అప్పనంగా అప్పలోనుకుంటను తవ్వెస్తున్నారు

– బోల్లికుంట కమ్యూనిటీ హాలుకని అక్రమ మట్టి దందా
– కాంట్రాక్టర్ అవతారం ఎత్తి మొరం దండుకుంట్టున్న అధికార పార్టీ గ్రామ నాయకుడు
– పట్టించుకోని రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు
నవతెలంగాణ- మట్టేవాడ
నగరానికి కూత వేటు దూరంలో ఉన్న బొల్లికుంట గ్రామ శివారులోని అప్పలోని కుంట చెరువుకు గ్రామానికి చెందిన అధికార పార్టీ నాయకులతో ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. బొల్లి కుంట గ్రామంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణా పనులకు కాంట్రాక్టర్ గా అవతారం ఎత్తిన మాజీ కార్పొరేటర్ భర్త కమ్యూనిటీ హాల్ నిర్మాణనికి బయట నుండి మట్టిని కొనుగోలు చేసి కమ్యూనిటీ హాల్లో పోయాల్సి ఉండగా అధికారులు నన్నేం చేస్తారనే ధీమాతో అప్పాలోని కుంట చెరువును మట్టి తవ్వకాలకు అడ్డాగా చేసుకొన్నడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇష్టం వచ్చినట్లు జెసిబి తో తవ్వుతూ ట్రాక్టర్లలో మొరాన్ని యదేచ్చగా తరలిస్తూ గ్రామంలోకి, బయటకు మట్టిని తరలిస్తూ వేల రూపాయలు జేబులు నింపుకుంటున్న వైనంపై గ్రామస్తులు మండిపడుతున్నారు. ఉదయం నుండి సాయంత్రం వరకు యదేచ్చగా చెరువులో మట్టిని తోడుతూ ఊర్లో నుండి ట్రాక్టర్లలో మట్టి వెళుతున్న గ్రామంలో ఉంటున్న వీఆర్ఏలకు, సంబంధిత ఇరిగేషన్ అధికారులకు తెలియక ఉంటుందా అని గ్రామస్తులు ఆశ్చర్యం వ్యక్తపరుస్తున్నారు. ఇప్పటికే చెరువుకు సంబంధించిన శిఖం భూమిని కొందరు కబ్జా చేసి అక్రమ మార్గాన పట్టాలు చేసుకున్నారని ఇప్పుడేమో నిర్మాణాల పేరుతో చెరువును ఇష్టం వచ్చినట్లు లోతుగా గుంతలు తవ్వుతూన్నరని తమ గోడును వెళ్ళబోసుకుంటున్నారు. ఎవరి ఇస్టన వారు చేరువులో తవ్వుకుంటూ పోతు పెద్ద పెద్ద గుంతలు చేస్తు చెరువులోకి వచ్చిన నీరు గుంతల్లో నిల్వ ఉండెల చేస్తూన్నరని తమ పొలాల్లోకి నీరు రాకుండా పంట పొలాలు ఎండిపోయేలా చేస్తున్నారని గ్రామస్తులు వాపోతున్నారు. గతంలో ఇలానే గుంతలు తవ్వడం వల్ల ఆ గుంతల్లో పడిపోయి పశువులు చనిపోయిన సందర్భాలు ఉన్నాయని మనుషులు పడి చనిపోయే ప్రమాదం పొంచి ఉన్నదని ఇకనైనా ప్రభుత్వ అధికారులు స్పందించి చెరువును కాపాడాలని, చెరువులో మట్టిని అక్రమంగా తవ్విన వారిపై చర్యలు కఠినంగా తీసుకోవాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు. దీనిపై సంబంధిత ప్రభుత్వ అధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది.