9న డీఎస్సీ అభ్యర్థులకు నియామకపత్రాలు

– ఎల్బీస్టేడియంలో ఇచ్చేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు
–  జిల్లాల్లో ముగిసిన ధ్రువపత్రాల పరిశీలన
– 95 శాతం మంది హాజరు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి జిల్లా నియామక కమిటీ (డీఎస్సీ)కి తాత్కాలికంగా ఎంపికైన అభ్యర్థులకు జిల్లాల్లో ధ్రువపత్రాల పరిశీలన శనివారంతో ముగిసింది. 1:3 నిష్పత్తి చొప్పున జిల్లాల వారీగా కేటగిరీల వారీగా మెరిట్‌ జాబితాను విద్యాశాఖ విడుదల చేసిన విషయం తెలిసిందే. మంగళవారం నుంచి అన్ని జిల్లాల్లో ధ్రువపత్రాల పరిశీలన ప్రారంభమైంది. జిల్లా స్థాయిలో అభ్యర్థులకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. అన్ని జిల్లాల్లో సుమారు 93 నుంచి 95 శాతం వరకు అభ్యర్థులు హాజరైనట్టు విద్యాశాఖ అధికారులు చెప్తున్నారు.
ఈనెల తొమ్మిదిన డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతులమీదుగా నియామక పత్రాలను అందజేస్తారు. ఇందుకు సంబంధించి విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలో 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను ఫిబ్రవరి 29న రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. జులై 18 నుంచి ఆగస్టు ఐదో తేదీ వరకు ఆన్‌లైన్‌ ద్వారా కంప్యూటర్‌ ఆధారిత విధానం (సీబీఆర్టీ)లో డీఎస్సీ రాతపరీక్షలను నిర్వహించింది. గతనెల 30న డీఎస్సీ ఫలితాలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విడుదల చేశారు.
రాష్ట్రంలోని 33 జిల్లాల్లో మొత్తం 25,924 మంది అభ్యర్థులను దరఖాస్తుల పరిశీలనకు ఆహ్వానించగా, వారిలో 24,466 మంది సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరయ్యారు. 1,458 మంది గైర్హాజరు అయ్యారు. అత్యధికంగా నల్గొండ జిల్లాలో 1,530 మందిని ఆహ్వానిస్తే, వారిలో 1,525 మంది వెరిఫికేషన్‌కు హాజరయ్యారు. అత్యధిక గైర్హాజరు హైదరాబాద్‌ జిల్లాలో జరిగింది. ఇక్కడ 1,537 మందిని వెరిఫికేషన్‌ కోసం ఆహ్వానించగా, వారిలో 1,355 మంది మాత్రమే హాజరయ్యారు. 182 మంది గైర్హాజరు అయ్యారు.