జెనిన్‌లో ఏ ఇల్లు చూసినా విధ్వంసమే!

– మిలటరీ స్థావరాలుగా మారిన ఇళ్ళు
– బీభత్సాన్ని సృష్టించిన ఇజ్రాయిల్‌ సైనిక బలగాలు
జెరూసలేం : ఆక్రమిత వెస్ట్‌ బ్యాంక్‌లోని జెనిన్‌ పట్టణంలో ఏ ఇల్లు చూసినా వినాశనం, విధ్వంసమే కనిపిస్తోంది. పెద్ద తుపానులు వస్తే ఇల్లు వాకిలీ ఎలా ధ్వంసమవుతాయో ఆ రకమైన పరిస్థితి కనిపిస్తోంది. ఇళ్ళలోని ఫర్నిచర్‌ అంతా పగిలిపోయి, విరిగిపోయి, నేల బీటలు వారి, కరెంట్‌ లైన్లు కట్‌ అయిపోయి ఎక్కడ చూసినా బీభత్సంగా వుంది. ఇజ్రాయిల్‌ బలగాలు జెనిన్‌ నుండి వైదొలగిన తర్వాత అక్కడి పరిస్థితి ఇది. ఏది కూడా ఉపయోగించడానికి వీలుగా లేదు. పెద్ద వినాశనమే చోటు చేసుకుంది అని తమ ఇళ్ళకు తిరిగి వచ్చినవారు వ్యాఖ్యానిస్తున్నారు. ఆదివారం నుండి మూడు రోజుల పాటు సాగిన ఇజ్రాయిల్‌ ఆర్మీ దాడుల తర్వాత నెమ్మదిగా ఒకరొకరుగా వస్తున్నారు. ”ఇంట్లో ప్రతిదీ మరమ్మత్తులు చేయించుకోవాల్సిందే, వీటికి కనీసం నెల రోజులు పట్టేలా వుంది.” అని తహనెV్‌ా (41) వ్యాఖ్యానించారు. గత రెండు దశాబ్దాల్లోనే అత్యంత దారుణంగా జరిగిన దాడి ఇది. ”కేవలం పది నిముషాల్లోగా ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి. లేనిపక్షంలో మీ ఇళ్ళపై బాంబు దాడులు చేస్తాం.” అని సైనిక బలగాలు మైకుల్లో గట్టిగా కేకలు వేసారని తహనెV్‌ా గుర్తు చేసుకున్నారు.
జెనిన్‌ పట్టణంలో అనేక ఇళ్ళు ఇజ్రాయిల్‌ ఆర్మీ బలగాలకు మిలటరీ స్థావరాలుగా మారాయి. అనేక ఇళ్ళకు బయటి గోడలకు పెద్ద పెద్ద రంధ్రాలు పెట్టి వాటిల్లో నుండి పాలస్తీనియన్లను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారు. ఆ ప్రాంతాల్లో నేలపై ఎక్కడ పడితే అక్కడ ఖాళీ తూటాలు పడి వున్నాయి. ఇళ్ళలో వస్తువులను, ఆహార పదార్ధాలను చెల్లాచెదురు చేశారు. ఇళ్ళకు వచ్చి చూసుకుంటే కేవలం విధ్వంసం తప్ప మరేమీ కానరావడం లేదని వారు వాపోతున్నారు. 1948లో తమ స్వంత ఇళ్ళ నుండి వెళ్ళగొట్టబడిన దాదాపు 23,600మంది పాలస్తీనియన్లు జెనిన్‌ పట్టణంలో పునరావాసం ఏర్పాటు చేసుకున్నారు.