అరంజోతి సుక్క

మనువాడడానికి మంచి పోరికి ఇంకో మంచి పోరడు గావాలె, మంచి పోరడికి ఇంకో మంచి పోరి గావాలె. పెద్దోళ్ళు కూసొని ఇసయాలు మాట్లాడుకుంటారు తరువాత. ఇసయాలంటే ఇసయాలే వేరే చెప్పే పనేలేదు. అంతేనా, ఇంగా ఏమేమి గావాలె అని ఆరా తీస్తే మంచి హాలు గావాలె, పురోహితుడు గావాలె. లగ్గం అదే అయిపోతది. అవుండాలె ఇవుండాలె అని చెప్పేవాళ్ళే కాని ఆ తెచ్చినవన్నీ అంటే ఓ రెండు లేదా మూడు నెల్లు కష్టపడి తెచ్చిన వస్తువులన్నీ ఒకే ఒక గంటలో అయ్యోరు ఐపోజేస్తాడు. ముహూర్తం టయానికి జిలకర బెల్లం పెట్టేస్తాడు. అంతే అక్షింతలు చల్లేసి, ఆశీర్వదించేసి, బహు మానం ఇచ్చేసి, భోజనం చేసేసి అతిధులు వెళ్ళిపోతారు. తరువాత ఆ పూజలు ఈ పూజలు చేయించి అరంజోతి సుక్క అదే అరుంధతీ నక్షత్రం చూపించి ఇగ మీ సంసారం మీరే చూసుకోవాలని పురోహితులవారు ఇనాం తీసుకొని తనంతకు తాను పోతాడు. పొద్దున చూపినా కూడా అరజోతి సుక్క కనిపించిందని చెప్పాలె. మొన్న ఓ పెళ్ళికి పోతే కనీసం ఆకాశం కూడా చూపకుండా రేకుల కిందినించే అరంజోతి సుక్కను చూపించినాడు సామి. ఎటూ కనిపించని దాన్ని ఎక్కడ చూపించినా ఒక్కటే కదా అని అందరూ సర్దుకున్రు. మైసూరు పాకులో మైసూరుండదు, వెన్న బిస్కట్లలో వెన్న ఉండదు, ఇదీ అంతే అనుకున్నారు ఇంకొందరు. ఆ మధ్య మా బావ ఓ కథ చెప్పాడు. ఓ రాజుకు తన రాజ్యం, తాను ఆక్రమించిన రాజ్యాలూ అన్నీ చూడాలనిపించింది. మంత్రినడిగాడు చూపించమని. ఆయనేం చేశాడంటే ఆ కనిపించేదంతా నీ రాజ్యమే మహారాజా అన్నాడు. దానవతల ఏముంది అన్నాడు రాజుగారు. ఆ తరువాత సముద్రముంది అన్నాడు అమాత్యులవారు. దానవతల ఏముంది అన్నాడు రాజు మళ్ళీ. దానవతల ఇంకో రాజ్యముంది అన్నాడు. అదెవరిది అన్నాడు తిరిగి. యుద్ధానికి పోదామంటాడేమో అని అదీ మనదే మహారాజా అన్నాడు మహా మంత్రి. అయితే ఓకె అన్నాడు చక్రవర్తి. అలా కనిపించేవన్నీ మనవేనని, కనిపించనివి కూడా మనవేనని అనుకుంటే పరవాలేదు. కానీ కనిపించేదంతా మిథ్య అనే వారు తమ తెలివినంతా ఉపయోగించి మన తెలివి పనిచేయకుండా చేస్తుంటారు. ఆ విషయంలోనే జాగ్రత్తగా ఉండాలి మనం. రాజు గారి గుడ్డలు కనిపించకున్నా కనిపించాయి మహారాజా అనేరోజులు కావివి. అలాగే రాజుగారు ఎంత ఖరీదైన గుడ్డలు వేసుకుంటున్నాడు అని నిలదీసి అడుగుతున్న రోజులు. దేశంలో ఇబ్బంది పడే రాజు విదేశాలకు పోయి అక్కడంతా బాగుంది అనే రోజులు. ఆరోగ్యం, పత్రికా స్వాతంత్య్రం మొదలైన అంశాల్లో ప్రపంచ జాబితాల్లో ఎక్కడో చివర్లో ఉండే మనల్ని చంద్రయాన్‌ మాదిరి ఎక్కడో పైపైకి పోతున్నామని చెప్పేరోజులు. ఇప్పుడు చంద్రయాన్‌ గురించి గొప్పగా చెబుతున్నారు. అది పూర్తిగా సైన్సుకు సంబంధించిన అంశం. సైన్సును నమ్మని వాళ్ళు, ఆ సైన్సు కనిపెట్టిన యానిమేషన్లతో దేవుడి సినిమాలు, దెయ్యాల సినిమాలు, సీరియళ్ళు తీసి, తమ ఎన్నికల వీడియోలు తీసి వాడుకునేవాళ్ళూ కోకొల్లలు. అసలు ఆ శాస్త్రీయ విజ్ఞానం పెంచే సంస్థల్ని మొదటి ప్రధాని నెహ్రూ నుండి నేటివరకూ ఎవరు ఎన్ని స్థాపించారు, ఎవరు ఎన్ని ఆపేశారు అన్న విషయం బయటకు మాట్లాడితే అన్ని వివరాలూ బయట పడతాయి. మసిపూసి మారేడు కాయచేసే జనాల మాటలు ఇక చెల్లుబాటు అయ్యే కాలం లేదు. మా మిత్రుడొకాయన హనుమంతుడు చంద్రయాన్‌ రాకెట్టును అంతరిక్షంలోకి సురక్షితంగా తీసుకు పోతున్నట్టు ఉన్న ఫొటో ఒకటి పంపాడు. అతని నమ్మకం మీద ఎటువంటి కామెంట్‌ చేయలేదు. ఎవరి నమ్మకాలు వాళ్ళవి. ఎవరైనా సైన్సును నమ్మాల్సిందే చివరికి. ఎంత భక్తి ఉన్నవాడైనా అవసరమొస్తే ఆసుపత్రిలో ఆక్సిజన్‌ పెట్టుకోవలసిందే తప్ప నేను పెట్టుకోను అనడు. చంద్రయాన్‌ విజయం దేశం విజయం. దేశ ప్రజలందరి విజయం. మీది మాది మనందరిది అన్నట్టు సమిష్టి విజయం. దాన్ని పక్కదారి పట్టించి అదేదో మా పుణ్యఫలమనో, మా తెలివితేటలనో అంటే ఎవరూ ఒప్పుకోరు. మంచి విమానాల్లో, హెలికాప్టర్లలో, ఖరీదైన కార్లలో తిరిగేవాళ్ళు సైన్సు గురించి తక్కువగా కాకున్నా అదేదో మానవాతీతశక్తి అనంటేనే కోపమొస్తుంది. అన్నం తినే ముందు దేవుడిని మొక్కుకుంటారే కాని రైతన్నను మొక్కుకోవాలి వాస్తవంగా. బస్సుల్లో, రైళ్ళలో ప్రయాణం చేసేవాళ్ళు లైట్లు వేస్తే దేవుణ్ణి మొక్కుకుంటారు. అక్కడ మొక్కవలసింది బొగ్గుగనుల్లో, జలవిద్యుత్‌ ప్రాజెక్టుల్లో, విద్యుత్‌ శాఖలో పనిచేసే కార్మికుల్ని. ఖరీదైన కారు కొన్నప్పుడు పూజ చేయించుకోమనండి అంటారు. ఎవరి ఇష్టం వారిది. అయితే పూజ చేయవలసింది ఆ కారు రోడ్డు మీదికి రావడానికి కారణమైన కార్మికులకు, మొక్కవలసింది టెక్నాలజీకి. మనకు పుష్పక విమానాలు ముందునుండే ఉన్నాయి అని చెప్పడం మాత్రమే టెక్నాలజీ కాదు. అమెరికానుండి ఎఫ్‌ పదహారు విమానాలని, ఫ్రాన్స్‌ నుండి రఫైల్‌ ఫైటర్సును తెచ్చుకుంటున్నామని మరవరాదు. మేక్‌ ఇన్‌ ఇండియా పోయి మళ్ళీ మేడ్‌ ఇన్‌ ఇండియా వచ్చినప్పుడే మళ్ళీ మన కాళ్ళపైన మనం నిలబడ్డామని చెప్పగలం. టెక్నాలజీ పెరిగిపోతోంది, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారమూ పెరిగిపోతోంది. రెండింటినీ కలిపి చంద్రుడిపై ప్లాట్లు కూడా వేసే పనిలో ఉంటారు ఆ జనాలు. అంతేనా అరంజోతి సుక్క పైన కల్యాణ మండపాలు కట్టి అక్కడ పెళ్ళిళ్ళు చేస్తామని చెప్పినా చెప్పొచ్చు. అవెప్పుడో చేశామని చెప్పినా చెప్పొచ్చు జనాలు. మానవుడే మహనీయుడు అని ఆరుద్ర రాశారు కాని ఆ లిస్టులోకి పోయే మహనీయులు కొందరే. గ్రహతారలను అధికమిస్తామని చెప్పేవారే కాని వాళ్ళ మనసులు కుంచించుకుపోతున్న మరుగుజ్జు గోళాల్లా తయారవ్వడమే కాదు, ప్రజల మనసులను కూడా అలాగే చేసేస్తున్నారు. ఆ మాయలో పడినోళ్ళను బయటకు తేవడమే ఇప్పుడు కావలసిన ఇంటెలిజెన్సు అంటే తెలివన్న మాట. అదేదో కృత్రిమ తెలివని, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్సు అనీ ఈ మధ్య తెగ ఇదైపోతున్నారు మనుషులు. అసలు నిజమైన తెలివికే తట్టుకోలేకపోతున్నామనుకుంటూ ఉంటే మధ్యలో ఇదొకటా అని తలబాదుకునే వాళ్ళూ ఉన్నారు. అదేదైనా ప్రజలకు ఉపయోగపడితే మేలు.
– జంధ్యాల రఘుబాబు
సెల్‌:9849753298