ఈఎస్‌ఐలో మరో కుంభకోణం..?

ESI Hospital– టెలిమెడిసిన్‌ సేవల పేరుతో డబ్బు కాజేసే యత్నం
– సంబంధం లేని ఐఎంఓల సంతకాల కోసం ఒత్తిడి
– దీంతో రోగులుగా మారుతున్న డాక్టర్లు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో రాజకీయ వేడి రంజుగా సాగుతున్నది. మంత్రులు వారి వారి నియోజకవర్గాల్లో మళ్లీ గెలిచేందుకు ప్రయత్నిస్తున్నారు. అదే బాటలో కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి కూడా ప్రచారంలో బిజీ బిజీగా గడుపుతున్నారు. అదే సమయంలో ఆ శాఖలో మరో కుంభకోణానికి కొంతమంది ఉన్నతాధికారులు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో వెలుగులోకి వచ్చిన కుంభకోణం నుంచి పూర్తిగా కోలుకోక ముందే… ప్రస్తుతమున్న కొంతమంది ఉన్నతాధికారులు టెలి మెడిసిన్‌ సేవల పేరుతో డబ్బు కాజేసే ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం.
ఈఎస్‌ఐ డిస్పెన్సరీల్లో టెలి మెడిసిన్‌ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని గతంలో నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు డిస్పెన్సరీలను రెండుగా విభజించారు. కొన్ని డిస్పెన్సరీలను వీఆర్‌ టెలీహెల్త్‌ పరిధిలోకి తీసుకొచ్చారు. 2017 నుంచి 2019 వరకు ఆయా డిస్పెన్సరీల్లో అవసరమైన రోగులకు ఈసీజీలు తీసి వారి ప్యానెల్‌ ఆఫ్‌ డాక్టర్స్‌కు పంపించి అవసరమైన సలహాలిప్పించడం ఈ సేవల లక్ష్యం. వారికి ఈ సేవలను అప్పగించే క్రమంలో ఆయా డిస్పెన్సరీల ఇన్‌ఛార్జ్‌ మెడికల్‌ ఆఫీసర్లను స్థలాన్ని సమకూర్చాలని ఉన్నతాధికారులు కోరారు. దీంతో ఆయా ఐఎంఓలు తమ డిస్పెన్సరీల్లో వారికి అవసరమైన స్థలాన్ని కేటాయించారు. అయితే వీఆర్‌ టెలిహెల్త్‌ సర్వీసెస్‌ సిబ్బంది హాజరు, సేవల పర్యవేక్షణ వంటి అంశాలను ఐఎంఓల పరిధిలోకి తీసుకురాలేదు. ఇదే కాలంలో ఈఎస్‌ఐలో మందుల కుంభకోణం వెలుగులోకి రావడం, ఇతర కారణాలతో వీఆర్‌ టెలీ హెల్త్‌ సంస్థకు చెల్లింపులు సాధ్యం కాలేదు.
తాజాగా మరోసారి ఈ అంశాన్ని అధికారులు తెరపైకి తీసుకువచ్చారు. వీఆర్‌ టెలీ హెల్త్‌ కు చెల్లింపులు చేయాలని నిర్ణయించారు. వెంటనే ఏ సంబంధం లేని ఐఎంఓలకు వీఆర్‌ టెలీహెల్త్‌కు సంబంధించిన ప్రూఫ్‌ ఆఫ్‌ వర్క్‌ను సమర్పించాలని ఐఎంఓలను కోరుతూ ఇన్సూరెన్స్‌ మెడికల్‌ సర్వీసెస్‌ జాయింట్‌ డైరెక్టర్‌ (మెడికల్‌) ఈ ఏడాది ఏప్రిల్‌ 28న మెమో జారీ చేశారు. మే ఐదులోపు సమర్పించాలని కోరారు. దీంతో సమస్య మొదలైంది. వీఆర్‌ టెలిహెల్త్‌కు సంబంధించిన రికార్డుల మెయింటనెన్స్‌ డిస్పెన్సరీల స్థాయిలో చేయకపోవడంతో ప్రూఫ్‌ ఆఫ్‌ వర్‌ ను ఎలా సమర్పించాలో అర్థం కాక ఐఎంఓలు తలలు పట్టుకున్నారు. కొంత మంది మా వల్ల కాదంటూ తేల్చి చెప్పినట్టు సమాచారం. అలాంటి వారిని టార్గెట్‌ చేసిన అధికారులు సంతకం చేయాలని లేదంటే మారుమూల ప్రాంతాలకు బదిలీ చేస్తామని ఒత్తిడి తెస్తున్నట్టు సిబ్బంది ఆవేదన చెందుతున్నారు. డిస్పెన్సరీల రికార్డులు ఏసీబీ వద్ద ఉంటే వాటిని తెప్పించుకుని మరీ రాసి పంపాలని అధికారులు ఒత్తిడి పెంచుతున్నారనీ, తమకు సంబంధం లేని దాని గురించి ఏసీబీకి రాసి, రికార్డులు తెప్పించుకుని, సంతకాలు చేసి తామెందుకు ఇరుక్కోవాలని? ఐఎంఓలు వాపోతున్నారు.
నీరుగారుతున్న డాక్టర్లు
కార్మికులకు, ఇన్సూర్డ్‌ పర్సన్స్‌ కు వైద్య సేవలందించి ధైర్యం చెప్పాల్సిన డాక్టర్లు ఆ శాఖలో నెలకొన్న పరిస్థితిలో తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. ఈ పరిస్థితి నుంచి తమను గట్టెక్కించేదెవరు? ఆదుకునేది ఎవరు? అని ఎదురుచూసే పరిస్థితులు నెలకొన్నాయి. సంబంధిత కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి జోక్యం చేసుకుంటే తప్ప సిబ్బంది ఆవేదన తీరేలాగా లేదు.