అరుణ్‌ ఐస్‌క్రీమ్స్‌ ఉత్పత్తిలో మరో మైలురాయి

Another milestone in the production of Arun Ice Creams– గోవిందపూర్‌ ప్లాంట్‌లో 1.27 లక్షల కిలోలకు చేరిక
నవ తెలంగాణ – హైదరాబాద్‌
హాట్సన్‌ అగ్రో ప్రొడక్ట్‌ లిమిటెడ్‌కు చెందిన ఐస్‌క్రీమ్‌ బ్రాండ్‌ అయిన అరుణ్‌ ఐస్‌ క్రీమ్స్‌ సంగారెడ్డి సమీపంలోని తమ గోవిందపూర్‌ యూనిట్‌లో ఉత్పత్తిని పెంచినట్లు వెల్లడించింది. లక్ష కిలోలుగా ఉన్న తయారీ సామర్థ్యాన్ని ఇటీవల క్రమంగా 1.27 లక్షల కిలోలకు చేర్చినట్లు హాట్సన్‌ జిఎం మార్కెటింగ్‌ సెంథిల్‌ తెలిపారు. దేశంలో తమకు మూడు ఐస్‌క్రీం యూనిట్‌లు ఉండగా.. అందులో ఒక్కటి గోవిందపూర్‌లో 113 ఎకరాల్లో ఏర్పాటు చేశామన్నారు. ఈ ఐస్‌క్రీమ్‌ వ్యాపార విభాగంలో ప్రతీ ఏడాది 13 శాతం వృద్ధిని సాధిస్తున్నామన్నారు. హాట్సన్‌ మొత్తం వ్యాపారంలో పాలు రూ.5,000 కోట్లు, హాట్సన్‌ పెరుగు రూ.1700 కోట్లు, ఐస్‌క్రీం రూ.1100 కోట్లు చొప్పున కలిగి ఉన్నామన్నారు. తమకు ఐస్‌ క్రీం విభాగంలో 25 శాతం మార్కెట్‌ వాటా ఉందన్నారు. ఈ ఏడాది బిలియన్‌ డాలర్లు కంపెనీగా చేరాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. రైతుల నుంచి ప్రతీ రోజు 34 లక్షల లీటర్ల పాలను సమీకరిస్తున్నామన్నారు. తెలుగు రాష్ట్రాల్లో చిత్తూరు, హైదరాబాద్‌లోనూ పాల ప్రాసెసింగ్‌ యూనిట్లు ఉన్నాయన్నారు.”ఈ ఉత్పత్తి మైలురాయిని చేరుకోవడం, మా కార్యకలాపాల్లో అధునాతన సాంకేతికత, స్థిరత్వం పట్ల మాకు ఉన్న నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. గోవిందపూర్‌ ఫ్యాక్టరీ సౌకర్యం, బాధ్యతాయుతమైన అభివృద్ధి, నాణ్యత హామీ పట్ల మా దృక్పథానికి ఒక సంకేతం.” అని హాట్సన్‌ అగ్రో ప్రోడక్ట్‌ లిమిటెడ్‌ ఛైర్మన్‌ ఆర్‌. జి. చంద్రమోగన్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.