– లంక, నేపాల్ పోరు వర్షార్పణం
లాడర్‌హిల్ (అమెరికా) : ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో వరుణుడు తనదైన ఆటతీరు ప్రదర్శిస్తున్నాడు. స్కాట్లాండ్, ఇంగ్లాండ్ మ్యాచ్‌కు ఆటంకం కలిగించి డిఫెండింగ్ చాంపియన్ టోర్నీ నుంచి నిష్క్రమించే ప్రమాదంలో నెట్టిన వరుణుడు తాజాగా మరో మ్యాచ్‌ను తుడిచిపెట్టేశాడు. బుధవారం ఉదయం జరగాల్సిన శ్రీలంక, నేపాల్ మ్యాచ్ వర్షార్పణమైంది. ఎడతెరిపిలేని వర్షంతో మైదానం పూర్తిగా తడిసిపోయింది. అవుట్‌ఫీల్డ్ ఆటకు అనుకూలంగా లేకపోవటంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో కనీసం ఒక్క బంతి పడకుండానే మ్యాచ్ ముగిసింది. గ్రూపు-డిలో కీలకమైన ఈ పోరులో మ్యాచ్ రద్దు కావడంతో శ్రీలంక, నేపాల్ చెరో పాయింట్ పంచుకున్నాయి. మూడు మ్యాచుల్లో విజయాలతో దక్షిణాఫ్రికా గ్రూప్-డి నుంచి సూపర్8 బెర్త్ సొంతం చేసుకోగా.. రెండో బెర్త్ రేసులో బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ పోటీపడుతున్నాయి. మూడు మ్యాచుల్లో రెండు పరాజయాలు చవిచూసిన శ్రీలంక గ్రూప్ దశ దాటడం అద్భుతానికి సైతం సాధ్యపడని సమీకరణం అని చెప్పవచ్చు!.