మరో విషబీజం

Another poisonమతం పేరుతో ప్రజలను రెచ్చగొట్టడం, విద్వేషాలను సృష్టించడం బీజేపీకి పుట్టుకతో అబ్బిన విద్య. తన అధికారాన్ని సుస్థిరం చేసుకునేందుకు మొదటినుండి మత రాజకీయాలే లక్ష్యంగా పెట్టుకుంది. చాపకింద నీరులా తన హిందుత్వ ఎజెండాను అమలు చేస్తూనే ఉంది. దీనికి తాజా ఉదాహరణే వక్ఫ్‌ చట్ట సవరణ. తన పబ్బం గడుపు కునేందుకు దీన్ని మరో విషబీజంగా ప్రజల మెదళ్లలో నాటేందుకు సిద్ధమవుతోంది. వక్ఫ్‌బోర్డు ద్వారా ముస్లింలు పెద్ద ఎత్తున ఆస్తులు కూడబెట్టుకున్నారంటూ బూటకపు ప్రచారం చేస్తున్నది. వాస్తవాలు మాత్రం దీనికి భిన్నంగా ఉన్నాయి. వక్ఫ్‌ చట్టం 1995లో చేసినది. దీని ప్రకారం వక్ఫ్‌ ఆస్తిని నిర్ణయించే హక్కు వక్ఫ్‌ ట్రిబ్యునల్‌కు ఉంటుంది. ఈ ట్రిబ్యునల్‌ రాజ్యాంగం ప్రకారం ఎన్నికవుతుంది. కనుక దీనికి స్వతంత్య్ర ప్రత్తిపత్తి ఉంటుంది. చట్ట సవరణతో వక్ఫ్‌బోర్డు అధికారాలన్నీ కలెక్టర్లకు, ఆర్‌డీఓలకు అప్పజెప్పబోతున్నారు. ఇక నుండి వక్ఫ్‌ ఆస్తినా కాదా అనేది వీళ్లే నిర్ణయిస్తారు. కలెక్టర్లపై రాజకీయ నాయకుల ఒత్తిడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దీనివల్ల వక్ఫ్‌ భూములను ప్రభుత్వ భూములుగానో, ప్రయివేటు భూములుగానే మార్చే ప్రమాదముంది. అలాగే ఇప్పటి వరకు వక్ఫ్‌కు హిందువైనా, ముస్లిమైనా భూమి దానం చేయాలనుకుంటే చేయవచ్చు. కానీ ఈచట్ట సవరణతో దానం చేయాలనుకునేవారు గత ఐదేండ్ల నుండి తాము ఇస్లాంను ఆచరిస్తున్నామని కచ్చితంగా రుజువు చేసుకోవాలి. ఇది అత్యంత ప్రమాదకరమైన సవరణ.
ఇప్పటి వరకు వక్ఫ్‌బోర్డ్‌లో ముస్లింలు మాత్రమే ఉండేవారు. ఇప్పుడు ముస్లిమేతరులను కూడా ఈ కమిటీలో పెట్టాలనే నిర్ణయం జరుగుతోంది. నిజానికి వక్ఫ్‌ ఓ ధార్మిక సంస్థ. అలాంటి సంస్థలో ఇతర మతస్తులను పెట్టడం ఎంతవరకు సమంజసం! నిజంగా మత సామరస్యం కోసమే ఈ నిర్ణయం తీసుకుంటే మంచిదే. అలాంటప్పుడు దేవాదా యశాఖ కమిటీ ల్లోనూ ఇతర మతస్తులకు చోటు కల్పించాలి కదా! అలా చేస్తారా అనేది ప్రశ్న. మహిళలకు కూడా ఈ కమిటీలో చోటు కల్పిస్తామని చెప్పారు. ఇదొక్కటే ఈ చట్ట సవరణలో చెప్పుకోదగ్గ సవరణ. కాషాయదళం చేస్తున్న మరో అబద్దపు ప్రచారం దేశంలో రైల్వే, మిలటరీ తర్వాత పెద్ద ఎత్తున భూమి ఉంది వక్ఫ్‌ బోర్డుకే అని. వాళ్లు చెప్పిన ప్రకారమే 8,70,000 స్థిరాస్తులు వక్ఫ్‌ కింద ఉన్నాయి. అందులో సుమారు 70 నుండి 80 శాతం భూమి ఖబ్రాస్తాన్‌ల్లు(శ్మశానవాటికలు), మసీదుల కిందనే ఉంది. వీటన్నింటినీ ఆస్తులుగా చూపిస్తున్నారు. అయితే ఇవేవీ ఆదాయాన్ని తెచ్చిపెట్టేవి కావు. అలాగే దేశవ్యాప్తంగా వక్ఫ్‌ బోర్డ్‌కు ఏడాదికి సుమారు రూ.163 కోట్లు ఆదాయం వస్తుందని లెక్కలు చూపిస్తున్నారు. అలా అనుకుంటే ఒక్క తిరుమల తిరుపతి దేవస్థానంలోనే భక్తుల తల నీలాల ద్వారా రూ.150 కోట్ల ఆదాయం వస్తుంది. ఇక మిగిలిన దేవాలయాల నుండి ఎంత వస్తుండాలి? ఏ విధంగా చూసినా వక్ఫ్‌బోర్డుకు విపరీతమైన ఆదాయం వస్తున్నట్టు ఎక్కడా కనిపించడం లేదు. లోతుగా పరిశీలిస్తే ఇదంతా హిందువులను రెచ్చగొట్టేందుకు బీజేపీ చేస్తున్న కుట్రగా తెలుస్తున్నది.
వక్ఫ్‌బోర్డుకు అపరిమిత అధికారాలు ఉన్నాయని బీజేపీ మరో వాదన. దీన్ని అడ్డుపెట్టుకొని ఏ భూమినైనా వక్ఫ్‌ కిందకు మార్చుకుంటున్నారనే తప్పుడు ప్రచారం చేస్తుంది. వాస్తవానికి వక్ఫ్‌బోర్డుకు ఎలాంటి హక్కులూ లేవు. వక్ఫ్‌ ట్రిబ్యునల్‌కు మాత్రమే అధికారం ఉంది. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వమే దీన్ని నియమిస్తుంది. వక్ఫ్‌ భూమిని వియోగించు కోవాలంటే కచ్చితంగా రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌పై ఆధారపడాల్సిందే. అంతే తప్ప వక్ప్‌బోర్డుకు రాజ్యాం గానికి మించి అతీతమైన హక్కులేమీ లేవు. కేవలం ముస్లింలను టార్గెట్‌ చేసేందుకు, వక్ఫ్‌ భూము లను స్వాహా చేసేం దుకే కాషాయ దళం ఈ ప్రచారం చేస్తోంది.
ఇప్పటికే వక్ఫ్‌ భూములు పెద్దఎత్తున కబ్జాలకు గురై నిరుపేద ముస్లింలకు ఏ మాత్రం ప్రయోజనం జరగడం లేదు. వాస్తవానికి సచార్‌ కమిటీ సిఫార్సుల ప్రకారం వక్ఫ్‌ భూములను సరిగా వినియోగిస్తే ముస్లింలు ఈపాటికే ఎంతో అభివృద్ధి చెంది ఉండేవారు. కానీ అలాంటి ప్రయత్నం ఇప్పటివరకు ఏ ప్రభుత్వమూ చేయలేదు. ఇక బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి మైనార్టీలనే టార్గెట్‌ చేసింది. అవకాశం చిక్కినప్పుడల్లా హిందూ, ముస్లింల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నది. ప్రజల మధ్య ఈర్ష్యా, ద్వేషాలను సృష్టిస్తున్నది. అందులో భాగంగానే ఇప్పుడు వక్ఫ్‌ చట్ట సవరణ తీసుకురాబోతున్నది! ఈ సవరణ రాజ్యాంగ విరుద్దమని ప్రతిపక్షాలు నెత్తీనోరు కొట్టుకుం టున్నా బీజేపీ చెవికి ఎక్కడం లేదు. అందుకే కేరళ ప్రభుత్వం అసెంబ్లీలో వక్ఫ్‌ చట్ట సవరణకు వ్యతిరేకంగా బిల్లు ప్రవేశపెట్టి అమోదించింది. మిగిలిన రాష్ట్రాలు కూడా ఈ చొరవ చూపాల్సి అవవరసం ఉన్నది. మరీ ముఖ్యంగా బీజేపీ మత రాజకీయాలను తిప్పికొట్టేందుకు దేశపౌరులంతా ఏకమవ్వాలి. వారు నాటుతున్న విష బీజాలను కూకటివేళ్లతో సహా పెకిలించాలి.
సలీమా
9490099083