పాఠ్య పుస్తకాలు అందేనా..?

– జిల్లా గోదాంకు చేరిన గ్రేటర్‌ జిల్లాల పాఠ్యపుస్తకాలు
– 33.59 లక్షల పుస్తకాల కోసం ప్రతిపాదనలు
– 17.54 లక్షల టెక్ట్స్‌ బుక్స్‌ చేరిక
– బడి తెరిచే నాటికి విద్యార్థుల చేతికి అందించేందుకు అధికారుల కసరత్తు
నవతెలంగాణ-సిటీబ్యూరో
ప్రభుత్వ విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలను అందిం చేందుకు విద్యాశాఖ అవసరమైన కసరత్తు చేస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఏటా పాఠ్యపుస్తకాలు సకాలంలో అందడం లేదు. చాలా రోజులు పుస్తకాల్లేని చదువులకే విద్యార్థులు పరిమితమయ్యేవారు. ప్రతియేటా స్కూళ్లు పున: ప్రారంభం రోజునే పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తులు విద్యాశాఖ పంపిణి చేస్తామని చెబుతున్నా.. ఆచరణలో సాధ్యం కావడం లేదు. అయితే ఈ విద్యాసంవత్సరం అటువంటి పరిస్థితి ఏర్పడకుండా విద్యాశాఖ అధికారులు ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టారు. ఈ మేరకు 1 నుంచి పదో తరగతి విద్యార్థులకు బడి తెరిచిన రోజే అందజే యాల్సిన ఉచిత పాఠ్య పుస్తకాలను జిల్లాకు పంపిస్తున్నారు. గ్రేటర్‌ పరిధిలోని మూడు జిల్లాల్లో ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలలతో పాటు బీసీ, మైనార్టీ స్కూళ్లులో చదివే విద్యార్థులకు వీటిని పంపిణీ చేయనున్నారు.
గ్రేటర్‌ జిల్లాలకు 33.59లక్షల పుస్తకాలు అవసరం..
గ్రేటర్‌లోని మూడు జిల్లాలో అన్ని యాజమాన్యాల పరిధిలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్‌లు, కస్తూర్బా, రెసిడెన్షియల్‌, సోషల్‌ వెల్ఫేర్‌, మైనారిటీ గురుకులాలు, మోడల్‌ స్కూళ్ల వంటి పాఠశాలలు ఉన్నాయి. దాదాపు 2 వేలకు పైగా బడుల్లో సుమారు 4 లక్షల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఆయా పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వమే ఏటా ఉచితంగా పాఠ్యపుస్తకాలను అందిస్తోంది. మొత్తం 190 టైటిల్స్‌ పుస్తకాలు అవసరం ఉంటాయి. ఇక తరగతుల వారిగా ఒక్కొ విద్యార్థికి 5 నుంచి 11 పుస్తకాలు అందించాల్సి ఉంటుంది. దీంతో ఈ ఏడాది జిల్లాలోని ఆయా పాఠశాలలకు సుమారు 33.59లక్షలకుపైగా పుస్తకాలు అవసరమని జిల్లా విద్యాశాఖ అధికారులు విద్యాశాఖకు నివేదించారు. ఆ మేరకు విద్యాశాఖ డైరెక్టరేట్‌ నుంచి జిల్లాకు దాదాపు 33.59 లక్షల పుస్తకాలు కేటాయించారు. కాగా, ఇందులో గతేడాది మిగిలిన పుస్తకాలతో కలిపి ఇప్పటివరకు జిల్లా గోదాముకు 17.54లక్షల వరకు పాఠ్యపుస్తకాలు చేరాయని అధికారులు తెలిపారు. తెలుగు, ఇంగ్లీష్‌, ఉర్ధూ, హింది మీడియంలో మొత్తం 190 టైటిల్స్‌ ఉండగా.. ఇవన్ని విద్యార్థులకు అవసరమవుతాయి. ఇవికాక తమిళ, మరాఠి, ఇతర భాషాలకు సంబంధించి పాఠ్య పు స్తకాలు కూడా ఉంటాయి. అయితే గ్రేటర్‌ జిల్లా లకు ఇప్పటివరకు కేవలం 30 శాతం మేర పాఠ్యపు స్తకాలు చేరినట్టు తెలుస్తోంది. మరో 70శాతం వరకు పుస్తకాలు చేరేందుకు ఎంత సమయం పడుతుందో తెలియదు. ప్రభుత్వ నిర్ణయం మేరకు జూన్‌ 12 లోగా విద్యార్థులకు చేతికి పుస్తకాలు అందించాల్సి ఉంటుంది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి.
మండల కేంద్రాల నుంచి విద్యార్థులకు..
హైదరాబాద్‌, మేడ్చల్‌-మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాలకు సంబంధించిన ఉచిత పాఠ్యపుస్తకాలు రామాంతపూర్‌లోని గోదాంల్లో భద్రపరిచారు. వీటిని మండల విద్యాధికారుల ద్వారా మండల కేంద్రాల్లోని మండల రిస్సోర్స్‌ కేంద్రాలకు చేరవేస్తారు. అక్కడి నుంచి పాఠశాల ప్రధానోపాధ్యాయులు తీసుకెళ్లి విద్యార్థు లకు అందించాల్సి ఉంటుంది. ఈ నెల చివరి కల్లా విద్యార్థులకు అందుబాటులోకి వస్తాయని అధికారులు చెబుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు చూస్తే మరోలా ఉన్నాయి. ఉదాహరణకు హైదరాబాద్‌ జిల్లాకు సంబంధించి ఇప్పటివరకు చైల్డ్‌ ఇన్ఫో వివరాలు సమర్పించకపోగా, గోదాం నుంచి ఆయా పాఠశాలలకు పుస్తకాలను చేరేవేసేందుకు కావాల్సిన ట్రాన్స్‌పోర్టుపై జిల్లా విద్యాశాఖ అధికారుల నుంచి స్పష్టత కరువైందని అక్కడి అధికా రులు చెప్పారు. దాదాపు నెలరోజులగా చెబుతున్నా పట్టించుకునే వారు లేరని తెలిపారు. హైదరాబాద్‌ జిల్లాకు సంబంధించి ఇప్పటి వరకు మైనార్టీ రెసిడెన్షియల్‌కు 1.70లక్షల అవసరముండగా.. 1.20లక్షల పంపించారని, సోషల్‌ వెల్పేర్‌ సంబంధించి 20,720కుగాను 7,920 పంపినట్టు తెలిపారు. మేడ్చల్‌- మల్కాజిగిరి సంబంధించి 5.94లక్షల అవసరముండగా.. 4.20 లక్షలు చేరగా.. ఇందులో ఇప్పటివరకు 30వేల పుస్తకాలు సరాఫర చేసినట్టు సంబంధిత అధికారులు పేర్కొన్నారు. ఇక రంగారెడ్డి జిల్లాకు సంబంధించి చూస్తే.. రెండు విడుతల్లో పంపిణీకి మొత్తం 13.56లక్షలు అవసరం కాగా.. వీటిలో మొదటి విడుత కింద 10.09లక్షలకు..6.28లక్షలు పుస్తకాలు వచ్చాయి. ఇప్పటివరకు స్కూళ్లకు సరఫరా చేయలేదు. బడుల ప్రారంభంనాటికి విద్యార్థుల చేతిలో పుస్తకాలు పెట్టాలన్నా ప్రభుత్వ సంకల్పానికి తగ్గట్టుగా జిల్లాల విద్యాశాఖ అధికారులు పనిచేస్తున్నట్టు కనిపించడం లేదు. ఈ విషయంపై సంప్రదించినప్పటికీ వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం గమనార్హం.
9వ తరగతికీ బై లింగ్వల్‌..
కార్పొరేట్‌కు ధీటుగా అన్ని పాఠశాలల్లో గత విద్యాసంవత్సరం నుంచి 8వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమాన్ని ప్రభుత్వం ప్రారం భించిన విషయం తెలిసిందే. ఈ విద్యాసంవత్సరం 9వ తరగతి విద్యార్థులకు సైతం బైలింగ్వెల్‌ పుస్తకాలను ఇవ్వనున్నారు. ప్రస్తుతం పుస్తకాలను ఒక వైపు తెలుగు మీడియంలో, మరో వైపు ఇంగ్లిష్‌ మీడియంలో వచ్చేలా బైలింగ్వెల్‌గా ప్రింట్‌ చేస్తున్నారు. పిల్లలు తమకు అర్థం కాని విషయాలను తెలుగు, ఆంగ్ల భాషల్లో చదువుకోనున్నారు. ప్రతి పాఠాన్ని రెండు వైపులా తెలుగు, ఇంగ్లిష్‌లో ముద్రించడంతో విద్యార్థులకు విజ్ఞానం పెరుగుతుంది. క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయగానే పాఠ్యాంశాలకు సంబంధించిన మరింత సమాచారంతో పాటు పాఠ్యపుస్తకాలు పక్కదారి పట్టకుండా ప్రతి పుస్తకానికి క్యూ ఆర్‌ కోడ్‌ ముద్రించి జిల్లాలకు పంపిస్తోంది.