చెరువులకు జలకళ

Khammam,Navatelangana,Telugu News,Telangana.– పెద్ద చెరువును సందర్శించిన అధికారులు
నవతెలంగాణ-కల్లూరు
గత వారం రోజుల నుండి ఎడతెరిపి లేకుండా జల్లులతో కూడిన వర్షాలు పడటంతో మండలంలోని చెరువులకు జలకళ సంతరించుకుంది. ఈ నెల 10 వరకు మండలంలోని చెరువులన్నీ పూర్తిగా ఎండిపోయి ఉన్నాయి. అడపాదడపా పడ్డ వర్షాలకు చెరువుల్లోకి 20 నుండి 30 శాతం మాత్రమే నీరు చేరింది. గత నాలుగు రోజుల నుండి ఎడతెరిపి లేకుండా జల్లులుతో కూడిన భారీ వర్షం పడటంతో చెరువుల్లోకి నీరు చేరింది. కల్లూరు పెద్ద చెరువు నిండి అలుగుపడింది. శుక్రవారం సాయంత్రం అధికారులు తహసిల్దార్‌ పులి సాంబశివుడు, ఎండీఓ కే.చంద్రశేఖర్‌, జలవనరుల శాఖ డీఈ రాజా రత్న కుమార్‌, ఎస్సై ఎస్‌కే.షాకీర్‌, పంచాయతీ ఈవో కష్ణారావు కల్లూరు పెద్ద చెరువును సందర్శించారు. పెద్ద చెరువు కట్ట ఎక్కడైనా బలహీనంగా ఉందా.. ఉంటే వాటిని పటిష్ట పరిచేందుకు చర్యలు చేపట్టేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులు జల వనరులు శాఖ అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా జల వనరుల శాఖ డీఈ రాజరత్నం నవతెలంగాణతో మాట్లాడుతూ మండలంలో 88 చెరువులు ఉన్నాయని, వాటిలో ఇప్పటివరకు 20 చెరువులు అలుగుపడ్డాయని, మరి కొన్ని చెరువులు ఈ రాత్రి పడే వర్షాలకు ఆలుగు పడతాయని తెలిపారు. మొత్తం మీద మండలంలోని అన్ని చెరువులకు 75 నుండి 80 శాతం వరకు వర్షపు నీరు చేరిందని తెలిపారు. వర్షాలు పడే అవకాశం ఉంది కాబట్టి పూర్తిస్థాయిలో నిండి అడుగుపడతాయన్నారు. భారీ నుండి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ప్రకటించిందని, ప్రజలు ఎవరు వాగుల వద్దకు, చెరువుల దగ్గరికి వెళ్ళవద్దని అధికారులు ప్రజలను సూచించారు.