అహింసకు మరోరూపం ‘సహనం’

Another form of non-violence is 'tolerance'.ప్రస్తుతం దేశంలో రోజురోజుకూ హింసాత్మక ధోరణి పెరుగుతున్నది. ఇది రానురానూ కులాలు, మతాలు, ప్రాంతీయ విభేదాలు, చివరికి భిన్నత్వంలో ఏకత్వాన్ని కూడా సవాల్‌ చేస్తున్నది. ఇది సూచిస్తున్నదేమిటి? మన రాజ్యాంగం, ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉన్నదనడానికి ఇదో సంకేతం. అయితే అహింసను రూపుమాపడానికి అనువైన ఆయుధం సహనశీలత. అన్నిమతాలను గౌరవించడం, అందరినీ సమానత్వంతో చూడటం ఇక్కడ కీలకం. సహృదయుల్లో కనిపించే ప్రధాన సుగుణాల్లో ఇదొకటి. అహింసకు ప్రతిరూపం సహనగుణమే. ఇతరులను సంస్కృతి, వారసత్వం, జీవనసరళి, వైవిధ్యత, ఆచార వ్యవహారాలు, భావప్రకటన స్వేచ్ఛలను గౌరవించడం, విభేధాలను సానుకూలతతో అంగీకరిం చడం, ప్రశంసించడం మన నిత్యజీవన విధానం కావాలి. విభేధాల్లో సహితం సామరస్యత ప్రదర్శించడమే సహనశీలతగా అర్థం చేసుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా అనేక వైవిధ్యభరిత ఆచార వ్యవహారాలు, సంస్కృతులు, భాషలు, పద్ధతులు, జాతులు, కళలు ఉన్నాయి. ఈ వైవిధ్యతలే మానవ జాతి ఎదుగుదలకు, అద్భుత ఆనందమయ అనుభవాలకు పునాదులు. భిన్నత్వంలో ఏకత్వ సాధన ద్వారా పరస్పర గౌరవం, సమాజాభివృద్ధి ఏండ్లకొద్దీ జరుగుతున్నది. ఇతరులు పాటించే ఆచారాలను, మత విశ్వాసాలను, కుల వారసత్వాలను గౌరవిస్తూ, సమన్యయ భావనలతో ముందుకు సాగడానికి సహనం అనే అద్భుత గుణం ఉపయుక్తమవుతున్నది. సహనశీలత ద్వారా ఇతరుల మానవ హక్కులు, మౌళిక స్వేచ్ఛ పరిరక్షించబడతాయి.
విశ్వ మానవాళి జీవనసరళి సహజంగానే వైవిధ్యభరితం, విలక్షణం. అయినప్పటికీ వారిని శాంతి సామరస్యాలతో కట్టి ఉంచేది దారమే సహన గుణ సంపద అని గమనించాలి. మానవ సమాజ ఏకీకరణకు, ప్రశాంత జీవన విధానాలు కొనసాగడానికి సహనం అనే గుణం ప్రధానమైనదని అంగీకరించిన ఐరాస 1995 ఏడాదిని ”అంతర్జాతీయ సహన సంవత్సరం(ఇంటర్నేషనల్‌ ఇయర్‌ ఆఫ్‌ టాలరెన్స్‌)”గా పాటించడం, దానికి కొనసాగింపుగా 1996 నుంచి 16 నవంబర్‌ రోజున ”అంతర్జాతీయ సహన దినోత్సవం (ఇంటర్నేషనల్‌ డే ఆఫ్‌ టాలరెన్స్‌)”గా పాటించడం ఆనవాయితీగా మారింది. సహన భావన మన సంస్కృతి, వారసత్వం, ఆచారాల్లో దాగి ఉంది. అంతర్జాతీయ సహన దినం వేదికగా సహనశీలత ప్రాధాన్యాన్ని వివరించడం, అహింస ఆలోచనలను తట్టిలేపడం, ఓపికను ప్రదర్శించడం, సామాజిక సామరస్యతను పాటించడం, ఇతరుల అభిప్రాయాలు/ జీవన విధానాలను గౌరవించడం, ప్రపంచ మానవాళిలో సోదర భావాన్ని జాగృత పరచడం, మానవ హక్కులను పరిరక్షించడం, సహనశీలత కేంద్రంగా చర్చలు/ విద్యార్థుల కు పోటీలు/సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం లాంటి పలు ఆలోచనలను కార్యరూపంలోకి తేవచ్చు.
నేటి ప్రపంచంలో ఏ మూలన చూసిన అశాంతి, సంఘర్షనలు, తీవ్రవాద ధోరణులు, ఉగ్రవాద రక్తపాతాలు, మత ఘర్షణల మంటలు, కులాల కుమ్ములాటలు, మానవ హక్కుల హననాలు, యుద్ధాలు, సాంస్కృతిక విభేదాలు, వేర్పాటువాద హింసలు, ప్రాంతీయతత్వాలు కొనసాగు తూనే ఉన్నాయి. అసహనం రెక్కలు విచ్చుకొని పేట్రేగి పోతున్నది. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రపంచ మానవాళి శాంతి, సమన్వయం, సౌభ్రాతృత్వ బాటలో నడవడానికి సహనమనే ఏకైక సాధనం. సహనగుణాలను పెంచడానికి ప్రపంచ దేశాలు కృషి చేయాలని, విద్యలో భాగంగా చిన్నతనం నుంచే సహన బీజాలను చిన్నారుల మనో ఫలకాలపై నాటాలని, సమ్మిళిత అభివృద్ధి, అవకాశాలకు పెద్ద పీట వేయాలనేది అంతర్జాతీయ సహనదినం బోధిస్తున్నది. ఇతరుల ఆచారాలను పాటించకపోయినా వారి భావనలను గౌరవిస్తూ అంగీకరించడమే ప్రపంచ శాంతి స్థాపనకు పెట్టుబడి అని మరిచిపోరాదు.
అంగీకారం, సహనం, క్షమాగుణం, కరుణ, దయ, పరస్పర గౌరవాలు మానవ జీవితాన్ని సుసంపన్నం చేస్తాయని నమ్మడం మన కనీస కర్తవ్యం. అందరికీ జీవించే హక్కు సమానంగా ఉంది. పౌర సమాజం, వివిధ మానవ జాతులు తమ వైవిధ్యభరిత జీవన విధానాలను శాంతియుతంగా కొనసాగించడానికి ప్రతి ఒక్కరిలో సహన గుణం మెల్కోవాలి. విభేదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవడం, సమన్వయ భావనలను ప్రదర్శిం చడం, అందరూ ఒక్కటే అన్న ఆలోచనలకు పట్టాభిషేకం చేయడం చేయాలి. వివక్షను తరిమేయడం, ఇతరుల భావాలను గౌరవిస్తూ అంగీకరించడం, సంకుచిత ఆలోచనలను పాతరేయడం లాంటి సహజీవన పాఠాలను నేటి డిజిటల్‌ యువత వంటపట్టించుకోవాలి. రేపటి ఆనందమయ శాంతియుత సమాజ క్షేత్రంలో సహన బీజాలను నేటినుంచే నాటడం అలవర్చుకోవాలి. సహనా నికి సంకెళ్లు వేస్తే హిం సాగ్ని రెచ్చిపోతుంది. అసహనం అంటరానిదని, పరస్పర గౌరవ భావనలను అలవాటు చేసుకోవాలి. అసహనాన్ని ఆమెడ దూరం తరిమి, అంగీకార ఆలోచనలను దరికి చేర్చుకొని రేపటి ప్రపంచ మానవాళికి సహనశీల శాంతియుత సహజీవన విధానాన్ని వివరించాలి. అది ఆచరణలో పెట్టేవిధంగా కృషి చేయాలి.
(నేడు ”అంతర్జాతీయ సహన దినోత్సవం”)
– డా: బుర్ర మధుసూదన్‌ రెడ్డి
9949700037