– మొండి, తొండి వాదనలొద్దు
– సిట్టింగ్ జడ్జి విచారణకు సహకరించాలి
– రిటైర్డ్ ఇంజినీర్ల బృందం సూచన పట్టించుకోలేదు
– కాళేశ్వరం వరప్రదాయం కాదు కళంకం
– అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సాగునీటిరంగం ప్రాజెక్టుల నిర్మాణంపై హరీశ్‌రావు మొండి వాదనలకు, తొండి వాదనలకు పోకుండా చేసిన తప్పులకు క్షమాపణ చెప్పాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఎవరి ఒత్తిడి వల్ల అలా చేశారో సిట్టింగ్ జడ్జి విచారణలో హరీశ్‌రావు కన్ఫెక్షన్ స్టేట్‌మెంట్ ఇచ్చి ఒప్పుకోవాలనీ, రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని సూచించారు. సాగునీటిపారుదల రంగంపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శ్వేతపత్రం విడుదల చేసిన అనంతరం జరిగిన చర్చ సందర్భంగా సీఎం మాట్లాడారు. గోదావరి బేసిన్‌లో ప్రాజెక్టుల నిర్మాణంపై ఐదుగురు రిటైర్డ్ ఇంజినీర్లతో ఆనాటి సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు ఒక కమిటీ వేయగా అది 14 పేజీలతో నివేదిక ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రాజెక్టుల నిర్మాణంలో జరిగిన తప్పులకు క్షమాపణలు చెప్పి సహకరిస్తే హరీశ్‌రావుకు గౌరవం ఉండేదన్నారు. చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు బీఆర్‌ఎస్ సభ్యులు పడరాని పాట్లు పడుతున్నారని విమర్శించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నీళ్ల విషయంలో జరిగిన అన్యాయం వల్లనే ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం జరిగిందన్నారు. తెలంగాణ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిసమయంలో పొన్నం ప్రభాకర్, రాజగోపాల్‌రెడ్డి, అంజన్‌కుమార్ యాదవ్, సిరిసిల్ల రాజయ్య, తదితర తెలంగాణ ఎంపీలు పెప్పర్‌స్పే దాడిని తిప్పికొట్టి గట్టిగా మాట్లాడారని గుర్తుచేశారు. ఆ సమయంలో కేసీఆర్ అసలు సభలో ఉన్నాడా? అని ప్రశ్నించారు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు అడ్డంకులను తొలగించేందుకు మహారాష్ట్ర సీఎంతో అప్పటి సీఎం చర్చించారని తెలిపారు. 2012 లో స్టాండింగ్, కో-ఆర్డినేషన్ కమిటీలను వేశారన్నారు. తుమ్మిడిహెట్టి దగ్గర 152 మీటర్ల ఎత్తులో ప్రాజెక్టు కడితే మహారాష్ట్రకు చెందిన 1850 ఎకరాల పట్టా భూములు, 150 మీటర్ల ఎత్తులో కడితే 1250 ఎకరాలు మాత్రమే ముంపునకు గురయ్యేదని కమిటీ తేల్చి చెప్పిన విషయాలను వివరించారు. మహారాష్ట్ర ప్రభుత్వం విననిపక్షంలో కనీసం 150 మీటర్ల ఎత్తులోనైనా సరేగానీ తుమ్మిడిహెట్టి వద్దనే ప్రాజెక్టు కట్టాలనీ, లేనిపక్షంలో అప్పటిదాకా ఖర్చుపెట్టిన డబ్బులన్నీ వృథా అవుతాయని రిటైర్డ్ ఇంజినీర్ల కమిటీ స్పష్టం చేసిన విషయాన్ని ప్రస్తావించారు. ఈ రెండు విషయాల్లో మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఎలాగైనా ఒప్పించాలని సీఎం కేసీఆర్‌కు చెప్పినా పెడచెవిన పెట్టారని విమర్శించారు. మేడిగడ్డ దగ్గర ప్రాజెక్టు కట్టాలని కేసీఆర్ పుర్రెలో పురుగుపుట్టిందన్నారు. మేడిగడ్డ దగ్గర ప్రాజెక్టు కట్టాలని కేసీఆర్‌కు ఏ దేవుడు కలలోకి వచ్చి చెప్పారో తెలియదని ఎద్దేవా చేశారు. మేడిగడ్డ వద్ద నిర్మిస్తే నిరుపయోగమని ఐదుగురు ఇంజనీర్ల కమిటీ తేల్చిచెప్పిందన్నారు. ఆ ఐదుగురు ఇంజినీర్లు తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన వారని గుర్తుచేశారు. అలాంటి వారు ఇచ్చిన రిపోర్టును తొక్కిపెట్టి మామాఅల్లుళ్లు రాష్ట్ర ఖజానాను కొల్లగొట్టేందుకు, కమీషన్ల కోసం మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు కట్టారని ఆరోపించారు. కేసీఆర్, హరీశ్‌రావు కలిసి రాష్ట్రానికి ఎంత ద్రోహం చేశారో ఇప్పటికైనా వాళ్లు తెలుసుకోవాలని హితవు పలికారు. కాళేశ్వరం తెలంగాణకు వరప్రదాయిని కాదనీ, అది ఒక కళంకంగా మిగిలిపోయిందని విమర్శించారు. ఈ విషయంలో క్షమాపణలు చెప్పాల్సిందిపోయి.. నిస్సిగ్గుగా సభలో నిలబడి మమ్మల్ని ప్రశ్నిస్తారా? ప్రాజెక్టులు నిలువునా పగిలిపోతుంటే క్షమాపణలు చెప్పకుండా ఇంకా వాదిస్తారా? అని నిలదీశారు. కాళేశ్వరం పాపాలకు మీరిద్దరే బాధ్యులని విమర్శించారు. కాగ్, ఎన్‌ఫోర్స్‌మెంట్ నివేదికలను హరీశ్‌రావు తప్పుబట్టడం సరిగాదన్నారు. వారిద్దరి వల్ల చేవెళ్ల, తాండూరు, వికారాబాద్ ప్రాంతాలకు అన్యాయం జరుగుతున్నదనీ, రంగారెడ్డి జిల్లాకు నీళ్ల కోసం ధర్నాలు, దీక్షలు చేసిన సబితా ఇంద్రారెడ్డి అక్క హరీశ్‌రావు మాట్లాడుతుంటే మౌనంగా కూర్చొని సమర్ధించటం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. ఆ బడిలో చేరగానే సిలబస్ మారిపోతుందనీ, వాళ్ల ఒత్తిడితో కడియం శ్రీహరి తప్పనిసరి పరిస్థితుల్లో మాట్లాడుతున్నారని అన్నారు.