జమ్మూకాశ్మీర్‌లో మరో ఎన్‌కౌంటర్‌

– సైనికుడి మృతి
– పాక్‌ చొరబాటుదారుడు హతం
శ్రీనగర్‌: జమ్మూకాశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో నియంత్రణ రేఖ వెంబడి శనివారం ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ సైనికుడు ప్రాణాలు కోల్పోయాడు. మరొకరు గాయపడ్డారు. ఈ ఘటనలో పాకిస్తాన్‌ చొరబాటుదారుడు హతమయ్యాడని సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది. మచాల్‌ సెక్టార్‌లో ప్రతికూల వాతావరణం, వెలుతురు సరిగా లేకపోవడాన్ని అవకాశంగా తీసుకొని ఇద్దరు ముగ్గురు సాయుధ చొరబాటుదారులు నియంత్రణ రేఖను దాటారని, సమీపం నుండి సైనిక పోస్టుపై కాల్పులు జరిపారని వివరించింది. అప్రమత్తమైన సైనికులు ఎదురు కాల్పులు జరపగా ఒక చొరబాటుదారుడు హతమయ్యాడు. ఘటనా స్థలంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలు లభించాయి. ఎదురు కాల్పుల్లో ఇద్దరు సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని శ్రీనగర్‌లోని ఆస్పత్రికి తరలించగా ఒకరు గాయాలతో మరణించారు. మరొకరు కోలుకుంటున్నారని, అతని ఆరోగ్యం నిలకడగా ఉన్నదని సైన్యం తెలిపింది.