– రానే బ్రేక్ లైనింగ్ పరిశ్రమ యూనియన్ సమావేశంలో.. సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు
నవ తెలంగాణ-గజ్వేల్
వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో మతోన్మాద కార్మిక, ప్రజా వ్యతిరేక బీజేపీని ఓడించాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని టీవైఆర్ గార్డెన్‌లో రానే బ్రేక్ లైనింగ్ పరిశ్రమ యూనియన్ (సీఐటీయూ) జనరల్ బాడీ సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తూ కార్మిక చట్టాలన్నింటిని రద్దు చేసి ప్రజాస్వామ్యం లేకుండా చేసిందని విమర్శించారు. పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలు అన్నింటిని రద్దుచేసి యజమాన్యాలకు అనుకూలంగా కోడ్లు రూపొందించడం సమంజసం కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతు చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రైతు సంఘాలు సంవత్సరం పాటు పోరాటం చేశాయని, ఫలితంగా కేంద్ర ప్రభుత్వం చట్టాలు రద్దు చేసిందని గుర్తుచేశారు. ప్రజలపై ప్రత్యక్షంగా భారాలు వేస్తూ కార్పొరేట్ సంస్థలకు రాయితీలు ఇస్తుందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటీకరణ చేసిందన్నారు. దేశంలో మహిళల, దళితుల, మైనార్టీల మీద దాడులు పెరిగాయని, ప్రజలు అభద్రతాభావంలో ఉన్నారని ఆరోపించారు. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లికార్జున్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కనీస వేతనం రూ.26,000లకు పెంచాలని గత ప్రభుత్వం పెట్టిన జీవోలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి కామన్ గోపాలస్వామి, జిల్లా అధ్యక్షులు సందబోయిన ఎల్లయ్య, రానే పరిశ్రమ యూనియన్ నాయకులు వేణుగోపాల్, బండ్ల స్వామి, బిక్షపతి, చంద్రశేఖర్ రెడ్డి, రవికుమార్, సాజిద్, నర్సింలు, స్వామి, మల్లయ్య, రాజగోపాల్ కార్మికులు పాల్గొన్నారు.