతులని చెప్పారు. కౌలురైతులనూ ప్రభుత్వం గుర్తించాలని కోరారు. 2014, జూన్ రెండు కంటే ముందు వారికే సాదాబైనామా వర్తిస్తుందంటూ ప్రచారం జరుగుతున్నదనీ, దానిపై స్పష్టత ఇవ్వాలని సూచించారు. తన సొంత గ్రామంలో దేవాదాయ భూములే లేవన్నారు. పది మందికి దేవాదాయ భూములుగా ధరణిలో పొందుపర్చారని వివరించారు. జిల్లా కలెక్టర్ వద్దకు తాను స్వయంగా ఎమ్మెల్సీ హోదాలో వెళ్లి ఆ సమస్యను పరిష్కరించాల్సి వచ్చిందన్నారు. దీంతో వారికి విముక్తి కలిగిందని చెప్పారు. సామాన్యుల సమస్యలు పరిష్కారమయ్యే పరిస్థితి లేదన్నారు. ధరణి పార్ట్-బీలో ప్రభుత్వ భూములు, ఇతర సమస్యలపై సమస్య ఉంటే ఇబ్బంది లేదని అన్నారు. కానీ రైతుల భూములకు సంబంధించిన సమస్యలు కూడా ఉన్నాయని వివరించారు. అవి పరిష్కారం కావడం లేదన్నారు. పహానీ మాన్యువల్‌గా కూడా అందుబాటులో ఉండాలని కోరారు.
భూపరిమితి చట్టంపై అధికారులకు అవగాహన కలిగించాలి : చైర్మెన్ గుత్తా
భూ పరిమితి చట్టం-1971పై కొత్తగా వస్తున్న ఐఏఎస్‌లు, గ్రూప్-1, రెవెన్యూ అధికారులకు కనీస అవగాహన ఉండడం లేదని మండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. భూమి గురించి, చట్టాల గురించి, సమస్యలు, వాటి పరిష్కారాలపై వారికి శిక్షణా తరగతులను నిర్వహించి అవగాహన కలిగించాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి ఆయన సూచించారు.