ఆఫీసు నుండి ఇంటికి వచ్చి, భార్య అందించిన చాయి తాగుతూ టీవీ పెట్టాడు పుష్పకుమార్. రిమోట్‌తో ఛానల్స్ మార్చుతూ ఉన్నాడు. ఉన్నట్టుండి ఒక ఛానల్ వద్ద ఆగిపోయాడు. ఆ ఛానల్‌లో పెద్దాయన కన్పించాడు మరి! పెద్దాయన అంటే పుష్పకుమార్‌కి ప్రాణం! పెద్దాయనను చూస్తూ తరించిపోతాడు. మాటలు వింటూ పులకరించిపోతాడు! పెద్దాయన అందరిలాంటి మనిషి కాదని, సాక్షాత్తూ ఆది విష్ణువు పదకొండవ అవతారమని, దుష్టశిక్షణ, శిష్ట రక్షణ చేయటానికి భూమిపై అవతరించాడని పుష్పకుమార్ ప్రగాఢ విశ్వాసం! అందుకే పెద్దాయన టీవీలో కనపడగానే టీవీ రిమోట్ గట్టిగా పట్టుకున్నాడు. ఇంకెవ్వరూ తీసుకోకుండా!
టీవీ చూస్తున్న పుష్పకుమార్ మొహంలో రంగుల మారుతున్నాయి. రకరకాల భావాలు కన్పిస్తున్నాయి! లేచి వెళ్లి టీవీని కౌగిలించుకోయాడు! పుష్పకుమార్ కదలికలు గమనిస్తున్న చింటుగాడు ”అమ్మా” అంటూ గావుకేక పెట్టాడు!
వంట చేస్తున్న లక్ష్మి ఉలిక్కిపడింది! చేతిలోనే కడాయి అలాగే వదిలేసి, హాల్లోకి పరుగెత్తుకుని వచ్చింది! టీవీని పుష్పకుమార్ కౌగిలించుకోబోయే సీన్ చూసింది! పుష్పకుమార్ యుక్తవయస్సులోని అభిమాన హీరోయిన్ తెరమీదికొచ్చిందేమోనని అనుకుంటూ, ఆయన చేయి పట్టుకుని పక్కకు లాగేసింది! కాని తెరమీద పెద్దాయన! చిరాగ్గా భర్త మొహంలోకి చూసింది! పుష్పకుమార్ కండ్లలో నీళ్లు! టీవీలో పెద్దాయన! ఏకకాలంలో కనిపించేసరికి లక్ష్మి గందరగోళపడింది!
”ఏమైందండి!” అడిగింది పుష్పకుమార్‌ని ఆదుర్దాగా!
”పెద్దాయన క్షమాపణలు చెబుతున్నాడు లక్ష్మీ!” అన్నాడు పుష్పకుమార్ డగ్గుత్తికతో!
”అంతేనా!” అన్నది లక్ష్మి తేలికగా!
”అంత తేలికగా మాట్లాడుతావేం! పెద్దాయన క్షమాపణ చెప్పటం అంటే సాధారణ విషయమా!” అన్నాడు పుష్పకుమార్ కండ్లలో నీళ్లు తుడుచుకుంటూ.
”ఇంతకీ క్షమాపణ దేనికి చెప్పాడు!” అడిగింది లక్ష్మి.
”అలా అడుగు చెబుతాను!మహావీరుడైన శివాజీ విగ్రహం నేలకూలింది! మహారాష్ట్రలో జరిగిన ఈ దుర్ఘటనకు పెద్దాయన చలించిపోయారు! అందుకే శివాజీ నేలమీద అడుగుపెట్టగానే శివాజికి పెద్దాయన క్షమాపణ చెప్పారు! అంత పెద్దాయన క్షమాపణ……” అంటూనే పుష్పకుమార్ గొంతు జీరబోయింది!
”అదేమిటండీ! పెద్దాయన క్షమాపణ చెబితే మీరు కండ్ల నీళ్లు పెట్టుకుంటున్నారెందుకు?” అన్నది లక్ష్మి ఆశ్చర్యంగా!
”పెద్దాయన అంటే ఎవరను కున్నావ్? ఈ విశ్వానికే ఆయన పెద్దదిక్కు.. మహానాయకుడు! అంత స్థాయి గల నేత క్షమాపణ చెబుతున్నాడంటే అంది ఎంత లోతైన విషయమో! అర్థం చేసుకో!” అన్నాడు! పుష్పకుమార్!
”మీరు క్షమాపణ చెప్పడం పెద్దాయన గొప్పతనం అంటూ ఏవేవో చెబుతున్నారు! ఇంతకూ క్షమాపణ చెప్పే అర్హత పెద్దాయనకు ఉందా?” అడిగింది లక్ష్మి.
లక్ష్మి మాటలకు పుష్పకుమార్ నివ్వెరపోయాడు!దిగ్భ్రాంతి చెందాడు! కొంతసేపటికి తేరుకున్నాడు!
”ఉన్నమాటే అన్నాను! ఎందుకంటే ఇప్పటికే కొన్ని వందల, వేలసార్లు, ఈ జాతికి, భారతావనికి క్షమాపణ చెప్పాల్సి ఉండగా, ఈ ోజువరకు కూడా క్షమాపణ చెప్పలేదు! అందుకే క్షమాపణ చెప్పే అర్హత ఆయనకుందా? అని మళ్లీ అడుగుతున్నాను!”అన్నది లక్ష్మి.
” ఈ జాతికి క్షమాపణలు చెప్పేంత తప్పు ఏం చేశాడు?” ఆశ్చర్యంగా అడిగాడు పుష్పకుమార్.
”పెద్దనోట్ల రద్దు! దాని ప్రభావం ఈ రోజుకి చిన్నస్థాయి పరిశ్రమలపై పడింది. లక్షలమందికి ఉపాధి పోయింది! మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థ వెనక్కి వెళ్లిపోయింది! పెద్దనోట్ల రద్దు వల్ల యాభై రోజుల్లో ఫలితాలు రాకపోతే నన్ను ఉరితీయండి! అన్నాడు! ఈ రోజుకీ ఫలితాలు రానే లేదు! అందువల్ల కనీసం క్షమాపణలు కూడా చెప్పలేదు! దేశ ఆర్థిక వ్యవస్థ విధ్వంసమైంది! దీనికెవరు బాధ్యత వహిస్తారు?” అడిగింది లక్ష్మి.
”అదొక్కటే గదా?” అన్నాడు పుష్పకుమార్.
”చాలా ఉన్నాయి! కరోనా వచ్చినప్పుడు ఆకస్మికంగా లాక్‌డౌన్ ప్రకటించాడు! పొట్ట చేతపట్టుకుని బతుకుదెరువు కోసం వలసెళ్లినవారు తిరిగొచ్చే అవకాశమే లేకుండా లాక్‌డౌను అమలు చేశారు! స్వగ్రామాలకు నడస్తూ బయలుదేరి మార్గమధ్యంలోనే వందలకొద్దీ పేదలు ప్రాణాలు వదిలారు!
అంతిమ సంస్కారాలు జరగడం హిందువులకు అత్యంత పవిత్రకార్యం!అది నోచుకోకుండానే ఎంతోమంది గంగానదిలో శవాలై తేలారు! కరోనా చావులకి పెద్దాయన ఎనాడైనా క్షమాపణ చెప్పాడా?” ప్రశ్నించింది! లక్ష్మి
”మనదేశంలోనే కరోనా వచ్చిందా? అది ప్రపంచ సమస్య!” అన్నాడు పుష్పకుమార్.
”దేవాలయంలో దేవుడి కండ్లముందే చిన్నపిల్లపై పాశవికంగా లైంగికదాడి చేసి చంపేశారు! మరోచోట లైంగికదాడి చేసిన దళిత యువతిని చంపేసి, తల్లిదండ్రులకు చెప్పకుండా ఆ యువతి శవానికి అంత్యక్రియలు చేసేశారు! మణిపూర్‌లో నగ యువతిని ఊరేగించారు! బెంగాల్‌లో నిద్రిస్తున్న డాక్టర్‌పై లైంగికదాడికి పాల్పడ్డారు! వీటిల్లో దేనికి పెద్దాయన క్షమాపణ చెప్పలేదేం?” నిలదీసింది లక్ష్మి.
”అందుకే బేటీ బచావో అని పెద్దాయన నినాదం ఇచ్చారు!” అన్నాడు పుష్పకుమార్.
” ఆ నినాదం ఇచ్చిన తర్వాతే లైంగికదాడులు పెరిగాయని మీరు తెలుసుకోండి! దేశంలో రైళ్లు వరసగా సొప్పకట్టెలతో చేసిన బండ్లలా విరిగిపోతున్నాయి! పదుల సంఖ్యలో ప్రాణాలు పోతున్నాయి! రైళ్లలో ప్రయాణించాలంటేనే జనం గుండెల్లో భయం కలుగుతున్నది! ఏనాడైనా వరసగా జరుగుతున్న రైలు ప్రమాదాలకు క్షమాపణ చెప్పారా? కనీసం విచారమైనా వ్యక్తం చేశారా?” నిలదీసింది లక్ష్మి
”రైళ్లలో భద్రతా ఏర్పాటు పెంచుతారు!” అన్నాడు పుష్పకుమార్.
”వర్షాలు పడుతుంటే అనేక బ్రిడ్జిలు లీకు అవుతున్నాయి! దాదాపు పది వంతెనలు కూలిపోయాయి! ఏ వంతెన ఎప్పుడు కూలిపోతుందో, ఏ దుర్వార్త వింటామో అని భయంగా గడుపుతున్నారు! ప్రజలు! బ్రిడ్జిలు కూలిపోతుంటే ఏనాడైనా క్షమాపణ చెప్పారా?” అడిగింది లక్ష్మి.
”పెద్దాయన మేస్త్రీ కాదు! బ్రిడ్జిలు కూలిపోతే క్షమాపణ చెప్పటానికి!” అన్నాడు పుష్పకుమార్ ఉక్రోశంగా.
”మరి శివాజీ విగ్రహాన్ని పెద్దాయన నిర్మించారా? క్షమాపణ ఎందుకు చెప్పినట్టు?” సూటిగా ప్రశ్నించింది లక్ష్మి.
పుష్పకుమార్‌కి సమాధానం దొరకలేదు!
”మీరు సమాధానం చెప్పలేరని నాకు తెలుసు!దేశంలో అనేక వ్యవస్థలు దెబ్బతింటున్నాయి. ప్రజలు పేదరికంలోకి పడిపోతున్నారు! మహిళలకు భద్రత లేదు! డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్న గుజరాత్‌లో వరదలు వస్తే ఇండ్లల్లోకి మొసళ్లు వచ్చాయి! ఇలాంటి వాటికి చలించరు! దేశంలో ఎంతటి అమానవీయ సంఘటనలు జరిగినా నోరెత్తి మాట్లాడరు! కాని ఈ రోజు శివాజీ విగ్రహం కూలిపోయిందని, బాధపడి ప్రజలకు క్షమాపణ చెబుతున్నారు! ఎందుకు చెబుతున్నారో మీకు తెలుసా?” ప్రశ్నించింది లక్ష్మి.
అయోమయంగా చూశాడు పుష్పకుమార్!
”రాబోయే కాలంలో మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి! మహారాష్ట్ర ప్రజలకు శివాజీ అంటే ఎంతో ప్రేమ!గౌరవం! ఎందుకంటే ఈ దేశపు మూలవాసులలోని శూద్రకులంలో పుట్టి మహావీరుడై, ఎందరినో ఎదిరించి సామ్రాజ్యాన్ని స్థాపించిన మహనీయుడు శివాజీ! అందుకే ఎన్నికలమీద ప్రేమతో శివాజీ విగ్రహం పడిపోయిందని క్షమాపణ చెప్పారు! ఆ క్షమాపణలు హృదయంలో నుండి రాలేదు! పెదవుల నుండి వచ్చాయి! ఓట్లకోసం మాత్మే వచ్చాయి!” అని ముగించింది లక్ష్మి.
– ఉషాకిరణ్