కేంద్రానికి గత నెల ఏప్రిల్‌లో జీఎస్టీ 2 లక్షల 10వేల కోట్ల రూపాయలు రికార్డు స్థాయిలో వచ్చినట్టు సమాచారం. దీనిలో ప్రజల ఆర్థిక, ఆరోగ్య పరిస్థితులు ఛిద్రం చేస్తున్న మద్యపానంపై వచ్చిన సొమ్ములెంత…!?ఏయే ఇటువంటి సందర్భంలో కొన్ని విషయాలు పరిశీలన చేయుట సబుబుగా ఉంటుంది కదా. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి, అనేక పార్టీలు సుమారు 78 సంవత్సరాల పాటు పాలించినా దేశంలో అందరికీ మంచినీరు అందించటంలో విఫలం చెందాయి. కానీ దేశంలో అన్ని ప్రాంతాలకు మాత్రం మద్యపానం అందించటంలో సఫలం అయ్యాయి. దీనికి తోడు ధూమపానం, వివిధ రూపాల్లో మత్తు పదార్థాలు, పానీయాలు కూడా అన్ని చోట్లా లభ్యం అవుతున్నాయి. మరి సర్కారు వారు చేసిన చట్టాలు ఎంత బలహీనంగా అములు అవుతున్నాయో… అందరికీ తెలిసిందే. దీనికి ప్రధాన కారణం అమలులో చిత్తశుద్ధి లేదు. ఎక్కువ మంది ప్రజాప్రతినిధులు వ్యాపారవేత్తలే అని గణాంకాలు చెబుతున్నాయి.
దేశంలో ఉన్న దాదాపు అన్ని రాష్ట్రాలకు ప్రధాన ఆదాయ వనరు మద్యపానంపై వచ్చే రాబడే. ప్రభుత్వాలే అధికారంగా మద్యపాన వ్యాపారం ప్రోత్సాహం ఇస్తున్నాయి అని చెప్పవచ్చు..పేద ,బడుగు బలహీన వర్గాల ప్రజలు, యువత బతుకులు దుర్భరంగా మారడానికి కారణం మద్యపానమే… దీనికి ప్రధాన కారణం దాదాపు ప్రతీ గ్రామంలో బెల్ట్ షాపులు ద్వారా అక్రమ మద్యపాన వ్యాపారం జరుగుతోంది. దీనికి రాజకీయ నాయకుల అండదండలు పుష్కలంగా ఉన్నాయి. ఇక పట్టణ, నగర ప్రాంతాలలో కొన్ని మేజర్ గ్రామాల్లో ప్రభుత్వాలే మద్యపాన వ్యాపారం, లైసెన్స్, టెండర్లు పిలిచి మరీ ప్రోత్సాహిస్తూ ఆదాయాన్ని సమూపార్జన చేస్తున్నాయి. కొత్త, కొత్త బ్రాండ్‌లతో స్వతహాగా తయారు చేసి మరీ అమ్మటం మరో గమ్మత్తైన విషయం… పైకి మాత్రం మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని తెలుపుతూ, అదే సమయంలో అందరికీ అందుబాటులోకి తేవడం వెనుక మర్మం ఇకనైనా అందరూ గ్రహించాలి..
అదే ప్రతీ గ్రామంలో మంచినీటి సౌకర్యం కల్పించాలంటే ప్రభుత్వాలు కప్పదాటు ధోరణి అవలంబించుట జరుగుతున్నది. నదులకు ఆనకట్టలు కట్టాలన్నా, ఇసుక మేటలు తొలగించాలన్నా, చెరువులు పూడికలు తీయించాలన్నా ఏదో సాకు చెప్పుతూ ప్రజలకు, పశువులకు, వ్యవసాయానికి నీళ్లు అందించకుండా కాలం గడుపుతున్నారు. అదే మద్యం సరఫరాకు ఆటంకం లేకుండా చేయుట గమనార్హం. ఇక ప్రస్తుతం ఎండాకాలంలో మంచినీళ్లు దొరక్కపోవచ్చు. కానీ మద్యం మాత్రం ఎల్లవేళలా అందుబాటులో ఉంటుంది. ప్రభుత్వాలకు ఎన్ని వేల కోట్ల రూపాయలు ఆదాయం వస్తుందో ఇక ఈ ఎండాకాలం, ఎన్నికల సీజన్ ప్రభుత్వాలకు ఎంత ఆదాయమో, ఎంత ఆనందమో మాటల్లో చెప్పలేం.ఇది అంతా సామాన్య ప్రజల నుంచి దోపిడీ చేయడమే కదా…!? అనేక కుటుంబాలు ఛిద్రం కావడానికి ప్రభుత్వాలే కారణం కదా!
ముఖ్యంగా ఏ ప్రజలకైతే ఉచితాలు పేరుతో, సంక్షేమ పథకాలు పేరుతో వివిధ పథకాలు అందిస్తున్నారో, అదే ప్రజల కష్టార్జితాన్ని ఈ ప్రభుత్వాలు మద్యపానం ధూమపానం రూపంలో తిరిగి దోచుకోవడం ఏ రకమైన సంక్షేమ రాజ్యమో ఈ పాలకులే తెలపాలి. అదే సమ యంలో ప్రజలు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రభుత్వాలు తమ బలహీనతను ఆసరాగా తీసుకుని కష్టార్జితాన్ని దోచుకుంటున్నారు అని గ్రహించాలి. వాస్తవాలు తెలుసుకోవాలి… కనీసం ఈ ఎన్నికలు సమయంలోనైనా వాస్తవాలు గ్రహించి, తమ భవిష్యత్తును ఓటును సద్వినియోగం చేసుకోవడం ద్వారా సరిదిద్దుకోవడానికి ప్రయత్నాలు చేయాలి.. తాము ఆర్థికంగా, ఆరోగ్యపరంగా చితికిపోవడానికి ప్రధాన కారణం ప్రభుత్వాలు ప్రోత్సాహంతో అందరికీ అందుబాటులోకి తెస్తున్న మద్యపానమే అని గ్రహించాలి.
ప్రభుత్వాలు ప్రజలకు అవసరమైన కూడు, గూడు, గుడ్డ, మంచినీరు, విద్య వైద్యం, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి తప్పా, అందరికీ అందుబాటులో మద్యపానం, ధూమపానం మత్తు పదార్థాల కాదని ప్రస్తుత ప్రభుత్వాలకు తమ ఓటు ద్వారా ప్రజలు తెలియపరచాలి. ఏ రాజకీయ పార్టీలు, నాయకులు ప్రజల కష్టసుఖాల్లో, మంచిచెడ్డల్లో తమ వెంట ఉంటున్నారో అటువంటి ప్రజాసంఘాల నాయకులకు అండగా నిలవాలి. ఓటును సద్వినియోగం చేసుకోవాలి. ప్రజా వ్యతిరేక విధానాలకు పోరాటం చేస్తున్న ప్రజా పార్టీలకు అధికారం అందించాలి. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడే వారికి, ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా పోరాడే ప్రజాస్వామ్య సోషలిస్టు పార్టీలకు నాయకులకు వత్తాసు పలకాలి. కనీసం ప్రజలకు మంచినీరు అందించే వారికి, ఉపాధి అవకాశాలు కల్పించే వారికి అండదండలు అందించుట సమంజసమని అందరూ ఆలోచన చేయాలి. ముఖ్యంగా చదువుకున్నవారు ఆలోచన చేయాలి. పదిమందికి అవగాహన కల్పించాలి. ఎన్నికల వేళ మంచి ప్రజాతీర్పు ఓటు ద్వారా అందించాలి. అప్పుడు మాత్రమే పేద, మధ్య తరగతి ప్రజల భవిష్యత్తు కొంతైనా మెరుగుపడే అవకాశముంది.
రావుశ్రీ