– జీవో 59 పేరిట ప్రభుత్వ భూముల కబ్జా..
– చర్యలకు మంత్రుల ఆదేశం
– కాళోజీ కళాక్షేత్రం మూడు నెలల్లో పూర్తి..
– కరెంటు బిల్లులు త్వరలోనే మాఫీ
– జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొంగులేటి
– సమీక్షా సమావేశంలో పాల్గొన్న జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
మేడారం జాతరను ఘనంగా నిర్వహించడానికి ఇప్పటికే రూ.75 కోట్లను విడుదల చేశామని, త్వరలో మరో రూ.30 కోట్లను మంజూరు చేయనున్నట్టు జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. హన్మకొండ పట్టణంలోని కలెక్టరేట్‌లో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 6 జిల్లాల అధికారులతో అభివృద్ధి కార్యక్రమాలపై శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రితోపాటు మంత్రులు కొండా సురేఖ, సీతక్క, పొన్నం ప్రభాకర్, విప్ డాక్టర్ రామచంద్రునాయక్, జిల్లా ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అంతకుముందు మాస్టర్‌ప్లాన్ కోసం సేకరించిన భూములు, వేసిన రోడ్లతో పాటు కాళోజీ కళాక్షేత్ర పనులనూ స్వయంగా పరిశీలించారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో ఆర్భాటంగా చేపట్టిన ప్రాజెక్టులు, పనులు, వాటి పురోగతి, వారిచ్చిన జీవోలు, అర్ధాంతరంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేయడానికి అవసరమైన నిధులు, ఉన్న అడ్డంకులు, ఫారెస్టు క్లియరెన్స్‌లు, అవసరమైన భూసేకరణపై అధికారులతో చర్చించామన్నారు. నీటిపారుదల శాఖ, డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల పురోగతి, పేరుకుపోయిన బిల్లుల పరిష్కారంపై ఆరాతీశామన్నారు. నీటిపారుదల శాఖకు సంబంధించి దేవాదుల తదితర ప్రాజెక్టుల పనులు పూర్తి కాలేదని, ప్రధాన కాలువల నిర్మాణం పూర్తి చేయకుండానే లక్షలాది ఎకరాలకు సాగునీరిచ్చినట్టు గత ప్రభుత్వం ఆర్భాటంగా ప్రచారం చేసుకుందని తెలిపారు. మిషన్ భగీరథ పథకం కింద గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సైతం తాగునీరందడం లేదని చర్చల్లో తమ దృష్టికి వచ్చినట్టు చెప్పారు. వేసవి కాలం వస్తున్న నేపథ్యంలో తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలని ఆదేశించినట్టు తెలిపారు. గత ప్రభుత్వం జారీ చేసిన 59 జీవోతో ప్రభుత్వ భూములు కబ్జా అయ్యాయని, వాటిపై దృష్టి సారించి ఆ భూములు పేదలకు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామన్నారు. ప్రజా అవసరాల మేరకు మాస్టర్‌ప్లాన్‌లో సవరణలు చేసి అమలు చేస్తామని ఒక ప్రశ్నకు వివరణనిచ్చారు.
మూడు నెలల్లో ‘కాళోజీ’ పూర్తి
కాళోజీ కళాక్షేత్రాన్ని పదేండ్లుగా బీఆర్‌ఎస్ ప్రభుత్వం పూర్తి చేయలేకపోయిందని, కాంగ్రెస్ ప్రభుత్వంలో మరో 3 నెలల్లో పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. జిల్లాల పునర్విభజన సున్నితమైన అంశమని, ప్రజాభిప్రాయం మేరకే మార్పులుంటాయన్నారు. నాడు వైఎస్‌ఆర్ నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లకు తగ్గకుండా కొత్తగా ఇందిరమ్మ ఇండ్లను నిర్మిస్తామని తెలిపారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగానే 200 యూనిట్లలోపు వారికి కరెంటు బిల్లులు మాఫీ చేస్తామని స్పష్టం చేశారు. వచ్చే నెలలో మేడారం జాతర ఉన్న నేపథ్యంలో ఈనెల 30న మేడారం వచ్చి అక్కడ ఏర్పాట్లను పరిశీలించనున్నట్టు తెలిపారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించిందని, ఒక్కో నియోజకవర్గంలో రూ.300 కోట్ల మేరకు శంకుస్థాపనలు చేసి పనులు చేయకుండా వదిలేసిందని మంత్రి కొండా సురేఖ విమర్శించారు. గత బీఆర్‌ఎస్ పాలనలో రాష్ట్రంలో 40 మంది సర్పంచ్‌లు ఆత్మహత్యలు చేసుకున్నారని విప్ డాక్టర్ రామచంద్రునాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. సర్పంచ్‌లకు బిల్లులు చెల్లించని నాటి మంత్రి కేటీఆర్ ఇప్పుడు సర్పంచ్‌ల బిల్లుల గురించి మాట్లాడడం విడ్డూరమన్నారు. విలేకరుల సమావేశంలో పరకాల, భూపాలపల్లి, వరంగల్ పశ్చిమ, పాలకుర్తి, వర్ధన్నపేట, మహబూబాబాద్ ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్‌రెడ్డి, గండ్ర సత్యనారాయణరావు, నాయిని రాజేందర్‌రెడ్డి, యశస్వినీరెడ్డి, కె.ఆర్ నాగరాజు, డాక్టర్ మురళీనాయక్, ఆయా జిల్లాల కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.