నవతెలంగాణ-బంజారా హిల్స్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా చంద్రబాబునాయుడు శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎయిర్‌పోర్టు నుంచి జూబ్లీహిల్స్‌లోని తన నివాసం వరకు టీడీపీ శ్రేణులు చంద్రబాబు ర్యాలీ నిర్వహించారు. సాయంత్రం 7 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు శ్రేణులు ఘన స్వాగతం పలికారు. టపాకాయలు పేల్చారు. రోడ్డు మార్గంలో ప్రజలకు అభివాదం చేస్తూ చంద్రబాబు ముందుకు సాగారు. జోరు వర్షంలోనూ సైతం తనకోసం వచ్చిన అభిమానులు, కార్యకర్తలకు చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. సుమారు రెండు నుంచి మూడు గంటల పాటు ర్యాలీ వర్షంలోనే కొనసాగింది. బేగంపేట నుంచి జూబ్లీహిల్స్ వరకు టీడీపీ ఫ్లెక్సీలు, తోరణాలతో ఆ రహదారి పసుపు మయంగా మారింది. చంద్రబాబు తెలంగాణ పర్యటన నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు.