– కొనసాగుతున్న మొదటి రౌండ్ లెక్కింపు
– ప్రతి రౌండ్‌లోనూ 48 వేల ఓట్ల లెక్కింపు
– రాత్రి వరకు తేలనున్న ఫలితం
– పకడ్బందీగా కౌంటింగ్ : కలెక్టర్
– లెక్కించిన ఓట్లలో మల్లన్న ముందంజ
నవతెలంగాణ -మిర్యాలగూడ
ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ ఉత్కంఠ రేపుతోంది. బుధవారం ఉదయం 8 గంటలకు నల్లగొండలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ కేంద్రంలో ప్రారంభమైన కౌంటింగ్ తొలుత బ్యాలెట్ బాక్స్‌లో నుంచి బ్యాలెట్ తీసి 25 చొప్పున కట్టలు కట్టారు. సాయంత్రం నాలుగ్గంటల వరకు కట్టలు కట్టడం పూర్తయింది. ఆ తర్వాత మొదటి రౌండ్ ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. మొత్తం కౌంటింగ్‌లో నాలుగు హాళ్లలో 96 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఒక్కొక్క హాల్లో 24 టేబుల్స్ ఉన్నాయి. టేబుల్‌కు 500 ఓట్ల చొప్పున ప్రతి రౌండ్లో 48 వేల ఓట్లు లెక్కించే విధంగా ఏర్పాటు చేశారు. మొదటగా చెల్లిన, చెల్లుబాటు కానీ ఓట్లను వేర్వేరు చేశారు. బుధవారం రాత్రి పది గంటల వరకు అందిన సమాచారం మేరకు లెక్కించిన ఓట్లలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ముందంజలో ఉన్నారు. కాంగ్రెస్‌కు 2167 ఓట్లు రాగా, బీఆర్‌ఎస్ అభ్యర్థి రాకేష్‌రెడ్డికి 1573 ఓట్లు వచ్చాయి. అయితే చెల్లని ఓట్లు కూడా భారీగా పడినట్టు సమాచారం. బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డికి 750 ఓట్లు పడ్డాయి.
ఈ పట్టభద్రుల నియోజకవర్గంలో మొత్తం 4,63,839 ఓట్లు ఉండగా, గత నెల 27న జరిగిన పోలింగ్‌లో 3,36,013 ఓట్లు నమోదయ్యాయి. ఓట్లను లెక్కించేందుకు 1800 మంది సిబ్బందిని నియమించారు. షిఫ్ట్‌ల వారీగా సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. బుధవారం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఒక బ్యాచ్ 900మంది విధులు నిర్వహించగా, మధ్యాహ్నం 3 గంటల నుంచి అర్ధరాత్రి వరకు మరో బ్యాచ్ విధులు నిర్వర్తించారు.
పకడ్బందీగా లెక్కింపు : కలెక్టర్
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపును పకడ్బందీగా నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్, రిటైనింగ్ అధికారి దాసరి హరి చందన తెలిపారు. మొదటి ప్రాధాన్యత ఓటు.. పోలైన ఓట్లలో 51 శాతం వస్తే విజేతగా ప్రకటిస్తామని, రానిపక్షంలో అతి తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థిని ఎలిమినేట్ చేసి అతని రెండో ప్రాధాన్యత ఓటును పోటీలో ఉన్న అభ్యర్థులకు కలిపి లెక్కిస్తామన్నారు. ఆ విధంగా 51 శాతం ఓట్లు వచ్చే వరకు లెక్కింపు జరుగుతుందన్నారు.
మొదటి ప్రాధాన్యత ఓటుతోనే గెలుపు :తీన్మార్ మల్లన్న
పట్టభద్రులు అన్ని విధాలుగా ఆలోచించి ఓట్లు వేశారని, విజయం తనదేనని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ధీమా వ్యక్తం చేశారు. కౌంటింగ్ కేంద్రం వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు.