బుజ్జగింపుల మంత్రాంగం

– మాజీ మంత్రి రాజయ్యకు రైతు సమన్వయ సమితి చైర్మెన్‌ పదవి
– స్టేషన్‌ఘన్‌పూర్‌ కడియంకే…
– మద్దతిస్తానన్న రాజయ్య
– రాజీయత్నాల్లో ప్రగతిభవన్‌ బిజీ బిజీ
– నేతలతో సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ చర్చలు
– ముత్తిరెడ్డికి ఆర్టీసీ చైర్మెన్‌ పదవి
– జనగాం టిక్కెట్‌ పల్లా రాజేశ్వరరెడ్డికే…
– కారెక్కనున్న ఏపూరి సోమన్న
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్దీ అధికార బీఆర్‌ఎస్‌లో మంత్రాంగాలు, బుజ్జగింపుల పర్వాలు జోరందుకుంటున్నాయి. నేతల అలకలు, అసంతృప్తులు, అసమ్మతులను చల్లార్చేందుకు సీఎం కే చంద్రశేఖరరావు, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కే తారకరామారావు తీవ్రంగా శ్రమిస్తున్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో ఇవే సీన్లు కొనసాగాయి. నేతల్ని ఇక్కడికే పిలిపించుకొని బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు. దానిలో భాగంగా మాజీ మంత్రి, స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు రైతు సమన్వయ సమితి చైర్మెన్‌ పదవి ఇస్తామని ఒప్పించినట్టు సమాచారం. ఇప్పటి వరకు ఈ పదవిలో పల్లా రాజేశ్వరరెడ్డి ఉన్నారు. మంత్రి కేటీఆర్‌, పల్లా కలిసి రాజయ్యతో మాట్లాడి ఒప్పించినట్టు తెలిసింది. దానితో పాటు వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో వరంగల్‌ ఎంపీ సీటు ఇస్తామనే హామీ కూడా ఇచ్చినట్టు తెలిసింది. దీంతో ఇప్పటి వరకు మాజీ మంత్రి కడియం శ్రీహరిపై కారాలు మిరియాలు నూరిన రాజయ్య శాంతించారు. వచ్చే ఎన్నికల్లో స్టేషన్‌ ఘన్‌పూర్‌ నుంచి బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీచేస్తున్న కడియం శ్రీహరికి మద్దతు ఇస్తాననీ, ఆయన గెలుపు కోసం కృషి చేస్తానని ప్రకటించారు. ఇక జనగామ సిట్టింగ్‌ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిని కూడా ప్రగతిభవన్‌కు పిలిచి, సీఎం కేసీఆర్‌ నేరుగా మాట్లాడారు. ఆయనకు టీఎస్‌ఆర్టీసీ చైర్మెన్‌ పదవి ఇస్తామని హామీ ఇచ్చినట్టు తెలిసింది. దీంతో ఇప్పటి వరకు ఈ సీటు ఆశిస్తున్న పల్లా రాజేశ్వరరెడ్డిపై అనేక విమర్శలు, ఆరోపణలు చేసిన ముత్తిరెడ్డి ఎట్టకేలకు శాంతించారు. పల్లా గెలుపు కోసం కృషి చేస్తానని సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌కు హామీ ఇచ్చారు. దీంతో పల్లాకు జనగామ టిక్కెట్‌ ఖరారైంది. తెలంగాణ ఉద్యమకారుడు, గాయకుడు ఏపూరి సోమన్న కూడా మంత్రి కేటీఆర్‌ను కలిశారు. ఆప్యాయంగా పలకరించుకున్నారు. తాను త్వరలో బీఆర్‌ఎస్‌లో చేరతానని ఈ సందర్భంగా సోమన్న ప్రకటన చేశారు. ఇక మల్కాజ్‌గిరి బీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు తాను ఆపార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఆయన త్వరలో కాంగ్రెస్‌లో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సీఎం కేసీఆర్‌ వచ్చే ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల జాబితా ప్రకటించడానికంటే ముందే మైనంపల్లి మంత్రి హరీశ్‌రావుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన విషయం తెలిసిందే. తనకు మల్కాజ్‌గిరి, తన కొడుక్కి మెదక్‌ టిక్కెట్‌ ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. కానీ సీఎం కేసీఆర్‌ ఆయనకు మల్కాజ్‌గిరి టిక్కెట్‌ మాత్రమే ఇచ్చారు. ఇప్పుడు తనకు ఆ టిక్కెట్‌ కూడా ఏమీ వద్దంటూ బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించడం గమనార్హం. బీఆర్‌ఎస్‌ అసమ్మతి నేతల బుజ్జగింపుల కార్యక్రమంలో ఎమ్మెల్యే బాల్క సుమన్‌, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్‌, సీనియర్‌ నాయకులు దాసోజు శ్రావణ్‌ తదితరులు మంత్రి కేటీఆర్‌కు సహాయకారులుగా వ్యవహరించారు.