– బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు మరో పోరాటం చేయాల్సిన ఆవసరం ఏర్పడిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వజూపిన రూ.1 కోటి నగదు, ప్లాట్‌ను తిరస్కరించిన ప్రముఖ కవి నందిని సిద్ధారెడ్డిని శనివారం ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వమే తెలంగాణ అస్ధిత్వంపై కుట్రలు చేస్తున్న తరుణంలో నందిని సిధారెడ్డి నిర్ణయం యావత్ తెలంగాణ సమాజానికి ఒక సందేశమని పేర్కొన్నారు. ఇక్కడి మట్టి బిడ్డలు తమ అస్థిత్వాన్ని కాపాడుకోవడానికి ఎన్ని త్యాగాలకైన వెనుకాడబోరని గుర్తు చేశారు. సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడడంలో కవులు, కళాకారులు ఎప్పుడూ ముందుంటారని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీ దేశ్‌పతి శ్రీనివాస్, బీఆర్‌ఎస్ నాయకులు బాల్క సుమన్, దేవి ప్రసాద్, దాసోజు శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.