మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని తెలిసి కూడా చాలా మంది దానికి బానిసలుగా మారిపోతున్నారు. జీవితమే నాశనం చేసుకుంటున్నారు. దాని నుండి బయటకు రాలేని పరిస్థితుల్లో చిక్కుకుపోతున్నారు. కుటుంబ ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నం అయినా వారికి సంబంధం లేదూ. భార్యా, పిల్లల గురించి అసలే ఆలోచించరు. అలా మద్యానికి బానిసైన భర్తను ఎలా మార్చుకోవాలో అర్థం కాక ఐద్వా లీగల్ సెల్‌కు వచ్చింది 32 ఏండ్ల శిల్ప.
శిల్పకు ముగ్గురు పిల్లలు. 18 ఏండ్లు ఉన్నప్పుడు నిఖిల్‌ని ప్రేమించి పెండ్లి చేసుకుంది. అప్పట్లో అతను డ్రైవర్‌గా పని చేసేవాడు. తల్లిదండ్రులు గ్రామంలో ఉండేవారు. నిఖిల్ మాత్రం హైదరాబాద్ వచ్చి పని చేసుకుంటున్నాడు. శిల్ప వాళ్ళ ఇంటికి దగ్గర్లోనే ఉండేవాడు. ఇద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారింది. మొదట్లో వీరి ప్రేమను ఇంట్లో వారు అంగీకరించలేదు. దాంతో పోలీస్‌స్టేషన్‌కు వెళ్ళి కేసు పెట్టారు. ఇద్దరూ మేజర్లు కావడంతో సంఘం పెద్దలతో మాట్లాడి పెండ్లి చేశారు. కాకపోతే ఇద్దరూ తమ కుటుంబాన్ని కూడా చూసుకోవాలని పెద్దలు నచ్చజెప్పారు. అలా అని లెటర్ కూడా రాయించుకున్నారు.
నిఖిల్‌కి కానీ, శిల్పకు కానీ అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఎవ్వరూ లేరు. కాబట్టి కచ్చితంగా వాళ్ళు కుటుంబ సభ్యులను కూడా చూసుకోవాలి. దానికి ఇద్దరూ ఒప్పుకొని పెండ్లి చేసుకున్నారు. ఏడాది వరకు ఇద్దరూ బాగానే ఉన్నారు. తర్వాత అనారోగ్యంతో శిల్ప తండ్రి చనిపోయాడు. శిల్ప తల్లిని తన ఇంటికి తీసుకొచ్చింది. నిఖిల్ కూడా కొన్ని రోజులు ఆమెతో బాగానే ఉన్నాడు. వాళ్ళ జీవితంలోకి పాప వచ్చింది. దాంతో ఖర్చులు పెరిగాయి. కుటుంబంలో గొడవలు మొదలయ్యాయి. బాధ్యతలు మర్చిపోయి నిఖిల్ మద్యానికి అలవాటు పడ్డాడు. ఇలాంటి పరిస్థితుల్లో రెండో పాప పుట్టింది. గొడవలు మరింత పెరిగి పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టించారు. ఆ పంచాయితీ నిర్ణయం ప్రకారం శిల్ప కూడా ఉద్యోగం చేయడం ప్రారంభించింది. తల్లి ఇంట్లో వుంటూ పిల్లల్ని చూసుకునేది. అంతా బాగానే ఉంది కదా అనుకుంటున్న సమయంలో నిఖిల్ ఉద్యోగం పోయింది.
శిల్పకు వచ్చిన జీతంతోనే ఇల్లు గడవాలి. మరో ఉద్యోగం చూసుకోమని అత్తా, భార్యా పదే పదే అడగటంతో వారి మధ్య గొడవలు మరింత పెరిగాయి. తాగొచ్చి శిల్పను కొట్టేవాడు. ఇక మూడో సారి శిల్పకు బాబు పుట్టాడు. వేరే ఉద్యోగం చూసుకున్నా వచ్చిన జీతం కుటుంబ ఖర్చులకు సరిపోయేది కాదు. ఈ విషయం పైనే ఇంట్లో ఒక రోజు పెద్ద గొడవ జరిగింది. దాంతో నిఖిల్ ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. ఇప్పటికి అతను ఇల్లు వదిలి వెళ్ళి ఎనిమిది నెలలు అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాక శిల్ప తల్లిని తీసుకుని ఐద్వా లీగల్ సెల్‌కు వచ్చింది. దాంతో మేము నిఖిల్‌కు ఫోన్ చేసి పిలిపించాము.
శిల్ప చెప్పిన దాని గురించి నిఖిల్‌ని అడిగితే ‘నాకు తాగే అలవాటు అసలు మొదటి నుండి లేదు. పెండ్లి తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులే అలవాటు చేశారు. అయినా నేను రోజూ ఏమీ తాగను. శిల్ప వాళ్ళ అమ్మ నాతో గొడవ పెట్టుకున్నపుడు మాత్రమే తాగుతాను. ఎంత మంచిగా చూసినా చూడడం లేదు, డబ్బులు ఇవ్వడం లేదు అంటూ ఇద్దరూ నాపై గొడవ పడి బూతులు తిడుతుంటారు. ఒక్కోసారి ఇద్దరూ కలిసి కొడతారు. అందుకే ఇంట్లో నుండి వెళ్ళిపోయాను. కానీ నా పిల్లలను చూడకుండా ఉండలేకపోయాను. దాంతో తిరిగి వస్తే మళ్ళీ కొట్టారు. ఇప్పుడు నన్నేం చేయమంటారు. నా తల్లిలాంటిదని మా మామయ్య చనిపోతే అత్తను మా ఇంటికి తీసుకొచ్చుకున్నా. మా అమ్మానాన్న ఊర్లో కూలి పనులు చేసుకుంటూ బతుకుతున్నారు. అయినా వాళ్ళు మాకు అవసరమైనప్పుడు డబ్బులు కూడా పంపిస్తారు. అంతేకాదు బియ్యం, కూరగాయలు, పప్పులు కూడా పంపిస్తారు. నేను ఇప్పటి వరకు వాళ్ళకు ఒక్కపైసా ఇవ్వలేదు. మేమిద్దరం పని చేస్తే తప్ప కుటుంబం గడవని పరిస్థితి. ఇక నేను ఇంటికి ఎలా పంపిస్తాను. కానీ వాళ్ళు మాత్రం వచ్చిన డబ్బు మొత్తం మీ అమ్మానాన్నకు పంపిస్తున్నావంటూ గొడవ చేస్తారు. నన్ను మా వాళ్ళతో మాట్లాడనీయరు. పని నుండి ఇంటికి వచ్చిన వెంటనే బూతులు తిట్టడం మొదలుపెడతారు. అన్నం కూడా పెట్టరు. అందుకే నేను బయటే తిని తాగి వస్తాను. నేను తాగితేనే వాళ్ళకు సమాధానం చెప్పగలను. లేదంటే వాళ్ళతో మాట్లాడటం కష్టం. అందుకే తాగుతాను. ఒక సారి నా బట్టలు కూడా తీసి బయట పడేశారు. ఇక నేను వారితో కలిసి ఎలా ఉంటాను. అందుకే ఇంట్లో నుండి వెళ్ళిపోయాను. ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి నేనే వాళ్ళను వదిలి వెళ్ళిపోయానని కంప్లెయిట్ ఇచ్చారు. మీరే మాకు న్యాయం చేయండి’ అంటూ తన మాటలు ముగించాడు.
‘బాగా తాగి వచ్చి గొడవ చేస్తుంటే ఇంట్లో నుండి వెళ్ళిపొమ్మన్నాను. అంతే దానికే వెళ్లిపోతే నేను నా పిల్లలతో ఎలా బతకాలి. అందుకే మీ దగ్గరకు వచ్చాను’ అంది శిల్ప. దాంతో ఇద్దరినీ కూర్చోబెట్టి ‘నిఖిల్ నువ్వు తాగకుండా మంచిగా ఉండాలి. అప్పుడు వాళ్ళు కూడా గొడవ చేయరు. అలాగే మీరిద్దరూ కలిసి డీ-అడిక్షన్ కేంద్రానికి వెళ్ళి ట్రీట్‌మెంట్ తీసుకోండి. నెమ్మదిగా తాగడం మానెయ్యాలి. తాగడం వల్లనే మీ మధ్య ఇన్ని సమస్యలు వస్తున్నాయి’ అని చెప్పారు.
శిల్పతో ‘నువ్వు కూడా భర్తగా అతనికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలి. అతను ఈ అలవాటు నుండి బయట పడాలంటే నీ సహకారం చాలా అవసరం. అతన్ని రెచ్చగొట్టే మాటలు అనకుండా మంచితనంతో మార్చుకోండి. ఇంటికి వచ్చిన వెంటనే గొడవ పడడం, తిట్టడం, అన్నం పెట్టకుండా ఉండటం లాంటివి చేస్తే మీ మధ్య సమస్యలు మరింత ఎక్కువవుతాయి. పిల్లలకు తల్లిదండ్రులు ఇద్దరూ అవసరం. అప్పుడే వారి భవిష్యత్ బాగుంటుంది. మీ గొడవలతో వారి జీవితం నాశనం చేయొద్దు. మీ అమ్మ నీతో ఉండవచ్చు కానీ అతని తల్లిదండ్రులతో అతన్ని మాట్లాడనీయకపోవడం కరెక్ట్ కాదు. పైగా వాళ్ళు మీకు ఎంతో సహాయం చేస్తున్నారు. అలాంటి వాళ్ళను దూరం పెట్టడం మంచి పద్దతి కాదు. అప్పుడప్పుడు పిల్లల్ని తీసుకొని ఊరికి వెళ్ళొస్తూ ఉండు’ అని చెప్పారు.
చివరగా ‘మీరిద్దరూ మారాలనుకుంటున్నారు. మంచిగా ఉండాలనుకుంటున్నారు. కాబట్టి ఇద్దరూ మేము చెప్పినట్టు వింటే మీ భవిష్యత్‌తో పాటు మీ పిల్లల భవిష్యత్ కూడా బాగుంటుంది’ అని చెప్పాము. దానికి ఇద్దరూ ఒప్పుకున్నారు.
కొంత కాలం తర్వాత శిల్ప వచ్చి ‘నిఖిల్ ఇప్పుడు తాగడం మానేశాడు. నన్నూ, పిల్లల్ని బాగా చూసుకుంటున్నాడు. మా పెద్దపాపను హాస్టల్లో చేర్పించాము. మేమిద్దరం ఉద్యోగాలు చేస్తున్నాం. మా అమ్మ పిల్లలను చూసుకుంటూ ఇంట్లోనే ఉంటుంది’ అని సంతోషంగా చెప్పింది.
నిఖిల్ చికిత్స, కౌన్సిలింగ్ తీసుకుంటూ తాగుడు నుండి బయట పడ్డాడు. అలా అతను ఆ మత్తు నుండి బయట పడేందుకు రెండేండ్లు పట్టింది. కుటుంబం కూడా అతనికి ఎంతో సహకరించింది. నిఖిల్ కూడా ఈ వ్యసనం నుండి బయట పడాలని బలంగా కోరుకున్నాడు. ప్రయత్నిస్తే ఏదైనా సాధ్యం అని నిరూపించాడు. అందరూ ఇలా తమ వ్యసనాల నుండి బయట పడాలని భావిస్తే కుటుంబాల్లో సమస్యలు చాలా వరకు తగ్గిపోతాయి.