యూపీలో మరో నిందితుడి కాల్చివేత

– ఆరేళ్లలో 183 మంది బలి
లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని హర్దోరులో ఆరు సంవత్సరాల బాలికపై అత్యాచారం చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ వ్యక్తిని పోలీసులు శనివారం కాల్చి చంపారు. వైద్య పరీక్షకు తీసుకొని వెళుతుండగా నిందితుడు తమ కస్టడీ నుండి తప్పించుకొని పారిపోయాడని, దీంతో ఆతని కాలిపై కాల్పులు జరిపామని పోలీసులు చెబుతున్నారు. పోలీసుల నుండి తప్పించుకొని వెళ్లిన రెండు గంటల వ్యవధిలో నిందితుడు ఓ నాటు తుపాకీని సంపాదించాడని వారు తెలిపారు. ఒక కాలువ సమీపంలో నిందితుడు కన్పించాడని, తమను చూసి కాల్పులు జరిపాడని, దీంతో తాము కూడా ఎదురు కాల్పులు జరపాల్సి వచ్చిందని వివరించారు. అయితే నిందితుడు ఎలా తప్పించుకోగలిగాడన్నది పోలీసులు చెప్పడం లేదు. నిందితుడి మృతదేహం వద్ద తుపాకీ, కొన్ని తూటాలు లభించాయి. ఎదురు కాల్పులలో కొందరు పోలీసులు కూడా స్వల్పంగా గాయపడ్డారని అంటున్నారు. కస్టడీ నుండి నిందితుడు తప్పించుకునే సమయంలో విధినిర్వహణలో ఉన్న పోలీసులపై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
2017 మార్చి నుండి 2023 మార్చి వరకూ యోగి ఆదిత్యనాథ్‌ పాలనలో ఉత్తరప్రదేశ్‌లో 183 మంది వ్యక్తులు ఎదురు కాల్పుల ఘటనల్లో చనిపోయారు. ఇవన్నీ ఎన్‌కౌంటర్లేనని పోలీసులు చెప్పారు. అయితే ఇవి ముందస్తు పథకం ప్రకారం జరిగిన ఘటనలేనని, చట్టాన్ని ఉల్లంఘించి పోలీసులు ప్రజల ప్రాణాలు పొట్టనపెట్టుకున్నారని హక్కుల కార్యకర్తలు ఆరోపించారు. ఈ ఘటనల్లో 4,947 మంది గాయపడ్డారు. వీరిలో చాలా మందికి కాలిపై గాయాలవడం గమనార్హం. యూపీలో జరిగిన ఎన్‌కౌంటర్లపై సుప్రీంకోర్టు సమగ్ర నివేదికలు కోరింది. అయితే ఇవి బూటకపు ఎన్‌కౌంటర్లు కావని, ప్రభుత్వ ప్రోద్బలంతో జరిగినవి కూడా కావని సర్కారు అంటోంది.