బెంగళూరు : కర్నాటక మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ షెట్టర్ ఆదివారం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. బీజేపీకి కూడా రాజీనామా చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. ‘నేను అసెంబ్లీ సభ్యత్వానికి, పార్టీకి రాజీనామా చేస్తున్నాను. పార్టీ కోసం ఎంతో కష్టపడ్డాను. అయితే వాళ్లు ఇప్పుడు నేను బయటికి పోయేలా చేశారు’ అని షెట్టర్ చెప్పారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసేందుకు ఆయనకు బీజేపీ నాయకత్వం టికెట్ నిరాకరించిన విషయం తెలిసిందే. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన షెట్టర్ హుబ్బళ్లి-ధార్వాడ్ సెంట్రల్ నియోజకవర్గం నుండి మరోసారి టికెట్ ఆశించారు. అయితే పార్టీ అధినాయకత్వం ఆయనకు మొండిచేయి చూపింది. కాగా షెట్టర్ కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉంది. షెట్టర్‌ను బుజ్జగించేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రయత్నించారని, అయినా ప్రయోజనం లేకపోయిందని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై తెలిపారు. ఢిల్లీలో పెద్ద పదవి ఇస్తామని షా హామీ ఇచ్చారని కూడా అన్నారు. బొమ్మైతో పాటు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ కూడా షెట్టర్‌కు నచ్చచెప్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. షెట్టర్ రాజీనామా బీజేపీకి పెద్ద ఎదురు దెబ్బగా పరిశీలకులు భావిస్తున్నారు. ఉత్తర కర్నాటకలో ఆయన కీలక నేతగా వ్యవహరిస్తున్నారు. ఇరవై నుంచి ఇరవై ఐదు నియోజకవర్గాలలో ఆయన ప్రభావం ఉంటుంది. మాజీ ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ్ సావడి కూడా బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. అదే బాటలో జగదీష్ శెట్లర్ కూడా రాహుల్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు.