సీహెచ్ సీ కి మరో వైద్యురాలు రాక..

– 7కి చేరిన వైద్యులు బృందం…
– ఫలిస్తున్న ఎమ్మెల్యే కృషి..
నవతెలంగాణ – అశ్వారావుపేట
నియోజకవర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట లోని సామాజిక ఆరోగ్య కేంద్రానికి జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ఆదేశానుసారం మరో  వైద్యురాలును డీసీహెచ్ఎస్ డాక్టర్ రవిబాబు కేటాయించారు. ఈ మేరకు డాక్టర్ సాన్విత కొత్తగూడెం నుండి అశ్వారావుపేట వచ్చి స్థానిక ఆసుపత్రిలో సోమవారం విధుల్లో చేరారు. వీరితో ఈ ఆసుపత్రిలో వైద్యుల సంఖ్య ఏడుగురికి చేరింది. దీంతో ఈ ఆసుపత్రి మంచిరోజులు రాగా ఈ ప్రాంతం ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. వాస్తవానికి ఈ ఆసుపత్రిలో 17 మంది వైద్యులు పలు విభాగాల్లో సేవలు అందించాల్సి ఉంది. గతంలో ఏనాడూ ఇద్దరు వైద్యులు కు మించి ఇక్కడ పని చేసిన దాఖలాలు లేవు. కానీ గత ఆగస్ట్ లో రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నియోజక వర్గం స్థాయీ సమావేశాన్ని జిల్లా స్థాయి అధికారుల సమక్షంలో అశ్వారావుపేటలోనే సమీక్షించారు. ఈ క్రమంలో వైద్యశాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఎమ్మెల్యే జారే ఆదినారాయణ సైతం పలుమార్లు ఆసుపత్రిని సందర్శించి సౌకర్యాలు, వైద్యులు కొరతపై జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ కు నివేదిక ఇచ్చారు. కలెక్టర్ సైతం స్వయానా ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసి ఆసుపత్రి సమాచారం సేకరించారు. ఈ నేపధ్యంలో మంగళవారం మార్చురీ గదికి ఎమ్మెల్యే జారే శంకుస్థాపన చేయనున్నారు.