– వేదికతో పాటు షెడ్యూల్‌పై అనిశ్చితి
– పలు గ్లోబల్ టీ20 లీగ్‌లకు ఆటంకం
దుబాయ్ : 2025 చాంపియన్స్ ట్రోఫీ వరుస సమస్యల్లో ఇరుక్కుంది. భద్రతా కారణాల రీత్యా పాకిస్థాన్‌లో చాంపియన్ ట్రోఫీ ఆడలేమని భారత క్రికెట్ బోర్డు ఇప్పటికే తేల్చి చెప్పింది. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులపై ఇటీవల పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసింది. అయినా, భారత క్రికెట్ బోర్డు విముఖంగా ఉండటంతో చాంపియన్స్ ట్రోఫీ వేదికపై నీలినీడలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగానే, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మరో సమస్యను ఎదుర్కొంటుంది. చాంపియన్స్ ట్రోఫీ జరిగే సమయంలో పలు దేశాల క్రికెట్ బోర్డులు టీ20 లీగ్‌లు నిర్వహిస్తున్నాయి. చాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ సమయంలో టీ20 లీగ్‌లు జరగాల్సి ఉంది. దీంతో పలు దేశాలు షెడ్యూల్‌పైనా అభ్యంతరం వ్యక్తం చేసే అవకాశం కనిపిస్తోంది.
2025 చాంపియన్స్ ట్రోఫీ వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో జరగాల్సి ఉంది. తుది షెడ్యూల్ ఖరారు చేయలేదు. ఎస్ఏ20, ఐఎల్టీ20, బిపిఎల్లు ఇదే సమయంలో జరుగుతున్నాయి. ఈ ఏడాది ఎస్ఏ20 జనవరి 10న మొదలై, ఫిబ్రవరి 10న ముగుస్తుంది. ఐఎల్టీ20 జనవరి 19న ఆరంభం కాగా.. ఫిబ్రవరి 17న ముగియనుంది. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ సైతం దాదాపుగా ఇదే సమయంలో జరుగుతుంది. దీంతో చాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్‌పై అభ్యంతరాలు వ్యక్తం కానున్నాయి. ఈ అంశాన్ని ఐసీసీ సమావేశంలో ప్రస్తావించేందుకు ఆయా దేశాల క్రికెట్ బోర్డులు సిద్ధమవుతున్నట్టు సమాచారం. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నిర్వహించే పాకిస్థాన్ సూపర్ లీగ్ (పిఎస్ఎల్) సైతం ఫిబ్రవరి-మార్చిలోనే జరుగుతుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సహజంగా మార్చి ద్వితీయార్థంలో ఆరంభమవుతుంది. దీంతో చాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్‌ను ముందుకు జరపడానికి కుదరదు. షెడ్యూల్‌ను కాస్త వెనక్కి జరిపితే ఎస్ఏ20, ఐఎల్టీ20, బిపిఎల్ పూర్తిగా ఇరకాటంలో పడతాయి. త్వరలోనే ఐసీసీ, పీసీబీ ఈ అంశంలో ఓ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. చాంపియన్స్ ట్రోఫీ వేదిక అంశంలోనే ఎటూ తేల్చని పీసీబీ, ఇప్పుడు కొత్తగా షెడ్యూల్ తలనొప్పితో ఏం చేస్తుందో చూడాలి.