– మొదటిరోజు ఉదయం 90.41, మధ్యాహ్నం 91.64 శాతం హాజరు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎప్‌సెట్ (ఎంసెట్) రాతపరీక్షలు ఆన్‌లైన్‌లో మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈనెల 11 వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. మంగళవారం మొదటి రోజు అగ్రికల్చర్, ఫార్మసీ విభాగం అభ్యర్థులకు రాతపరీక్షలను నిర్వహించారు. ఈ మేరకు ఎప్‌సెట్ కన్వీనర్ బి డీన్‌కుమార్, కోకన్వీనర్ కె విజరుకుమార్‌రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. మంగళవారం మొదటిరోజు ఉదయం విడతకు 33,500 మంది దరఖాస్తు చేయగా, 30,288 (90.41 శాతం) మంది అభ్యర్థులు హాజరయ్యారని తెలిపారు. 3,212 (9.59 శాతం) మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారని వివరించారు. మధ్యాహ్నం రెండో విడతకు 33,505 మంది దరఖాస్తు చేస్తే, 30,704 (91.64 శాతం) మంది అభ్యర్థులు పరీక్ష రాశారని పేర్కొన్నారు. 2,801 (8.36 శాతం) మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారని తెలిపారు. మంగళవారం ఉదయం ఎప్‌సెట్ ప్రవేశ పరీక్షకు సంబంధించిన పేపర్ కోడ్‌ను ఉన్నత విద్యామండలి చైర్మెన్ ఆర్ లింబాద్రి, జేఎన్టీయూ హైదరాబాద్ వీసీ కట్టా నర్సింహారెడ్డి, రిజిస్ట్రార్ కె వెంకటేశ్వరరావు విడుదల చేశారని పేర్కొన్నారు. మొదటిరోజు ఎప్‌సెట్ రాతపరీక్షలు ప్రశాంతంగా జరిగాయని తెలిపారు. ఎప్‌సెట్ రాతపరీక్షలు జరుగుతున్న తీరును వారు పర్యవేక్షించారు.