కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య

– ఈ ఏడాదిలో ఇది 11వ ఘటన
జైపూర్‌: రాజస్థాన్‌లోని కోటాలో వరుసగా విద్యార్థుల ఆత్మహత్యలు కలవరపెడుతున్నాయి. ఐఐటీ-జేఈఈకి సిద్ధమవుతున్న మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఈ ఏడాది ఇది 11వ ఘటన కావడం ఆందోళన కలిగిస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బీహార్‌లోని మోతీహారీకి చెందిన ఆయుష్‌ జైస్వాల్‌(17) గత రెండేండ్లుగా సామ్రాట్‌ చౌక్‌ ప్రాంతంలో ఉంటూ ఐఐటీ-జేఈఈకి సిద్ధమవుతున్నాడు. శనివారం రాత్రి అతడు గది బయటకు రాకపోవడంతో స్నేహితులు అద్దె ఇంటి యజమానికి తెలిపారు. ఆయన ఎన్ని సార్లు పిలిచినా ఆయుష్‌ తలుపు తీయకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారమిచ్చాడు. వారు ఘటనా స్థలానికి చేరుకొని తలుపులు పగలగొట్టి చూడగా గదిలో ఉరేసుకుని కనిపించాడు. వెంటనే వారు ఆ విద్యార్థిని న్యూ మెడికల్‌ కాలేజీ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. మృతుడి కుటుంబానికి సమాచారం ఇచ్చామని.. వారు వచ్చిన తర్వాత పోస్టుమార్టం నిర్వహిస్తామని తెలిపారు.