అపూర్వం… అద్వితీయం

– 1997-98 బ్యాచ్ విద్యార్థుల సమ్మేళనం
– ఘనంగా సిల్వర్ జూబ్లీ వేడుకలు
నవతెలంగాణ – కమ్మర్ పల్లి 
వారంతా నాలుగు పదుల వయస్సున్న వారే… బాధ్యతల్లో తీరిక లేకుండా గడిపే వారే. అలాంటి వారంతా ఒక్కసారిగా పసి పిల్లలుగా మారిపోయారు. పాతికేళ్ల నాటి ఆ పాత మధుర స్మృతులను గుర్తు చేసుకుంటూ ఆడి పాడారు. మండలంలోని  హాసాకొత్తూర్ లో ఆదివారం జరిగిన 1997-98 బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం అద్భుతంగా సాగింది. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన కార్యక్రమం సాయంత్రం ఆరు గంటల వరకు ఆద్యంతం కోలాహలంగా కొనసాగింది. పాతికేళ్ల క్రితం విడిపోయిన మిత్రులంతా రెండున్నర దశాబ్దాల తర్వాత కుటుంబాలతో సహా కలుసుకున్నారు. చిన్ననాటి మిత్రులను చూసి ఉప్పొంగిపోయారు. ఎక్కడెక్కడో స్థిరపడిన వారంతా ఒక్కచోటకు చేరారు. నాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ బాల్య మిత్రులతో సరదాగా గడిపారు. అనుకోని రీతిలో కోల్పోయిన సహచరులను గుర్తు చేసుకుంటూ కన్నీరుమున్నీరయ్యారు.తమకు మార్గదర్శనం చేసిన ఆనాటి గురువులను ఘనంగా సత్కరించారు. వారు చెప్పిన బోధనలు తమ జీవితాలకు ఎలా బాటలు వేశాయో సోదాహరణంగా వివరించారు. విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులు ప్రతాప్ రెడ్డి, నాగయ్య, రుక్మయ్య, పురుషోత్తం శర్మ, సురేష్ బాబు, ధర్మారెడ్డి, లింబాద్రి, గంగారం, ప్రతాప్ గౌడ్, విజయ లక్ష్మి, బాబురావు, అంజయ్య లకు ఆత్మీయ సత్కారం చేసి, దీవేనలు తీసుకున్నారు. పూర్వ విద్యార్థులను చూసి ఉపాధ్యాయులు సైతం మురిసి పోయారు. వయస్సు మరిచి వారితో కలిసి పోయారు. అనంతరం అందరి కలిసి గ్రూప్ ఫోటోలు దిగి, ఆత్మీయంగా సామూహిక భోజనాలు చేశారు.