అమరావతి : విశాఖలో మంత్రులు, ఉన్నతాధికారులు, విభాగాల అధిపతుల క్యాంపు కార్యాలయాల వ్యవహారం కొలిక్కి వచ్చింది. నగరంలో వేర్వేరు చోట్ల భవనాలు కేటాయించారు. వీటిల్లో 2.27 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం అందుబాటులో ఉందని, సొంత భవనాలు అందుబాటులోని లేని సీనియర్ అధికారులకు మిలీనియం టవర్స్‌లోని ఎబి బ్లాకుల్లో కేటాయించాలని, దీనికోసం 1.75 చదరపు అడు గులు స్థలం అందుబాటులో ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు గురువారం రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్‌రెడ్డి 2883 నెంబరుతో ఉత్తర్వులు జారీ చేశారు. 35 శాఖలకు సంబంధించి క్యాంపు కార్యాలయాల అవసరాన్ని పొందుపరిచినా వాటిల్లో 19 శాఖలకు కేటాయింపులు జరపలేదు. 18 శాఖలకు గుర్తిస్తున్నామని, ఒకశాఖకు స్థలం అందుబాటులో లేదని పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణ పేరుతో విశాఖలో క్యాంపు కార్యాలయాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించి, ముగ్గురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశారు.