– 156 చిత్రాలు.. 537 పాటలు..
– 24 వేల స్టెప్పులతో
– గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు
అత్యద్భుతమైన డాన్స్ మూమెంట్స్‌కి పెట్టింది పేరు మెగాస్టార్ చిరంజీవి. పాటల్లో ఆయన వేసే స్టెప్పులకు ప్రేక్షకులు, అభిమానులే కాదు ఏకంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కూడా ఫిదా అయిపోయింది.
156 చిత్రాలు..537 పాటలు..24 వేల స్టెప్పులతో ప్రేక్షకులను అలరించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చిరంజీవి చోటు సొంతం చేసుకుని, మరో అరుదైన విశిష్ట గౌరవాన్ని దక్కించుకున్నారు. చిరంజీవికి గిన్నిస్ వరల్డ్ రికార్డు ప్రకటించే కార్యక్రమం హైదరాబాద్‌లో ఆత్మీయుల సమక్షంలో వైభవంగా జరిగింది. బాలీవుడ్ సూపర్‌స్టార్ ఆమీర్‌ఖాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ తరఫున రిచర్డ్ స్టెన్నింగ్ పాల్గొని, మెగాస్టార్‌కి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికెట్‌ను అందజేశారు. ఇదే వేడుకలో ఆమీర్‌ఖాన్‌కి కానుకగా స్పెషల్ బ్రాండెడ్ పెన్‌ని చిరంజీవి బహూకరించారు.
ప్రాణం పెట్టి డాన్స్ చేస్తారు : అమీర్ ఖాన్
నేను చిరంజీవికి పెద్ద అభిమానిని. చిరంజీవి గిన్నిస్ విషయం నాతో చెప్పినప్పుడు చాలా ఆనందంగా అనిపించింది. ఆయన డాన్స్ చేస్తున్నప్పుడు చూడ్డానికి మనకు రెండు కళ్లు సరిపోవు. ప్రతి పాటను ఆస్వాదిస్తూ.. ప్రాణం పెట్టి డాన్స్ చేస్తారు. ఈ ప్రయాణంలో ఆయన ఇంకా ఎంతో దూరం సాగాలి’.
ఎదురు చూడనిది దక్కింది : చిరంజీవి
ఒక్క ఫోన్ కాల్‌తో అమీర్‌ఖాన్ ఇక్కడకు వచ్చినందుకు ధన్యవాదాలు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ గురించి నేనెప్పుడూ ఊహించలేదు. గిన్నిస్ బుక్‌కి, మనకూ ఏంటి సంబంధం అని మామూలుగా అనుకుంటాం కదా.. కానీ, నాకు అలాంటి ఊహే లేదు. నా జీవితంలో నేను ఎదురుచూడనిది నాకు దక్కింది. భగవంతుడికీ, దర్శక, నిర్మాతలకు, కొరియోగ్రాఫర్లకు, ఫ్యాన్స్‌కి రుణపడి ఉంటాను. నటన కన్నా ముందు నుంచే డ్యాన్సుల మీద నాకు ఇంట్రస్ట్ ఉంది. అదే ఇవాళ నాకు ఈ అవార్డు వచ్చేలా చేసిందా అనిపించింది. నా చిన్నప్పుడు మా చుట్టుపక్కల ఉన్నవారిని ఎంటర్‌టైన్ సంగీతానికి అనుగుణంగా స్టెప్పులు వేయడం అలవాటు చేసుకున్నాను. ఆ అలవాటే ఈ స్థాయికి తీసుకొచ్చింది. నా డాన్స్‌లను చూడ్డానికి ప్రేక్షకులు, అభిమానులు మళ్ళీ మళ్ళీ థియేటర్లకు వచ్చేలా చేసిందంటూ ఇన్నేళ్ళ సినీ ప్రస్థానాన్ని చిరంజీవి గుర్తు చేసుకున్నారు.
అభినందనల వెల్లువ
మెగాస్టార్ గిన్నిస్ బుక్‌లో చోటు సొంతం చేసుకున్న నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితోపాటు పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలిపారు.