ముంబయి: పారిస్ ఒలింపిక్స్ మహిళల టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణులు చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. మహిళల టీమ్ ఈవెంట్‌లో క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్న తొలి భారత జట్టుగా ఘనత సాధించింది. మన జట్టు ఈ రికార్డును చేరుకోవడంలో 24ఏళ్ల అర్చనా కామత్ కీలక పాత్ర పోషించింది. అయితే, తాజాగా ఆమె సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రొఫెషనల్ టేబుల్ టెన్నిస్‌కు వీడ్కోలు పలికింది. అకడమిక్ కెరీర్‌లో ముందుకుసాగడం కోసం ఆటను వదిలిపెట్టినట్లు ఆమె కోచ్ మీడియాకు తెలిపారు. పారిస్ గేమ్స్ ముగించుకొని భారత్‌కు తిరిగొచ్చిన తర్వాత అర్చన తన కెరీర్ గురించి కోచ్ అన్షుల్ గార్గ్‌తో సుదీర్ఘంగా చర్చించిందట. నాలుగేళ్ల తర్వాత లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో ఆడే ఆర్థిక అవసరాల దృష్ట్యా ఆటకు దూరంగా ఉండాలని ఆమె నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ”పతకం సాధించడం చాలా కష్టమైన పనే అని నేను చెప్పా. ఆమె వరల్డ్ 100 ర్యాంకుల జాబితాలో లేదు. గత రెండు నెలలుగా ఆమె ఎంతో కష్టపడుతున్నప్పటికీ.. ప్రొఫెషనల్ కెరీర్ కోసం మరింత కఠోర శ్రమ అవసరం అని వివరించా. దీంతో ఆమె విదేశాలకు వెళ్లి ఉన్నత విద్యను అభ్యసించాలని నిర్ణయించుకుంది” అని కోచ్ వివరించారు.