మణిపూర్‌లో మరో ఘాతుకం

– ముగ్గురు కుకీల దారుణ హత్య
ఇంఫాల్‌ : మణిపూర్‌లో మరో ఘాతుకం చోటుచేసుకుంది. డబుల్‌ ఇంజన్‌ ప్రభుత్వాల వైఫల్యంతో మే 3న రాష్ట్రంలో ప్రారంభమైన హింసాకాండ రోజురోజుకూ విస్తరిస్తోంది. కొత్త ప్రాంతాల్లోనూ దాడులు జరుగుతున్నాయి. తాజాగా నాగా ఆధిపత్య జిల్లా ఉఖ్రూల్‌లో శుక్రవారం తెల్లవారుజామున ముగ్గురు కుకీలను దారుణంగా హత్య చేశారు. హింసాకాండ ప్రారంభమైన తరువాత నాగా ఆధిపత్య జిల్లాలో ఇలాంటి దాడి జరగడం ఇదే మొదటిసారి. థవై కుకీ గ్రామంపై ఉదయం 4.30 గంటల సమయంలో గుర్తు తెలియని కొంతమంది సాయుధ దుండగులు దాడి చేశారు. ముగ్గురు గ్రామ వాలంటీర్లను దారుణంగా హత్య చేసి, మృతదేహాలను చిధ్రం చేశారు. మృతదేహాలపై బుల్లెట్‌ గాయాలతోపాటు పదునైన ఆయుధాలతో దాడి చేసిన గుర్తులు కూడా ఉన్నాయి. మృతుల్ని థంగ్కోకై హోకిప్‌ (31), జాంఖోగిన్‌ హోకిప్‌ (35), హోలెన్‌సన్‌ బైతి (20)గా గుర్తించారు. హంతకుల్ని ఇంకా గుర్తించలేదని, మెయితీలే ఈ దాడికి పాల్పడినట్లు అనుమానిస్తున్నామని ఉఖ్రూల్‌ జిల్లా పోలీస్‌ సూపరింటెండెంట్‌ నింగ్‌షెమ్‌ వాషుమ్‌ మీడియాకు తెలిపారు. కాల్పులు జరిగిన వెంటనే ఆర్మీ, పోలీసు బలగాలు ఆ ప్రాంతానికి వెళ్లి గాలింపు చర్యలు చేపట్టాయని చెప్పారు.