ప్రతి మనిషీ ఎదగటానికి సమాజం నుండి ఎంతో స్వీకరిస్తూ ఉంటాడు. అలా తాను స్వీకరించిన సంస్కృతి సంస్కరణలను తిరిగి సమాజానికి ఇవ్వడంలో ఎంతో విజ్ఞత ఉంది.
అట్టి విజ్ఞతను ఒంటపట్టించుకుని సమాజాన్ని జాగృత పరచటంలో తన వంతు కృషి చేస్తున్నారు. ఉపాధ్యాయవృత్తిలో రిటైరయిన శ్రీమంచి కంటి తల్లి, తండ్రి తరువాత సమాజాన్ని సంస్కరించాల్సిన బాధ్యత గురువుపై ఉంటుందన్న సత్యాన్ని గ్రహించిన వీరు లోగడ సైకిల్‌పై ఊరూరా తిరిగి పాఠశాలలను అభివృద్ధి పరిచే మార్గాలను, విద్యార్థులను సరియైన మార్గంలో నడిపించేందుకు అవసరమైన సలహాలను ఇచ్చారు.
పిల్లలలో విద్యతో బాటు సాహిత్యం, సాంస్కృతికం ఎదగాలన్న సదాశయంతో తానే స్వయంగా ‘శాంతివనం విద్యా సాహిత్య సాంస్కృతిక ఫౌండేషన్’ అనే సంస్థను ప్రారంభించారు. అంతటితో ఆగిపోక ‘ఆశయ యూత్ అసోసియేషన్ మొబైల్ బైక్ గ్రంథాలయం’ స్థాపించి మోటార్‌బైక్ మీద ఊరూరా పుస్తకాలను పంపిణీ చేశారు.
గ్రంథాలయాలు మానవ వికాసానికి ఎంతగానో తోడ్పడతాయన్న సత్యాన్ని గ్రహించి మరో గ్రంథాలయ ఉద్యమం ప్రారంభించారు. బైకు మీద ప్రారంభించిన ఈ యాత్ర నెల్లూరు నుండి శ్రీకాకుళం దాకా, వేల కిలోమీటరు ప్రయాణించారు. వాడ్రేవు చిన వీరభద్రుడు పెరుగు రామకృష్ణ, పెనుగొండ లక్ష్మీ నారాయణ, దాట్ల దేవదానంరాజు, కాకినాడ జన విజ్ఞాన వేదిక శాంతి నారాయణ, బండి నారాయణ స్వామి, కాశీభట్ల వేణుగోపాల్ గంటేరు, సిరికి లాంటి సాహితీ వేత్తలను కలిశారు కారా మాస్టారు కథానిలయం (శ్రీకాకుళం) సందర్శించారు.
‘మరో గ్రంధాలయం ఉద్యమం’ ఉద్యమ అవసరాన్ని ప్రస్తుత సమాజానికి తెలియపరచడానికి అందిస్తున్న ఈ పుస్తకంలో ఎన్నో తన ఉన్నత భావాల్ని మనతో పంచుకున్నారు. ‘సమాజానికి మనం ఇవ్వాల్సింది’ తెలుగు ఇంగ్లీషు ఏదైనా పిల్లలు చదవడం ముఖ్యం, యాత్రలో సైడ్ లైట్స్, గొప్ప వాక్యాలు, గొప్ప వ్యక్తులు, తల్లి భాష వంటి అధ్యాయాల్లో తన ఆలోచనలు పంచుకున్నారు.
నాటి జాతీయోద్యమంలో గ్రంధాలయాలు ప్రముఖ పాత్ర వహించాయి. అలాగే మంచికంటివారి ఈ గ్రంధాలయోద్యమం, శాంతివనం, యువతను మరింత చైతన్య పరుస్తుందని ఆశిద్దాం. నాకేం లెమ్మని కిమ్మనకుండా ప్రయత్నించి చిరుదీపమైనా వెలిగించి చీకట్లు పారద్రోలుదామనే వీరి సదాశయానికి అభినందనలు.
– కూర చిదంబరం, 8639338675