ఏప్రిల్‌ 22 లోపు ఇంటి నుంచి ఓటింగ్‌కు దరఖాస్తులు

ఏప్రిల్‌ 22 లోపు ఇంటి నుంచి ఓటింగ్‌కు దరఖాస్తులు– వికలాంగులు, 85 ఏండ్లు పైబడిన వృద్ధుల కోసం…
– తనిఖీల్లో రూ.50వేలు కంటే ఎక్కువ పట్టుబడితే స్వాధీనం
– భద్రత కట్టుదిట్టం : కంటోన్మెంట్‌, లోక్‌సభ ఎన్నికల ఏర్పాట్లపై సీఈఓ వికాస్‌రాజ్‌
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికతో పాటు రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలను శాంతియుతంగా, సమర్ధవంతంగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) వికాస్‌రాజ్‌ తెలిపారు. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదలైన విషయాన్ని ప్రస్తావిస్తూ సోమవారంనాడాయ మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ఏర్పాట్లను వివరించారు. వికలాంగులు, 85 ఏండ్లు పైబడిన వృద్ధులు ఇంటి నుంచే ఓటింగ్‌లో పాల్గొనేందుకు ఏప్రిల్‌ 22వ తేదీలోపు దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. అర్హులైన వారికి ఫారం-డీ పంపిణీ చేస్తారని తెలిపారు. రిటర్నింగ్‌ ఆఫీసర్ల (ఆర్‌ఓ) వద్ద పోస్టల్‌ బ్యాలెట్‌ ప్రింటింగ్‌ ఉంటుందని వివరించారు. గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో 2.09 లక్షల మంది పోస్టల్‌, హౌమ్‌ ఓటింగ్‌ను వినియోగించుకున్నారని తెలిపారు. అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణ తర్వాత 3, 4 రోజుల్లో హౌమ్‌ ఓటింగ్‌ ఉంటుందని వివరించారు. గడచిన రెండున్నరేండ్లలో 30 లక్షల డూప్లికేట్‌ ఓట్లను తొలగించామనీ, గత ఏడాది 8 లక్షల డూప్లికేట్‌ ఓట్లు రద్దు చేశామని తెలిపారు. పలువురు ఓటర్లు ఇండ్లు మారినప్పుడు పాత ఓట్లను తొలగించుకోకుండా, కొత్త ఓట్లకు దరఖాస్తులు చేసుకున్నారనీ, వాటిని డూప్లికేట్లుగా గుర్తించి రద్దు చేశామన్నారు. రాష్ట్రంలో మొత్తం ఓటర్లు 3.30 కోట్ల మంది కాగా, వారిలో 85 ఏండ్లు దాటిన వారు 1.94 లక్షల మంది ఉన్నారని తెలిపారు. రాష్ట్ర సరిహద్దుల వద్ద 24 గంటలు పనిచేసేలా ఇంటిగ్రేటెడ్‌ చెక్‌ పోస్టులు ఏర్పాటు చేశామనీ, సరైన పత్రాలు లేకుండా రూ.50 వేలకు మించి నగదు తీసుకెళ్తే స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనలపై సీ-విజిల్‌ యాప్‌ లేదా 1950 కాల్‌ సెంటర్‌కు ఫిర్యాదు చేయాలనీ, ఎన్నికల ప్రచారంలో పాఠశాల విద్యార్థులను భాగస్వామ్యం చేయకూడదనీ, రోడ్‌షోలకు ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని స్పష్టంచేశారు. రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు లౌడ్‌ స్పీకర్లు వాడకూడదనీ, అలా జరిగితే కేసులు నమోదు చేస్తామని చెప్పారు. ఎన్నికల నిర్వహణ కోసం రిటర్నింగ్‌ ఆఫీసర్లు (ఆర్‌ఓ), డిప్యూటీ ఎన్నికల అధికారులు (డీఈఓ), పోలీసు అధికారులకు ఇప్పటికే ఢిల్లీలో శిక్షణ ఇచ్చామనీ, రెండో విడతలో మరికొందరిని శిక్షణ కోసం పంపుతామని తెలిపారు. ఎన్నికల సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణ కోసం 1,85,612 మంది పోలీసు సిబ్బంది పనిచేస్తారనీ, రాష్ట్రవ్యాప్తంగా 35,365 పోలింగ్‌ కేంద్రాలు, 54,353 వీవీప్యాట్‌లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ఉప ఎన్నిక కోసం 500 బ్యాలెట్‌ యూనిట్లు, 500 వీవీ ప్యాట్లు ఉపయోగిస్తామన్నారు. సమావేశంలో అడిషనల్‌ చీఫ్‌ ఎలక్ట్రోరల్‌ ఆఫీసర్‌ డీఎస్‌ లోకేష్‌కుమార్‌, జాయింట్‌ చీఫ్‌ ఎలక్ట్రోరల్‌ ఆఫీసర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌, డిప్యూటీ చీఫ్‌ ఎలక్ట్రోరల్‌ ఆఫీసర్‌ ఎమ్‌ సత్యవాణి తదితరులు పాల్గొన్నారు.