తెలంగాణ విముక్తికి మరో ఉద్యమం

Another movement for the liberation of Telangana– 60 ఏండ్ల స్వరాష్ట్ర పోరాటంలో చెరిగిపోని సంతకం కేసీఆర్‌
– 29న రాష్ట్రవ్యాప్తంగా దీక్షా దివస్‌ : బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
కాంగ్రెస్‌ కంబంధ హస్తాల నుంచి తెలంగాణను విముక్తి చేయడానికి మరో ఉద్యమం చేపట్టాల్సిన అవసరముందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. ఆదివార హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణకు స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామరక్ష అని ప్రొఫెసర్‌ జయశంకర్‌ చెప్పిన మాటలను స్ఫూర్తిగా తీసుకుని పోరాటాలకు సిద్ధం కావాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని వ్యాఖ్యానించారు. ”సమైక్య రాష్ట్రంలో అప్పటి కాంగ్రెస్‌ పాలనలో ప్రతి వర్గం, ప్రతి మనిషి బతుకు చిధ్రమైన పరిస్థితి. మళ్లీ ఈ రోజు రాష్ట్రంలో ఆ పరిస్థితులు కనబడుతున్నాయి. అదే నిర్బంధం, అదే అణిచివేత, అవే దుర్భర పరిస్థితులు, ఆందోళనకరమైన వాతావరణం. నాడు ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ సాధించిన కేసీఆర్‌ స్ఫూర్తితో నేడు మళ్లీ ఢిల్లీలోని పార్టీల మెడలు వంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే తెలంగాణలో బతుకు అంధకారమైందని రైతులు, ఆటో కార్మికులు, నిర్మాణ రంగంలో ఉండే కూలీలు అట్టడుగు స్థాయి నుంచి సంపన్న వర్గాల వరకు అందరూ బాధపడుతున్నారు” అని కేటీఆర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర్‌ ఆనవాళ్లు లేకుండా చేస్తామని కొంతమంది బీరాలు పలుకుతున్నారని విమర్శించారు. అలాంటి వారు ఒక సారి చరిత్ర పుటలను తిరగేసి చూడాలని హితవు పలికారు. ”60 ఏండ్ల తెలంగాణ ఉద్యమంపై కేసీఆర్‌ చెరిగిపోని సంతకం చేశారు. 2009 నవంబర్‌ 29న దీక్ష చేపట్టారు. ‘కేసీఆర్‌ సచ్చుడో…తెలంగాణ వచ్చుడో’ అన్న మాట దేశ రాజకీయాలను కదిలించింది. ఉద్యమంలో ఉన్న నిర్బంధాలు ఇప్పుడు మళ్లీ కనిపిస్తున్నాయి. వాటిని ఎదుర్కొనేందుకు పార్టీ శ్రేణులు సన్నద్దం కావాలి” అని కేటీఆర్‌ పిలుపు నిచ్చారు. దీక్షా దివస్‌ను పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని ప్రకటించారు. ఈ నెల 29న రాష్ట్రంలోని 33 జిల్లా కేంద్రాల్లో, పార్టీ కార్యాలయాల్లో దీక్షా దివస్‌ ఘనంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. వాటిని విజయవంతం చేసేందుకు పార్టీలోని సీనియర్‌ నాయకులకు జిల్లాల వారీగా బాధ్యతలు అప్పగించినట్టు తెలిపారు. దీక్షా దివస్‌ చివరి రోజు డిసెంబర్‌ 9న మేడ్చల్‌లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణతో కార్యక్రమాన్ని ముగించనున్నట్టు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలందరూ పాల్గొంటారని కేటీఆర్‌ తెలిపారు.
నిమ్స్‌లో అన్నదానం
”మలిదశ తెలంగాణ ఉద్యమంలో నిమ్స్‌ హాస్పిటల్‌ పాత్ర ఎంతో ఘనమైనది. నాడు కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో నిమ్స్‌కు తరలించడం జరిగింది. దీక్ష ముగిసే వరకు ఉద్యమానికి కేరాఫ్‌గా నిమ్స్‌ నిలిచింది. స్వరాష్ట్ర ఉద్యమానికి కేంద్ర బిందువుగా మారిన పాత జ్ఞాపాకాలను స్పూర్తిగా తీసుకుంటూ నవంబర్‌ 29న నిమ్స్‌ ఆస్పత్రిలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తాం. రోగులకు పండ్లు, బట్టలు పంచుతాం” అని కేటీఆర్‌ తెలిపారు.