ఆదిత్యానాథ్‌ దాస్‌ నియామకం

– రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలిపెట్టు
– మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ఆధిత్యనాధ్‌దాస్‌ను రాష్ట్ర నీటి పారుదల శాఖ సలహాదారు పదవి నుంచి తొలగించాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఇలాంటి విషయాల్లో చంద్రబాబు ఆదేశిస్తున్నాడు .. శిష్యుడు రేవంత్‌ పాటిస్తున్నాడని విమర్శించారు. ప్రమాణ స్వీకారానికి ముందే తెలంగాణపై చంద్రబాబు కర్రపెత్తనం మొదలైందనడానికి ఈ నియామకమే నిదర్శనమని పేర్కొన్నారు.
నాటి జలయజ్ఞం ప్రాజెక్టుల నుంచి నేటి పాలమూరు రంగారెడ్డిపై కేసులు వేసి పనులు ఆపిన వ్యవహారంలో ఆదిత్యాదాస్‌ది కీలకపాత్ర అని తెలిపారు. ఏపీ నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శిగా, ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా, ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన వ్యక్తికి తెలంగాణ నీటి పారుదల శాఖ సలహాదారు పదవిని ఎందుకు కట్టబెట్టారో ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ ప్రాజెక్టుల వ్యతిరేకిగా ముద్రపడ్డ వ్యక్తిని ఏ ప్రయోజనాల కోసం ఈ పదవిలో కూర్చోబెట్టారో చెప్పాలని ప్రశ్నించారు.
ఆంధ్రాకు కృష్ణా ప్రాజెక్టుల నుంచి నీటిని తరలించటంలో ఆయనది కీలకపాత్రని తెలిపారు. కేఆర్‌ఎంబీలో తెలంగాణ వాదనను తొక్కిపట్టి ప్రాజెక్టుల మీద హక్కులు కోల్పోయేలా చేసిన వ్యక్తిని నియమించడం వెనక కాంగ్రెస్‌ ఆలోచనేంటని ప్రశ్నించారు.