మహిళా రిజర్వేషన్‌ నిరవధిక జాప్యంతో ఆమోదం!

ఇరవైఏడు సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం ఎట్టకేలకు ఎంతగానో అందరూ ఎదురు చూస్తున్న మహిళా రిజర్వేషన్‌ బిల్లు ఆమోదం పొందింది. కానీ, ఇది ఆనందించే అంశంగా లేదు. ఇన్నేళ్ళూ, వరుసగా వచ్చిన ప్రభుత్వాలన్నీ కూడా ఈ బిల్లును చంపేయడానికే చూశాయి, ఉదాసీనతతో మూటగట్టి మూలన పెట్టడానికే ప్రయత్నించాయి. కానీ, వామపక్షాలు, ఐద్వాతో సహా కొన్ని మహిళా ఉద్యమ విభాగాలు మాత్రమే నిరంతరంగా పోరాడుతూ, ఈ బిల్లును సజీవంగా వుంచేందుకు పోరాటం, ప్రచారం చేస్తూ వచ్చాయి. తాజా అధ్యాయంలో విషాద కరమైన అంశమేమంటే, బిల్లు ఆమోద ముద్ర పొందినా, దీని అమలు మాత్రం 2029 సార్వత్రిక ఎన్నికల వరకు, అది కూడా తీవ్రమైన స్థాయిలో ప్రశ్నించదగ్గ కారణాలతో వాయిదా వేశారు. తదుపరి జన గణన ప్రక్రియ పూర్తయిన పిదప 2026లో సీట్ల పునర్విభజన ప్రారంభమైన తర్వాత మాత్రమే చట్టసభల్లో మహిళలకు సీట్ల రిజర్వేషన్‌ జరుగుతుందని ముసాయిదా బిల్లు పేర్కొంటోంది. మహిళా రిజర్వేషన్‌ వాస్తవ రూపం దాల్చడానికి జనాభా లెక్కల నిర్వహణ లేదా పునర్విభజన ప్రక్రియ ఏదీ అవసరం లేదు. బిల్లును ఆమోదించిన తక్షణమే రిజర్వేషన్‌ను అమలు చేయవచ్చు, జనగణన, పునర్విభజన ప్రక్రియలు నిర్వహించినపుడు సీట్ల సంఖ్య ఆ దామాషా ప్రకారం పెరుగుతాయి. కానీ, ప్రజా ప్రతినిధులుగా ఎన్నుకునేందుకు మహిళలకు గల హక్కును మరికొన్ని సంవత్స రాల పాటు నిరాకరించడానికి వీటిని ముందుకు తీసుకువచ్చారు.
మహిళా రిజర్వేషన్‌ బిల్లును బీజేపీ క్రమం తప్పకుండా తన ఎన్నికల ప్రణాళికల్లో చేరుస్తూ వచ్చింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లోగా అమలు చేస్తామంటూ 2014 లోనే ఈ దేశ మహిళలకు హామీ ఇచ్చింది. ఆ రెండు ఎన్నికల తర్వాత లోక్‌సభలో బీజేపీకి మెజారిటీ వచ్చింది. దాంతో ఈ బిల్లును తొక్కిపారేసింది. అధికారంలో వున్న తొమ్మిదేండ్ల లో బిల్లును ఆమోదిస్తామన్న హామీని మాత్రం నెరవేర్చలేదు. ఇప్పుడు, రెండో పదవీ కాలం చివరిలో బిల్లును ప్రవేశ పెట్టింది. దీంతో తమ పని సులువైపోతుందని, పితస్వామ్యపు తుట్టెను కదపకుండానే, తమకు రావాల్సిన ఓట్లు వచ్చే స్తాయని బీజేపీ, ప్రధాని గట్టి నమ్మకంతో వున్నట్లు కనిపిస్తోంది.కానీ కచ్చితంగా ఇదేదీ జరిగేది కాదు. దేశవ్యాప్తంగా మహిళలందరూ సంతోషంతో పొంగిపోయేందుకు ఇందులో ఏమీ లేదని, నిజానికి మోసపోయామని భావిస్తున్నారు. పార్లమెంట్‌లో కానీ, రాష్ట్రాల అసెంబ్లీల్లో గానీ తమ సంఖ్య పెరగకుండానే మరో సార్వత్రిక ఎన్నిక, అనేక రాష్ట్రాల ఎన్నికలు జరుగుతాయనే క్రూరమైన వాస్తవం వారి కళ్ళ ముందుంచబడింది.
మనకు స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్ళలో, ప్రజాస్వామ్యానికి మూలాధారం అంటూ బీజేపీ చెబుతున్న దానిలో లోక్‌సభలో మహిళల సీట్ల శాతం 5 శాతం నుండి ఈనాటి 15 శాతానికి మాత్రమే పెరిగింది. ఇది సిగ్గుపడాల్సిన వాస్తవంగా వుంది. ప్రపంచంలోని అనేక ఇతర దేశాలు మెరుగైన రికార్డును కలిగి వున్నాయి. పార్లమెంట్లకు ఎన్నికైన మహిళల సీట్ల సంఖ్య పరంగా చూస్తే భారత్‌ ఇరవయ్యవ స్థానంలో వుంది. 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఇది మారవచ్చు, కానీ మారదు. మన దేశంలో మహిళలు పెద్ద సంఖ్యలో ఓటు వేస్తున్నారు, పైగా ప్రతి ఎన్నికతో ఈ సంఖ్య పెరుగుతూ వస్తోంది. పైగా గాయాన్ని మరింత రేపేలా, ‘బిల్లు లక్ష్యాలు-కారణాలు’ను ప్రభుత్వం పేర్కొంది. ”మహిళా సాధికారత, మహిళల నేతత్వంలో అభివద్ధి ద్వారా, మహిళల ఆర్థిక స్వాతంత్య్రం గణనీయంగా మెరుగు పరచబడింది. విద్య, ఆరోగ్యానికి సమాన అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. తద్వారా ‘నారీ శక్తి’కి పెద్ద పీట వేసేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. ఉజ్వల యోజన, స్వచ్ఛ భారత్‌ మిషన్‌ కింద టాయిలెట్లకు అవ కాశం, ముద్ర యోజన ద్వారా ఆర్థిక క్రమంలోకి తీసుకురావడం వంటి వివిధ చొరవల ద్వారా ముఖ్యంగా మహిళలకు ప్రశాంత జీవనాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే, మహిళల నిజమైన సాధికారతకు… నిర్ణయం తీసు కునే ప్రక్రియలో మహిళలు మరింత ఎక్కువగా పాల్గొనడం అవసరం. వారు విభిన్నమైన దక్కోణాలతో చట్టసభల్లో చర్చలు జరిపి, నిర్ణాయక క్రమాన్ని మరింత పరిపుష్టం చేసి, నాణ్యతగా మారుస్తారు.” అని ప్రభుత్వం పేర్కొంది.
ఉజ్వల యోజన అనేది లక్షలాదిమంది నిరుపేద మహిళలపై క్రూరమైన జోక్‌గా మారిందని రుజువైంది. వివిధ సాంకేతిక అభ్యంతరాల కారణంగా వారికి ఉచితంగా సిలిండర్లు రావడం లేదు. దాంతో ఇప్పుడు అత్యంత వ్యయభరితంగా మారిన సిలిండర్లను వారు కొనుగోలు చేయలేకపోతున్నారు. అలాగే, దేశంలో పలు ప్రాంతాల్లో నిర్మించిన తర్వాత, పని చేస్తున్న టాయిలెట్ల సంఖ్యకు సంబంధించి ప్రభుత్వం చెబుతున్న గొప్పలు కూడా కేవలం కాగితాలపైనే. కానీ, నిరుపేద మహిళల పారిశుధ్య పరిస్థితులు పెద్దగా మారలేదని, ఇంకా అలానే కొనసాగుతు న్నాయనేది సిగ్గుచేటైన వాస్తవికతగా వుంది. చట్టసభల్లో మహిళల రిజర్వేషన్‌కు హామీ కల్పించే బిల్లు అమలుకు సుదీర్ఘకాలం పట్టనుండడంతో…ఆచరణలో అత్యంత నిరుత్సాహకరంగా మారిన ఈ పథకాల ప్రస్తావన, సముచితంగా వుంది.
(‘పీపుల్స్‌ డెమోక్రసీ’ సంపాదకీయం)