పాకిస్థాన్‌ తాత్కాలిక ప్రధానిగా అన్వర్‌ ఉల్‌ హక్‌ కాకర్‌

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ తాత్కాలిక ప్రధానమంత్రిగా అన్వర్‌ ఉల్‌ హక్‌ కాకర్‌ ఎన్నికయ్యారు. పాకిస్థాన్‌ జాతీయ అసెంబ్లీ రద్దు కావడంతో పదవీ విరమణ చేసిన ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌, ప్రతిపక్ష నాయకుడు రాజా రియాజ్‌ శనివారం సమావేశమయ్యారు. తాత్కాలిక ప్రధానిగా ఎవరిని ఎన్నుకోవాలి అన్న దానిపై చర్చించి ఒక అభిప్రాయానికి వచ్చారు. చిన్న ప్రావిన్స్‌కు చెందిన బలూచిస్థాన్‌ అవామీ పార్టీ (బీఏపీ) చట్టసభ్యుడు కాకర్‌ను తాత్కాలిక ప్రధానిగా ఎంపికచేశారు. ఆయన నియామకాన్ని పాక్‌ అధ్యక్షుడు ఆరీఫ్‌ అల్వీ ఆమోదించారు. పాకిస్థాన్‌ ప్రధానమంత్రి కార్యాలయం ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదలచేసింది.