మరో నూతన స్వాతంత్య్ర పోరాటం రావాలి…

Another new freedom struggle must come...”తీరని ప్రాథమిక అవసరాలు, పేదరికం, అసమానతల మధ్య
ఏ ప్రజాస్వామ్యమైనా ఎక్కువ కాలం మనలేదు” – నెహ్రూ
మనం ప్రతినిత్యం ఒక మాట వింటూంటాం ”మనది ఘనత వహించిన ప్రజాస్వామ్యం” అని. పాలకవర్గాల అనుకూల కుహనా మేధావులు అలసిపోకుండా ఈ ప్రజాస్వామ్యాన్ని పొగుడుతూనే ఉంటారు. ఇది నిజంగా ప్రజాస్వామ్యమేనా?అని నిశితంగా పరిశీలిస్తే ఇది ధనవంతులు, పెద్దపెద్ద కార్పోరేట్లకే ప్రజాస్వామ్యమని తేలిపోతుంది. ఒక కఠినమైన వాస్తవం ఏమిటంటే, ఎవరి సేద్యంతో ఈ భూమి తడిసి దేశ నిర్మాణమైందో ఆ ప్రజల్నే దోచుకుంటూ, పాలకవర్గాలు స్వాతంత్య్రాన్ని అనుభవిస్తున్నారు. దశాబ్దాలుగా వ్యవస్థీకృతం చేస్తూ వచ్చిన హింసను అహింసగా చెలామణి చేస్తున్నారు. చిన్న పాటి ప్రశ్నను ధిక్కారాన్ని, సంఘాన్ని, సమరాన్ని అసలు అడగటానికి ఒక చోట కలుసుకోవటాన్ని కూడా సహించలేని స్వాతంత్య్రం మనది. ఉఛ్వాస నిశ్వాసలకు పరిమితులు విధించి భయకంపితం చేసి మానవసారాన్ని నిస్సారం చేసే స్వాతంత్య్రం మనది. అందుకే మహాశ్వేతాదేవి ఈ ప్రజా స్వామ్యాన్ని ‘విధ్వంసస్వామ్యం’ అన్నారు. పాలకుల విధ్వంసక విధానాలను ప్రశ్నించేవారికి దేశంలో రక్షణ లేకుండా పోయింది. గోవుకు ఉన్న రక్షణ మనిషి బతుక్కి లేదు. గోవు, జాతీయత, దేశభక్తి, సంస్కృతి పేరుతో రాజకీయాలు నడుస్తున్నాయి. కులం, మతం ఓట్లు రాల్చే సాధనాలుగా మారిపోయాయి. స్వతంత్ర రాజ్యాంగ వ్యవస్థలు స్వేచ్ఛగా పనిచేసే పరిస్థితి కోల్పోయాయి. దేశంలో సైన్స్‌పై దాడి జరుగుతోంది.డార్విన్‌ సిద్ధాంతాన్ని తప్పు పడుతున్నారు. కల్బుర్గీ, గోవింద్‌ పన్సారే, దబోల్కర్‌, గౌరి లంకేష్‌లాంటి హేతువాదులు, మేధావులు, జర్నలిస్టులు హత్యలకు గుర య్యారు. ప్రశ్నించటమే నేరమైంది. ఎవరైనా మాట్లాడితే వారు దేశ ద్రోహులు, ఉగ్రవాదులని ముద్రవేస్తూ ఏండ్లకొద్దీ జైళ్లలో నిర్భందిస్తున్నారు. ఇలాంటి ఉదంతాల పట్ల దర్వాప్తుల్లో పురోగతి లేకపోవటాన్ని ప్రశ్నిస్తూ దాఖలైన పిటిషన్లను విచారిస్తూ ముంబాయి హైకోర్టు ఘాటుగా స్పందించింది. ”ఎవరు మాట్లాడ లేని, ఎవరూ స్వేచ్ఛగా సంచరించలేని ఒక విషాదకర దశను దేశం చూస్తున్నదని’ న్యాయస్థానం వ్యాఖ్యానించింది. అంటే పరిస్థితి ఎంత దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. దేశంలో జరుగుతున్న ఎన్‌కౌంటర్లు, లాకప్‌డెత్‌లు తెంపులేకుండా మహిళలు, చిన్నపిల్లలపై జరుగు తున్న లైంగికదాడులు మనదేశ ప్రతిష్టను మసకబారుస్తున్నాయి.
స్వాతంత్య్రం సిద్ధించి ఇన్నేండ్లయినా, ప్రతియేటా మువ్వన్నెల జెండా లెగరేస్తున్న సామాన్యులకు కనీసావసరాలు దక్కని స్థితి. రాజకీయ పార్టీలు మారుతున్నాయి, నాయకులు మారుతున్నారు. కాని ప్రజల జీవితాలు మాత్రం మారటం లేదు. సామాన్యుడు బతుకుపోరులో నిత్యం ఓడిపోతూనే ఉన్నాడు. ఇందిరాగాంధీ కాలం నుండి నరేంద్రమోడీ కాలం వరకు ఇదే పరిస్థితి. ”గరీభి హఠావో” అన్నా, ”సబ్‌కాసాత్‌..సబ్‌కా వికాస్‌” అన్నా, అవి ఆకర్షణీయ నినాదాలే తప్ప ప్రజలకు ఒరిగేదేమీ లేదు. ప్రపంచంలోనే పోషకాహారం లభించని జనాభా భారతదేశం లోనే అధికంగా ఉన్నదని ఐక్యరాజ్యసమితి తేల్చి చెప్పింది. మన జనాభాలో 14.5శాతం జనాభాకు పోషకాహారం అందడం లేదని, 19కోట్ల మంది ప్రతి రోజూ ఆకలితో నిద్రిస్తున్నారని, ఐదేండ్లలోపు వయస్సున్న మన పిల్లలు 21శాతం మంది తక్కువ బరువుతో,పోషకాహార లోపంతో వ్యాధుల భారిన పడుతున్నారని, కొందరు మరణిస్తున్నారని వ్యవసాయ, ఆహార సంస్థల గణాంకాలు చెబుతున్నాయి.
మోడీ ప్రభుత్వం శివాజీ విగ్రహానికి పెడుతున్న ఖర్చు రూ.3600 కోట్లు కాగా, పిల్లల పోషకాహారం కోసం పెడుతున్న ఖర్చు రూ.126 కోట్లు. అంటే విగ్రహాలకిస్తున్న ప్రాధాన్యత ఈ దేశ భావిపౌరులకు లేదన్నమాట. దేశంలో పట్టణ పేదల బతుకులు నానాటికి దుర్భరమౌతున్నాయి. ప్రభుత్వాలు విద్య, ప్రజారోగ్యం, ఉపాధి రంగాలకు తగిన కేటాయింపులు చేయనందున సామాన్య ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్యం అందటం లేదు. ప్రపంచ క్షయవ్యాధి మృతుల్లో భారతదేశం మొదట స్థానంలో ఉంది. ఇవన్నీ చూస్తే 77 ఏండ్ల స్వాతంత్య్రం భారతదేశం వాస్తవిక చిత్రం ఆవిష్కృతమౌతుంది. వాస్తవం ఇది కాగా ప్రపంచంలో ఏడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం ఉందని గొప్పగా చెప్పుకోవటం చూస్తుంటే ”ఇంట్లో ఈగల మోత..బయట పల్లకీల మోత” సామెత చందంగా ఉంది. నిప్పులు చిమ్ము తూ నింగికి దూసుకెళుతున్న రాకెట్లు వాయువేగంతో పరుగులుపెడుతున్న బుల్లెట్‌ రైళ్లు, వైఫై హంగులతో మిరు మిట్లు గొలుపుతున్న ఆకాశహార్శ్యాలు ప్రధాని మోడీ, ఆయన పరివారం పలుకుతున్న అభిృద్ధి ప్రగల్భాలు ఉత్తర కుమార ప్రగల్భాలేనని గణాంకాలు, సర్వేలు చూస్తే తెలుస్తోంది.
దేశ వాస్తవ ఆర్థికస్థితి సంక్షోభంలో ఉందని అంతులేని అరాచకం…తిరోగమనంలో ఆర్థిక వ్యవస్థ, ఆర్థి నేరస్తులకే ‘అచ్చేదిన్‌’ అని దేశంలో మెజారిటీ ప్రజానీకం మనోగతం కూడా ఇదేనని రిజర్వుబ్యాంకు ఇటీవల నిర్వ హించిన వినియోగదారుల విశ్వాస సర్వే (కాన్ఫిడెన్స్‌ ఇండెక్స్‌) లెక్క తేల్చిచెప్పింది. భారతదేశంలో 69శాతం ప్రజానీకం గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు 60శాతానికి పైగా ప్రజలు మన ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అయిన వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉన్నారు. 1991నుంచి అమలులోకి వచ్చిన ప్రపంచీకరణ (సరళీకరణ) విధానల వలన వ్యవ సాయరంగం క్రమేపి సంక్షోభంలోనికి నెట్టబడు తోంది. లక్షల సంఖ్యలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. దేశం క్రమంగా ప్రపంచ బ్యాంకు ఐఎంఎఫ్‌ల కబంధ హస్తాలలోకి కూరుకుపోయింది. ఫలితంగా విదేశీ బహుళజాతి సంస్థలు, మరోవైపు దేశీయ కార్పోరేట్లు రైతులను నిలువునా దోచుకుంటున్నారు. కౌలుదారులు, వ్యవసాయ కూలీలకు పనులు లేక పస్తులతో పొట్ట చేతపట్టుకొని సొంతూర్లు వదిలి, పట్టణాలకు వలసపోయి అడ్డకూలీలుగా మారి అర్థాకలితో పట్టణ మురికి వాడల్లో కునారిల్లుతు న్నారు. వాస్తవం ఇలా ఉంటే పాలకులు వృద్ధి అంకెల మాయాజాలంతో గారడీ చేస్తున్నారు. ఇప్పుడు ప్రపంచ కుబేరులు, ఆదానీ, అంబానీ సేవల్లో మునిగిపోయారు.ఈ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఆకర్షణీయమైన నినాదాలు రాజేసి ప్రజలదృష్టిని పక్కదారి పట్టిస్తున్నారు.
హిందూ, ముస్లింల మధ్య విద్వేషాల్ని రాజేయటం ద్వారా మోడీ సర్కార్‌ ఈ ఆర్థిక సంక్షోభ సవాళ్లను పక్కదారి పట్టించాలని చూస్తోంది. కాబట్టి ఈ విద్వేష రాజకీయ కుట్రలను ప్రజలు సమగ్రంగా అర్థం చేసుకోవాలి. ఈ విషయాలన్ని తెరచిచూస్తే ఈ దేశ ప్రజలకు నిజమైన స్వేచ్ఛ, స్వాతంత్య్రాలు రాలేదనేది వాస్తవం. నిజానికి భారతదేశం పేదదేశం కాదు, కానీ తీని దారిద్య్రం అనుభవిస్తున్న పేద ప్రజల దేశం. అపారమైన వనరులు, జీవ నదులు, కష్టించి పనిచేసే ప్రజలు ఉండి కూడా ఈ దేశం ఇంత వెనకబడటానికి ప్రధాన కారణం ప్రజలకు కావలసిన రాజకీయ, ఆర్థిక వ్యవస్థలు ఇక్కడ మొదటి నుండి లేకపోవటం. ప్రజలకు కావలసిన ప్రజా ప్రత్యామ్నాయ రాజకీయాలు అభివృద్ధి కాకపోవడం. ఇప్పటికైనా లౌకికవాదులు, ప్రగతిశీల శక్తులు రైతాంగం, కార్మిక, విద్యార్థి శక్తులను ఒక్కతాటి మీదకు తెచ్చి ప్రజల్ని చైతన్యం చేయాలి. వ్యక్తిగత ఆస్తికి తావులేని నవభారత్‌ను నిర్మించాలి. మనిషిని మనిషి దోచుకోని మరో నూతన స్వాతంత్య్ర పోరాటం వస్తేనే ఇది సాధ్యం.

– ఎల్‌ అరుణ, 9705450705