మరో ఎన్నికల ‘జుమ్లా’

Another Election 'Jumla'– ‘ఉచిత విద్య, వైద్యం’ మరింత హాస్యాస్పదం
భవిష్యత్‌ ముందే తెలిస్తే ఉండే సుఖం వేరే ఉంటుంది. తన భవిష్యత్‌పై కేసీఆర్‌కు కొన్ని సందేహాలుండటంతో 2014లో అధికారంలోకి వస్తే దళితుడిని ముఖ్య మంత్రిని చేస్తానని, తర్వాత నాలుక్కర్చుకున్నారు. ఇప్పటికీ ప్రతిపక్షాలు దానిపై దెప్పిపొడుస్తూనే ఉన్నాయి. కమలనాథులకు అటువంటి ఇబ్బంది ఏమీ లేదని తేలడంతో మొన్న సూర్యాపేట సభలో అమిత్‌షా అధికారంలోకొస్తే బీసీ ముఖ్యమంత్రిని తెలంగాణలో ప్రతిష్టిస్తామని గాల్లోకి ఒక బాణం వేశారు.
రెండు అర్జెంటు ప్రయోజనాలు ఆయన ఆశించాడు. మొదటిది బీఆర్‌ఎస్‌ నుండి వలసొచ్చి వాలిన ఒక ప్రధాన ‘పక్షి’ని ఆ ప్రకటన ద్వారా ఆ బీసీని నేనేనని భ్రమింపజేసి ‘పక్కచూపులు’ చూడకుండా ఉంచుకోవచ్చు. రెండవది ఇప్పటికే పదవి పోయి, నారాజుగా ఉన్న మరో ‘పెద్ద’ బీసీ నేతను అది తన కోసమేనని సంతృప్తి పరచవచ్చు. ప్రతివారి అకౌంట్‌లోకి 15 లక్షలు వేస్తామన్న ఎన్నికల ‘జుమ్లా’ లాగా ఇదీ ఒక ఎన్నికల జుమ్లా అని తెలిసిన పెద్దోలెవరూ పెద్దగా ఆందోళన పడరు. పడలేదు కూడా.
కాంట్రాక్టులు ఎరవేస్తే తోకాడించుకుంటూ వచ్చేవారు వివిధ పార్టీల్లో ఉంటారని బీజేపీకి నార్తిండియాలో మస్తు అనుభవం. బెల్లం చుట్టూ ఈగలు ముసిరినట్టు అధికారం, దాన్ను పయోగించుకుని కాంట్రాక్టులు, కోట్లు వెనకేసు కోవడం ఇదంతా ఆశలు నడిపే ప్రయాణం! అధికార ‘బెల్లం’ లేదనుకుంటే, రాదనుకుంటే ఆవేశంగా రివర్స్‌ జంపింగులుంటాయి. ఇదే నేడు తెలంగాణలో కనబడుతోంది. మనుషుల్ని దగ్గరుండి ఊచకోత కోయించిన ఆ రెండు గుండెలూ బండరాళ్లే! కాని వాళ్లూ మనుషులే. ఒక రాష్ట్రం అదనంగా తమ ఖాతాలో పడుతుందనుకుంటే పడకపోగా, ఉన్నది కూడా ఊసిపోతే వారికీ ఎక్కడో కలుక్కుమనదా?!
కిషన్‌రెడ్డి గారి వాగ్దానం ‘ఉచిత విద్య, వైద్యం ‘ మరింత హాస్యాస్పదంగా ఉంది. దేశంలోని బీజేపీ పాలిత ఇతర రాష్ట్రాల్లో పరిస్థితి ఏమిటో కనుక్కో లేనంత ఎర్రోల్లా తెలంగాణ ప్రజలు కిషన్‌ జీ! తాజాగా గెలిచిన శాసనమండలి సభ్యునితో సహా ఎందరో మహానుభావులను ‘విద్యాదాన పరాయ ణులుగా మీ చంకలో కూసోపెట్టుకుని ఉచిత విద్య గురించి ఉపన్యాసాలు చెప్తే చెల్లుబాటు కాదు అమాత్యా!
బీజేపీలోకి కొత్తగా దారులు కట్టే అభ్యర్థులను వడబోయ డానికి వేసిన స్క్రీనింగ్‌ కమిటీ చైర్మెన్‌ రాజగోపాలరెడ్డి . ఆయన నిన్న కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నాడు. మాజీ ఎంపీలెవరూ ఎమ్మెల్యేలుగా పోటీ చేయం అంటూన్నారట! ప్రస్తుతానికి వాళ్లు చెప్తున్న సాకేమిటంటే ఎంపీలుగానైతే మోడీ మ్యాజిక్‌తో గెలవచ్చని.
2024 నాటి పరిస్థితిని బట్టి ఎటో ఒక దగ్గరికి జంప్‌ చేయొచ్చనే ఆలోచ నున్నట్లుంది. గతంలో బంగారు లక్ష్మణ్‌లాంటి ఎస్సీ నేతలున్నా, ఇక్కడ బీసీ ముఖ్యమంత్రి వచ్చినా నిర్ణయాలు జరిగేది నాగపూర్‌లోనే! ఆరెస్సెస్‌పై ఆధార పడే బీజేపీ నడవాలి తప్ప ఎస్సీ, బీసీలతోని ఏమీకాదు. కులవ్యవస్థను పున:స్థాపించడమే ఆర్‌ఎస్సెస్‌ లక్ష్యం. ఇది అర్థమైన వారందరూ చల్లగా జారుకుంటున్నారు.
– ఎలక్షన్‌ డెస్క్‌