నువ్వు, నేను వేర్వేరు అనే ఒక్క భావన చాలు మానవత్వం మగం రూపుదాల్చడానికి మంచీచెడు విచక్షణ తెలిపే సులోచనాలు కావాలి కాని వివేచన పోగొట్టే మతం రంగుటద్దాలు కాదు. మరి ఈశాన్య రాష్ట్రాల మణిహారమైన అసోం… ఏ అద్దాలు పెట్టుకుని తమ సమస్యల్ని చూస్తోంది?
అసోం ముఖ్యమంత్రి హిమంతబిశ్వ శర్మ ‘బహుభార్యత్వ’ నిషేధ బిల్లును ప్రవేశపెట్టబోతున్నట్లు ప్రకటిస్తున్నారు. అలాగే ‘లవ్‌జీహాద్’ అంశాన్ని కూడా ఈ బిల్లులో చేర్చి 2024కి అమలు చేయాలనే నిర్ణయం తీసుకున్నారు. బహుభార్యత్వం చట్టరీత్యా నేరమని అందరికీ తెలిసిందే కదా. మరి ప్రత్యేకంగా అసోంలో ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణమేంటి? అక్కడ గిరిజనులు, ముస్లింలు పెద్ద సంఖ్యలో ఉండటమే. మన దేశంలో స్పెషల్ మ్యారేజ్ యాక్టు 1954, హిందూ మ్యారేజ్ యాక్టు 1955 కింద కొన్ని గిరిజన కమ్యూనిటీలు, గోవా నివాసితులు మినహా హిందూ, బౌద్ధ, జైన, సిక్కులలో బహుభార్యత్వ నిషేధం ఉంది. ఈ చట్టాల కిందకి రాని గిరిజనుల సంఖ్య, 2011 జనాభా లెక్కల ప్రకారం అసోం రాష్ట్ర జనాభాలో 12.4శాతం. అలానే ముస్లింలు కూడా ఈ సాధారణ చట్టం కిందకు రారు. ముస్లిం వ్యక్తిగత చట్టం (షరియత్), 1937, ఒకేసారి నలుగురు మహిళలను భార్యలుగా చేసుకునే వీలు కలిగిస్తుంది. జమ్ముకశ్మీర్ తర్వాత అత్యధికంగా ముస్లింలు ఉన్న రాష్ట్రమైన అసోంలో 2022-23 డేటా ప్రకారం రాష్ట్ర జనాభాలో ముస్లింలు దాదాపు 34.22శాతం(1.07 కోట్లు). కాబట్టి గిరిజన, ముస్లిం వర్గాలలో బహు భార్యత్వం ఉన్నదని, దాన్ని అంతమొందించాలనే లక్ష్యంతో అసోం ప్రభుత్వం ముందుకు సాగడం విచారించదగ్గ అంశం. బహుభార్యత్వ వెసులుబాటు ఉన్నప్పటికీ కేవలం ముస్లిం కుటుంబాల్లోనే ఈ విధానం అవలంబిస్తారన్నది అవాస్తవం.
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (2019-20) ప్రకారం క్రిస్టియన్లు 2.1శాతం, ముస్లింలలో 1.9, హిందువులలో 1.6, మేఘాలయలో 6.1శాతం బహుభార్యత్వ విధానం ఉంది. ఈ లెక్కల ప్రకారం ఒకటి కంటే ఎక్కువ పెండ్లిళ్లు అత్యధికంగా ఈశాన్య గిరిజన జనాభాలోనే ఎక్కువ. దానికి కారణం, నాగరికతకు దూరంగా బతకడం, నిరక్షరాస్యత, పేదరికం, ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన మహిళల దయనీయ స్థితి. ఎన్ని చట్టాలున్నా ముస్లిమేతర మతాలలో కూడా, ప్రత్యేకించి ఎక్కువైతే మహిళలకు ప్రశ్నించగలిగే గళం ఉండదో అక్కడ ఇటువంటి విధానాలు సాధారణమే. మహిళలు, తమ పట్ల జరిగే అన్యాయాలను ఎదురించి నిలవాలంటే వారిలో అక్షరాస్యత పెంపొందించాలి. వారిని స్వశక్తులను చేయడానికి ప్రయత్నాలు చేపట్టాలి. అయితే, ‘బహుభార్యత్వ నిషేధచట్టం తీసుకు రావడంతో మతం, ధర్మంతో సంబంధం లేకుండా మహిళా సాధికారతకు ఇది దారితీస్తుంది’ అని ఉటంకించడం కేవలం గిల్లి జోలపాడటం వంటిదే. ముఖ్యంగా ‘లవ్ జీహాద్’ను పెద్ద బూచిగా చూపడం మనలాంటి ప్రజాస్వామ్య దేశంలో ఆహ్వానించదగిన పరిణామం కాదు.
ఈశాన్యంలోని ఏడు సోదర రాష్ట్రాలలో అసోంకి ప్రత్యేకత ఉన్నది. ఇది విభిన్న సంస్కృతుల మేళవింపు. మంగోలియన్లు, ఇండో బర్మన్లు, ఇండో ఆర్యన్ల అంతర్ మిశ్రమమే ఈ రాష్ట్రం. అసోం రాష్ట్రంలోకి అడుగు పెట్టగానే కనిపించేవి, మబ్బులు పట్టిన ఆకాశం, చిత్తడి నేల, వెదురుతో కట్టిన అందమైన ఇండ్లు. మైఖెలా చాదోర్ (అక్కడి మహిళల ప్రత్యేక దుస్తులు) కట్టుకున్న మహిళలు. వారి భాష, సంస్కృతి పట్ల వారికి అత్యంత ప్రేమ, గౌరవం. బోదో, కచరి, కర్బీ, మిరి, మిషిమి, రభ, ఇలా 24 గిరిజన తెగలు అక్కడ ఉంటాయి. ప్రతి ట్రైక్కి ప్రత్యేక వేష భాష లుంటాయి. అంతా ట్రైబ్స్ హిందువులే. ప్రధాన భాష అసోమీస్. ముఖ్యంగా బోడో, అసోమియా భాష మాట్లాడతారు. అసోమీలలో అత్యధికులు వైష్ణవులు. అసోంలో కూడా కుల వ్యవస్థ ఉంది కాని అది భారతదేశంలోని ఇతర ప్రాంతా లంతా ప్రాముఖ్యత ఉన్నది కాదు. బుద్ధిజం, క్రైస్తవం, ఇస్లాం వీటన్నిటి కలయిక రాష్ట్రం. ఇన్ని మతాలు, వైవిధ్యాలు ఉన్నా అక్కడ ఒకరి మతం పట్ల ఇంకొకరికి సానుకూల ధృక్పథమే తప్ప వైరాలు తెలియవు. ముస్లింల పెండ్లి ఆచారాలలో కూడా హిందూతత్వం కనిపిస్తూ ఉంటుంది. ఏడాదికి మూడుసార్లు జరుపుకునే బిహు పండుగలు ఐక్యంగా చేసుకుంటారు. దేశంలో ఎప్పుడైతే కుల, మతాల ఆధారంగా పాలన ప్రారంభమైందో అక్కడ కూడా హిందూ, ముస్లింల మధ్య కొన్ని విద్వేషపు విషబీజాలు నాటుకున్నాయి.
అసోం ముస్లింలను నాలుగు ఉప వర్గాలుగా విభజించారు. దేశి, మారియా, గౌరియా, సయ్యెద్, వీరు మొఘల్ సైనికులు స్థానిక అసోమీలను పెండ్లి చేసుకుని అక్కడి భాష, సంస్కృతిని ఒంటబట్టించుకున్నవారు. వారి జనాభా దాదాపు 4 మిలియన్లు. సయ్యేట్లు ఇస్లామిక్ మతజ్ఞురువు మహమ్మద్ నాగసులు, దేశీలు ఇస్లాంలోకి మారిన వారు. వీరు ఎక్కువగా గోవలపారియా కోక్రఝార్, ధుబ్రి, సౌత్ సల్మారా మన కవర్ మరియు రాజబన్షిలలో ఉంటారు. మారియలు, 1206లో బందీలయిన ముస్లిం సైనికుల వారసులు, మారియా అంటే లోహాలను కొట్టేవారని అర్థం. గౌరియాలు 1532లో అస్సాంను గెలిచిన తుర్బుక్‌ఖాన్ వారసులు. వీరు బెంగాల్ గౌర్కు చెందినవారు. గౌరియా, మారియాలు మైనారిటీలు. వీరు ఎక్కువగా శివసాగర్, జోర్హాట్, టిన్ సుకియా, గోలాఘాట్, కామరూప్ జిల్లాల్లో ఉంటారు. వీరి మాతృభాష అసోమీస్, బంగ్లాదేశ్ నుండి అసోంకు వలస వచ్చిన పెద్ద సంఖ్యలో ముస్లింలు, బెంగాలీ మాట్లాడే మియా ముస్లింలు బరాక్ వేలీ సిటీటి ముస్లింలకు ప్రసిద్ధి. వీరు ధుబ్రి, మారిగాంవ్, హోజారు, ఇలా మధ్య, కింది అసోం ప్రాంతాలలో ఉంటారు. అసోం జనాభాలో 40శాతం ముస్లింలు ఉంటే అందులో దాదాపు 30శాతం మియా ముస్లింలే. హిందీ బెల్ట్ నుండి వలస వచ్చిన ముస్లిం వలసకారులు రాష్ట్ర జనాభాలో దాదాపు 0.4శాతం. వీరు బ్రహ్మపుత్ర ప్రాంతంలో ఉంటారు.
1979 అసోం మూవ్మెంట్ నుండి మొదలుకుని ఇప్పటి వరకు అక్కడి స్థానికులకు, ఇంకా వలసదారులకు మధ్య భూవివాదాలు సాధారణమే తప్ప దానికి మతం రంగులేదు. ఒకవేళ అంతర్లీనంగా అటువంటి భావనలున్నా దానికి అంత ప్రాముఖ్యత ఉండేది కాదు. బెంగాలీ, బీహారీ వలసదారులు తము భూములను, ఉద్యోగ అవకాశాలను కొట్టేస్తున్నారన్న ఆక్రోశం మాత్రమే వారిలో ఉండేది. కాని గత కొంతకాలంగా హిందూ, ముస్లిం వివాదాలు, ‘లవ్ జీహాద్’ వంటి కొత్త అంశాలు వెలుగులోకి తెస్తున్నారు. అసోం ముఖ్యమంత్రి, ‘లవ్ జీహాద్’ అనే అంశాన్ని లేవదీస్తూ, అధికారికంగా హిందూ, ముస్లిం జంటకు వివాహం జరపకూడదని, అబ్బాయి కాని అమ్మాయి కాని మతం మారకుండా, ప్రత్యేక మ్యారేజ్ యాక్టు కింద మాత్రమే పెండ్లి చేసుకోవాలని ప్రకటించారు. అసోంలో బాల్యవివాహాలు ఎక్కువగా జరుగుతాయి. ఈమధ్య మైనర్ బాలికలను వివాహం చేసుకున్న వ్యక్తులను ప్రభుత్వం పోక్సో చట్టం కిందకి తీసుకొచ్చింది. బాల్యవివాహాలు జరగడానికి కారణం అవిద్య, పేదరికం, చట్టం పట్ల అవగాహన లేకపోవడం. ప్రభుత్వం వీటి మీద దృష్టి పెట్టకుండా, 14ఏండ్లలోపు పిల్లలపై జరిగే లైంగిక నేరాలను, బాల్య వివాహాలను ఒకే గాటిన కట్టి గత కొంతకాలంగా దాదాపు 8వేల మందిని అరెస్టు చేసి తమ క్రూరత్వాన్ని ప్రదర్శించింది! దీన్ని వ్యతిరేకిస్తూ మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు పోరాటాలు చేస్తున్నాయి.
అంతకుముందు స్వదేశీ, విదేశీ భావనలు ప్రజల్లో స్వల్పంగా ఉండేవి. గతేడాది రాష్ట్ర ప్రభుత్వం ‘వీరు మా అసోమీ ముస్లింలు’ అని కొన్ని ముస్లిం వర్గాలను ప్రత్యేకంగా స్వదేశీగా ప్రకటించడంతో, బంగ్లాదేశ్ నుండి వలసొచ్చిన బెంగాలీ ముస్లింలను ప్రత్యక్షంగా ప్రభుత్వం సాక్షిగా వెలివేసినట్టయింది. బెంగాలీ ముస్లింల పట్ల అప్పటికీ ప్రభుత్వం, స్థానికులు జరుపుతున్న హింసాకాండకు దీంతో మరింత ఆజ్యం పోసినట్టయింది. 1971, మార్చి 24 తర్వాత బంగ్లాదేశ్ నుంచి వలసొచ్చిన వారిని అక్రమ వలసదారులుగా లెక్కించడంతో దాడులు నిత్యకృత్యమయ్యాయి. అయితే స్థానికుల అభద్రతాభావానికి మతం రంగు కూడా తగిలింది. బహుభార్యత్వ నిషేధాన్ని తీసుకువచ్చి ముస్లిం మహిళల సానుభూతి పొందవచ్చనే ఆశ ప్రభుత్వ అంతర్మథనం కావచ్చు. కాని వారి అంచనాలు ఎంతవరకు ఫలిస్తాయనేది సందేహమే. మహిళలకు మంచి చేస్తున్నామని చెప్పి ట్రిపుల్ తలాఖ్ రద్దు చేసినప్పుడు కూడా వివిధ కారణాల వలన ఫెమినిస్టులు, ముస్లిం మహిళలు వ్యతిరేకత ఎదుర్కోవలసి వచ్చింది. ఇప్పుడు తీసుకువచ్చే బహుభార్యత్వ నిషేధం, లవ్ జీహాద్‌ల నిర్ణయాలతో మహిళా సాధికారత సందేహాస్పదమే. సాంస్కృతికంగా ఇంత వైవిధ్య భరితమైన ఈశాన్య రాష్ట్రాల్లోనూ విభజన రాజకీయాలు వేళ్లూనుకుంటే పరిస్థితులు మరింత విషమంగా మారే ప్రమాదముంది. అందుకే యావత్ దేశం జాగ్రత్తపడాల్సిన సమయం ఆసన్నమైంది.
శ్రీదేవి కవికొండల
6281380827