రెండ్రోజుల్లో ఆర్టీసీ బిల్లుకు ఆమోదం

In two days Approval of RTC bill– జేఏసీ నేతలతో గవర్నర్‌
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
టీఎస్‌ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లుకు రెండ్రోజుల్లో ఆమోదం తెలుపుతానని గవర్నర్‌ తమిళసై సౌందరరాజన్‌ చెప్పారు. ప్రభుత్వం నుంచి ఈ బిల్లు రాజ్‌భవన్‌కు మూడు రోజుల క్రితం వచ్చిందనీ, తాను రాష్ట్రానికి ఈ రోజే వచ్చినందున పరిశీలన చేసి, ఆమోదిస్తానని తెలిపారు. మంగళవారం రాజ్‌భవన్‌లో టీఎస్‌ఆర్టీసీ జేఏసీ నేతలు గవర్నర్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్‌ తాను ఆర్టీసీ కార్మికుల పక్షానే ఉంటానని చెప్పారనీ, వారికి అన్యాయం జరగొద్దనే ఉద్దేశ్యంతోనే న్యాయసలహా కోసం బిల్లును పంపినట్టు చెప్పారని జేఏసీ చైర్మెన్‌ అశ్వత్థామరెడ్డి తెలిపారు. గతంలో ఆర్టీసీ విలీన బిల్లును గవర్నర్‌ ఆమోదించలేదని ప్రచారం చేసిన ప్రభుత్వం, ఇప్పుడు 25 రోజులకు పైగా తనవద్దే ఎందుకు పెండింగ్‌లో పెట్టుకుందని ఆయన ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశాక, కార్మికులకు అనేక సమస్యలు ఉత్పన్నమయ్యాయనీ, వాటన్నింటినీ క్రోడీకరించి 33 సూచనలతో ప్రభుత్వానికి వినతిపత్రం ఇచ్చామన్నారు. వాటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని, పరిష్కారాలు సూచిస్తూ బిల్లులో పొందుపర్చాలని కోరారు. గతంలో రాజ్‌భవన్‌ ముట్టడికి పిలుపు ఇచ్చిన నేతలు ఇప్పుడు ప్రగతిభవన్‌ ముట్టడికి ఎందుకు పిలుపు ఇవ్వట్లేదని ప్రశ్నించారు. ఆర్టీసీలోని ఇతర కార్మిక సంఘాలు కూడా జేఏసీలోకి రావాలనీ, విలీనం తర్వాత ఉత్పన్నమయ్యే పరిస్థితులపై ఐక్యంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. గవర్నర్‌ను కలిసిన వారిలో జేఏసీ కన్వీనర్‌ కే హన్మంతు, కో కన్వీనర్లు ఎమ్‌ నరేందర్‌, పీ హరికిషన్‌, అబ్రహం, సురేష్‌, శర్మ, శంకర్‌ ఉన్నారు.