మరో స్వతంత్రం…

దొరల గఢల్లోీ అర్ధరాత్రి ఆడాళ్ళ ఆర్తనాదాలు
బక్కరైతు కష్టం భూస్వాముల పాలు
మతోన్మాదం గద్దెనెక్కితే సామాన్యుడికి బతుకే ఒక బానిసత్వం
భూస్వాములు జాగీర్ధార్లు దేశ్ముఖ్‌ లు
రజాకార్లు… పేరేదైనా పైశాచికత్వం ఒక్కటే!
పేదోడి చెమట చుక్కో రక్తపు చుక్కో పిండితే గానీ చల్లారని ధనదాహం!
దేవుడైనా దెయ్యమైనా భాషైనా భావమైనా నిజాం మాటే అక్కడి వేదం!
సహించేడు భరించేడు… ఇగ తట్టుకోలేక పేదోడు కండ్లెర్ర జేసిండు
రైతులు పంటలు కాదు మంటలయేరు
ఆడోళ్ళు సైతం బందూకులు పట్టిన్రు!
బైరాన్‌ పల్లి భయం లేని పల్లెయింది తిరుగుబాటోళ్ళ రాజధాని ఐయింది
ఎన్నో పల్లెలు ఎందరో వీరులు… ఎంతో చరిత్ర రక్తం ఏరులై పారింది…
కమ్యూనిస్ట్‌ జెండా మరింత ఎరుపెక్కిన గడ్డు కాలమది
ఎందరో అమాయకులు నేలకొరిగి తెలంగాణా వల్లకాడయ్యేక
వెల్లువలా భారత సైన్యం దిగివచ్చింది దుర్మార్గుల పీచమణిచి సామాన్యుడికి
స్వేచ్ఛ అనే వరాన్ని ప్రసాదించింది…
తెలంగాణా ఊరూ వాడా పులకించింది…
(తెలంగాణా విమోచన దినం)
– భీమవరపు పురుషోత్తమ్‌, 9949800253