బిల్లుల కోసం ఉపాధి కూలీల ఎదురుచూపు

బిల్లుల కోసం ఉపాధి కూలీల ఎదురుచూపు– నెలల తరబడి బిల్లులు రాకపోవడంతో పూట గడవని పరిస్థితి
– పిల్లల చదువులు, వ్యవసాయ పనులకు అప్పులు చేస్తున్న వైనం..
– 8 వారాలుగా బిల్లులు రాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులతో వీధిన పడుతున్న ఉపాధి కూలీల కుటుంబాలు
నవతెలంగాణ-ఆమనగల్‌
వలసలు నివారించి నివాస ప్రాంతాల్లోనే కూలీలకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ఏర్పడిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ప్రభుత్వ ఉదాసీన వైఖరి వల్ల నీరుగారి పోతుంది. ఉపాధి పనులు చేస్తున్న కూలీలకు వారం వారం బిల్లులు అందక తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని గ్రామీణ ప్రాంతాల్లోని ఉపాధి కూలీలు చేసిన పనికి రావాల్సిన బిల్లుల కోసం నెలల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. మండలంలో మొత్తం జాబ్‌ కార్డులు పొందిన కుటుంబాలు 4,285 ఉండగా ప్రస్తుతం 4,748 మంది కూలీలు ఉపాధి పనులు చేస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో పని పొందిన కుటుంబాల సంఖ్య 2021 కాగా 2,792 మంది కూలీలు ఉపాధి పనులు చేస్తున్నారు. మండలంలో ఉన్న మొత్తం 13 గ్రామ పంచాయతీలకు గాను ఆకుతోటపల్లి 611 చెన్నంపల్లి 20, చింతలపల్లి 211, కోనాపూర్‌ 369, కొత్త కుంటతండా 213, మంగళపల్లి 446, మేడిగడ్డ 418, పోలేపల్లి 326, రానుంతల 431, శెట్టిపల్లి 420, సీతారాం నగర్‌తండా 247, శంకర్‌కొండ 190, సింగంపల్లి 206 మంది ఉపాధి పనులు చేయగా ఇప్పటి వరకు వారికి చెల్లించిన మొత్తం రూ.167.95 లక్షలు, మెటీరియల్‌ ఖర్చు కింద రూ.9.19 లక్షలు అయినట్టు నివేదికలు చెబుతున్నాయి. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి చేసిన పనికి వారం వారం బిల్లులు చెల్లించాలని ఉపాధి కూలీలు కోరుతున్నారు.
ఉపాధి కూలీల పెండింగ్‌ బిల్లుల విషయంపై ఏపీఓ మాధవ రెడ్డిని వివరణ కోరగా ఒక్కో గ్రామంలో ఒకలాగ మొత్తం మీద ఆరు నుంచి ఎనిమిది వారాల బిల్లులు చెల్లించాల్సి ఉంది. వాటిని త్వరలో చెల్లించేందుకు నివేదికలు రూపొందించి ఉన్నత అధికారులకు అందజేసినట్టు తెలిపారు.
బిల్లులు చెల్లించకుంటే ఏమీ తిని బతకాలి
– రెండు నెలల నుంచి బిల్లులు రాకుంటే, తాము ఏమి తిని బతకాలి. కూలీ డబ్బులు వారం వారం చెల్లించాలి. అన్ని పనులకు నగదు ఇస్తే మాతోని ఉద్దెరకే పని చేయించుకుంటారు.
-పాత్లావత్‌ భీమిని, ఉపాధి కూలి రాంనుంతల
ఏ వారం డబ్బులు ఆ వారమే ఇవ్వాలి
-ఎనిమిది వారాల బిల్లులు రావాల్సి ఉంది. పిల్లల స్కూల్‌ ఫీజులు కట్టనీకే, వానాకాలం పంట సాగుకు పెట్టు బడుల కోసం అప్పులు చేశాం. ఈ కట్టల పని పైసలు దేనికి అవసరానికి రావు. ఎప్పడి స్తారో ఏమో ఎప్పుడూ చేసిన పనికి ఆ వారమే డబ్బులు చెల్లించాలి.
-ఎల్‌.బుజ్జి, ఉపాధి కూలి రాంనుంతల