రైౖతు సమస్యలు, నీటిపారుదల ప్రాజెక్టులపై చర్చకు సిద్ధమా?

రైౖతు సమస్యలు, నీటిపారుదల ప్రాజెక్టులపై చర్చకు సిద్ధమా?–  హరీశ్‌రావుకు మంత్రి జూపల్లి సవాల్‌
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
రైతు సమస్యలు, నీటి పారుదల ప్రాజెక్టులు, గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ అవినీతిపై చర్చకు సిద్ధమా? మాజీ మంత్రి హరీశ్‌రావుకు మంత్రి జూపల్లి కష్ణారావు సవాల్‌ విసిరారు. సమయం, తేదీ, వేదిక ఎక్కడో చెప్పాలని డిమాండ్‌ చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌ ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణరెడ్డి, వీరపల్లి శంకర్‌, వంశీకృష్ణ, రాజేష్‌రెడ్డితో కలిసి విలేకర్లతో ఆయన మాట్లాడారు. పంట నష్ట పరిహారం ఇవ్వకుంటే సచివాలయాన్ని ముట్టడిస్తామన్న హరీశ్‌రావు వ్యాఖ్యలను ఆయన ఖండించారు. అసలు సినిమా ముందుందనీ, బీఆర్‌ఎస్‌ హయాంలో జరిగిన అవినీతిని బయటపెడతామని హెచ్చరించారు. బీఆర్‌ఎస్‌ నేతల తప్పులన్నీ బయట పెట్టాక తలకాయ ఎక్కడ పెట్టుకుంటారని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ నేతలు సచివాలయాన్ని ముట్టడించడం కాదనీ, పదేండ్లుగా రాష్ట్ర ఖజానాను బీఆర్‌ఎస్‌ నాయకులు ముట్టడించారని ఎద్దేవా చేశారు. ఏపీ ప్రభుత్వం రాయలసీమకు నీళ్లు తరలించుకుపోతుంటే మాజీ సీఎం కేసీఆర్‌ గుడ్లు అప్పగించి చూశారని విమర్శించారు. కొత్త ప్రాజెక్టులను పూర్తి చేయలేదన్నారు. పాత ప్రాజెక్టుల నిర్వహణను గాలికొదిలేశారని విమర్శించారు. పదేండ్లలో ఎప్పుడైనా పంట నష్టానికి పరిహారం ఇచ్చారా? ఇన్‌పుట్‌ సబ్సిడీ, పంటల బీమాను అమలు చేశారా ? అని ప్రశ్నించారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో లబ్ధి కోసమే హరీశ్‌రావు అబద్ధాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. కేసీఆర్‌ అనాలోచిత నిర్ణయాల వల్లే తెలంగాణలో ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ నాయకులకు రైతుల గురించి, వ్యవసాయం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని తెలిపారు. గతంలో వరి వేస్తే ఉరి అన్నది మీరు కాదా? రైతులకు వరి వేయద్దని చెప్పి…. ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో వరి వేసింది ఎవరో అందరికీ తెలిసిందేనన్నారు. అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతన్నలకు కాంగ్రెస్‌ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. పంట నష్టంపై సీఎం రేవంత్‌ రెడ్డి వెంటనే స్పందించి, పంట నష్టంపై సమగ్ర నివేదిక అందజేయాలని అధికారులను ఆదేశించారని గుర్తు చేశారు. నివేదిక రాగానే రైతులకు ఎకరానికి రూ.10 వేల నష్ట పరిహానం చెల్లిస్తామన్నారు. వచ్చే వాన కాలం సీజన్‌ నుంచి పంటల బీమా పథకాన్ని అమలు చేస్తామని పేర్కొన్నారు. అన్నదాతల కష్టాలు, కడగండ్లు గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాపమేనన్నారు. బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక తెలంగాణ రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు ఆగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత పదేండ్లలో 6, 651 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని గుర్తు చేశారు. మేడిగడ్డ ప్రాజెక్ట్‌ కుంగుబాటు మీ పాపం కాదా? వర్షం కాలం సీజన్‌లో అధికారంలో ఉంది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కాదా? మరి ప్రాజెక్టుల్లో నీళ్లు ఎందుకు నింపలేకపోయారని నిలదీశారు. ప్రతీ నీటిని బొట్టును ఒడిసి పడితామని చెప్పి…సకాలంలో ప్రాజెక్టులను పూర్తి చేయలేదన్నారు. కట్టిన ప్రాజెక్టులను కూడా కూలిపోయే పరిస్థితులు ఉన్నాయన్నారు. పాలమూర్‌ – రంగారెడ్డి ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదో సమాధానం చెప్పాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆదరబాదరగా పాలమూర్‌ – రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారనీ, కానీ ఒక్క ఎకరానికి కూడా నీళ్లివ్వలేకపోయారని విమర్శించారు.కాంగ్రెస్‌ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని తెలిపారు. బీఆర్‌ఎస్‌ నాయకులు దిగజారుడు రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు.